స్వింగ్ సీట్స్ – పార్టీలకు ముచ్చెమటలు..

కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. ఇంటింటికి ప్రచారం ప్రశాంతంగా సాగుతోంది. దొడ్డిదారుల్లో ఓటర్లను ఆకర్షించే పార్టీలు తమ పనిలో బిజీగా ఉంటున్నాయి. బుధవారం జరిగే పోలింగ్ లో కొన్ని కీలక నియోజకవర్గాలపై కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అక్కడ కొన్నింటినీ సొంతం చేసుకుంటే ఘనవిజయం ఖాయమన్నట్లుగా ముందుకు సాగుతున్నాయి..

ఆ 74 నియోజకవర్గాలు

ఈ సారి ఎన్నికల ప్రచారానికి, వ్యూహాలకు 2018 ఫలితాలనే పార్టీలన్నీ ప్రామాణికంగా తీసుకున్నాయి. జయాపజయాలను నిర్ణయించే నియోజకవర్గాలు దాదాపు 40 శాతం ఉన్నాయి. వాటిని స్వింగ్ సీట్స్ అంటున్నారు. అన్ని పార్టీలకు నిద్ర పట్టకుండా చేస్తున్న నియోజకవర్గాలు కూడా అవేనని చెప్పాలి. గత ఎన్నికల్లో పది వేల కంటే తక్కువ మెజార్టీతో ఫలితం వచ్చిన 74 నియోజకవర్గాలను కాంగ్రెస్, బీజేపీ రెండూ పార్టీలు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 37 చోట్ల గెలిస్తే, బీజేపీ 27, జేడీఎస్ 10 చోట్ల విజయభేరీ మోగించాయి. ఐదు నియోజకవర్గాల్లో విన్నింగ్ మార్జిన్ వెయ్యి ఓట్ల కంటే తక్కువగా ఉంది. మస్కీలో 213, పావగడలో 409, హీరేకేరూర్లో 555, కుండ్గోల్ లో 634, ఆలంద్ లో 697 ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలిచారు. ఐదు వేల కంటే తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు 24 ఉంటే అందులో కాంగ్రెస్ గెలిచినవి 18గా గుర్తించారు.మిగతా చోట్ల బీజేపీ విజయం నమోదు చేసుకుంది…

కాంగ్రెస్ కే కీలకం

తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాలు కాంగ్రెస్ కే కీలకం కావచ్చు. వెయ్యి మెజార్టీ కంటే తక్కువ ఓట్లతో ఫలితం వచ్చిన ఐదు నియోజకవర్గాల్లో నాలుగు కాంగ్రెస్ వారివే. ఈ ఐదేళ్ల కాలంలో అక్కడి ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో వాళ్లు అందుబాటులో ఉండరని చెప్పుకుంటున్నారు. పైగా ముందు నుంచి అక్కడ చాప కింద నీరులా పనిచేసుకుంటూ వస్తోంది. తమ ఎమ్మెల్యే లేకుపోయినా జనంలో ఉంటూ వారి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.కాంగ్రెస్ బలం పుంజుకునేందుకు ప్రయత్నించకపోవడం, బీజేపీ అక్కడ బలం పెంచుకోవడం ఇప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది.

బీజేపీకి ఘన విజయాలు…

తక్కువ మార్చిన్ తో గెలిచిన నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో ఎక్కువ ఉంటే, ఎక్కువ మెజార్టీతో గెలిచిన వాళ్లు బీజేపీ ఎమ్మెల్యేలయ్యారు. 2018లో బీజేపీ 104 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే అందులో 77 చోట్ల పదివేల కంటే ఎక్కువ మార్జిన్ నమోదైంది. బెల్గాం దక్షిణ నియోజకవర్గంలో బీజేపీకి దాదాపు 59 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ ఓట్లను సీటు షేరుగా మార్చుకునేందుకు ఈ సారి బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కమలం పార్టీకి భారీ విజయాలు నమోదైన చోట్ల కనిష్టంగా 20 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే ఓట్ షేర్ సమానంగా పంపిణీ అయి ఉంటే సీట్ల సంఖ్య బాగా పెరిగి సొంత మెజార్టీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చేది. అందుకే ఇప్పుడు ఆయా నియోజక వర్గాలో క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడం ద్వారా బీజేపీ నేతలు స్థానిక ప్రజలకు చేరువయ్యారు..