సమ్మర్లో జలుబుతో బాధపడుతున్నారా.. ఇలాచేస్తే ఉపశమనం లభిస్తుంది!

చల్లటి వాతావరణంలోనే ఎక్కువగా జలుబుచేస్తుంది అనుకుంటారంతా..కానీ..ఎండలు ముదిరినప్పుడు కూడా జలుబుచేస్తుంది. అంటే శరీరంలో చల్లదనం ఎక్కువైనా జలుబు చేస్తుంది, బాగా వేడిచేసినా జలుబుచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల ఒక్కసారిగా వైరస్ లు చుట్టుముట్టేస్తాయి. నీరసంగా అనిపిస్తుంటుంది..కొందరిని ఏవో అలర్జీలు వేధిస్తుంటాయి. ఎంత చురుకుగా ఉందామన్నా నిస్సత్తువ ఆవహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో వేడిగాలల వల్లే ఎక్కువమందికి జలుబు చేస్తుంది. వేడి వాతావరణంలో రైనోవైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. తుమ్ములు, ముక్కు కారటం, దురద, గొంతు నొప్పి వేధిస్తుంటాయి. కొందరికి జలుబుచేస్తే జ్వరం, చెమటలు పట్టడం, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పైగా సాధారణ జలుబు అయితే వారంపదిరోజుల్లో తగ్గిపోతుంది కానీ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం చాలా రోజుల పాటూ ఇబ్బంది పెడుతుంది. అయితే వేసవిలో జలుబుతో బాధపడేవారు బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు… వైద్యుల వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండదు.

నిద్ర మంచి ఉపశమనం
అనారోగ్యంగా ఉన్నప్పుడు నిద్రకు మించిన ఉపశమనం లేదనే చెప్పాలి. అందుకే జలుబు, నిస్సత్తువ అనిపించినప్పుడు ఎక్కువసేపు నిద్రపోవాలి. అప్పుడే ఊహించనంత ఉపశమనం లభిస్తుందంటారు వైద్యులు

తినడం మానొద్దు
చాలామంది ఒంట్లో నలతగా ఉంటే తినడం మానేస్తారు. ఇది చాలా పొరపాటు అంటారు వైద్యులు. రోగం నుంచి బయట పడాలంటే మాత్రం బాగా తినాలి. ద్రవ పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలను అస్సలు తీసుకోవద్దు. జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం, సొంపు గింజలు, ఫుదీనా వంటి సహజ పదార్థాలు వేసి తయారు చేసుకునే హెర్బల్ టీ తాగడం మంచిది. విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం ముఖ్యం. ఐరన్, జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ మూలికలు దివ్యఔషధం
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఔషధ గుణాలు కలిగిన కొన్ని మూలికలు వైరస్ లను చంపి జలుబుతో పోరాడేలా సహాయపడతాయి. అందుకే లికోరైస్ రూట్స్, ఎల్డర్ బెర్రీ, వెల్లుల్లి వంటి ప్రసిద్ధ మూలికలు తీసుకోవడం మంచిది.

పసుపు అద్భుతమైన ఔషధం
జలుబు అద్భుతమైన ఔషధం పసుపు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన పసుపు జలుబుని త్వరగా నయం చేస్తుంది. ఇందులోని కర్కుమిన్ యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది. శరీరాన్ని శక్తివంతం చేసి అనారోగ్యాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. పాలల్లో పసుపు వేసుకునితాగడం… పసుపు వేసిన వేడినీటిని ఆవిరి పట్టడం చేయొచ్చు

శుభ్రంగా ఉండాలి
జలుబు అంటువ్యాధి. అందుకే జలుబు వచ్చిన వారికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి, తేమ వాతావరణంలో బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పరిసరాల పరిశుభ్రత అవసరం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం.దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం….