చార్జిషీట్ల ఉద్యమంలో బీజేపీ – మీరూ భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా ?

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. నాలుగేళ్ల పాలనా కాలంలో వైసీపీ సర్కార్ చేసిన నిర్వాకాలపై ఎక్కడిక్కడ చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. అయితే తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న వైసీపీ పాలనా విచిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే రాజకీయ పార్టీగా .. తాము వేసే చార్జిషీట్ల గురించి కాకుండా.. ప్రజల నుంచి వచ్చే ప్రధానమైన సమస్యలతో చార్జిషీట్లు దాఖలు చేసేలా చూడాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం బీజేపీ ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ప్రజా ప్రతినిధుల అవినీతి, అక్రమాల పై ఎవరికి పిర్యాదు చేయాలనీ ఆలోచిస్తున్న వారందర్నీ.. బీజేపీతో కలిసి పోరాడేందుకు ఆహ్వానిస్తోంది.

అభియోగపత్రాల స్వీకరణ కేంద్రాల ఏర్పాటు !

ఏపీ బీజేపీ చార్జిషీట్ల ఉద్యమంలో ప్రజల్ని.. ప్రభుత్వ బాధితుల్ని భాగం చేసేందుకు అభియోగ పత్రాలను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర కార్యాలయం దగ్గర్నుంచి గ్రామ కార్యాలయం వరకూ ప్రతీ చోటా..బీ జేపీ నేతలు ప్రజలు ప్రభుత్వంపై ఇచ్చే అభియోగాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని అభియోగాలకు లెక్కాపత్రం ఉంటుంది. ప్రతీ దానికి పరిష్కారం చూపేలా..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యేక ప్రయత్నాలు కూడా చేస్తారు. బిజెపి ఏర్పాటు చేస్తున్న అభియోగ పత్రాల స్వీకరణ కేంద్రంలో పూర్తి వివరాలు అందిస్తే.. ప్రజా సమస్యలపై ప్రజా చార్జ్ షీట్ నమోదు చేయించి పరిష్కారానికి బిజెపి పోరాడుతుందని భరోసా ఇస్తున్నారు.

లక్షల సంఖ్యలో చార్జిషీట్లు !

ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లు వేస్తున్న బీజేపీ నేతలకు.. క్షేత్ర స్థాయిలో అడుగడుగుకో అక్రమం కనిపిస్తోంది. వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ దగ్గర నుంచి సంక్షేమ పథకాల్లో అర్హులను కూడా ఎలా పక్కన పెట్టారో అనేక విషయాలు వెల్లడవుతూ వస్తున్నాయి. వీటన్నింటిపై చార్జిషీట్టలను రెడీ చేశారు. కేవలం పాలనా పరమైన విషయాలే కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందినట్లుగా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల్నే నిందితులుగా మార్చిన కేసులో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఆధారాలతో సహా చార్జిషీట్లను రెడీ చేస్తున్నారు బీజేపీ నేతలు.

చార్జిషీట్లతోనే ప్రజా ఎజెండా రూపకల్పన

ప్రధానమైన సమస్యలను ఇప్పటికే చార్జిషీట్ల రూపంలో తెలుసుకుంటున్న బీజేపీ నేతలు.. వాటి నుంచి ప్రజా ఎడెండాను సిద్ధం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన సమస్యలను వీటి నుంచే గుర్తించి.. వాటి పరిష్కారమే ఎన్నికల ఎజెండాగా మార్చనున్నారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ యంత్రాంగం మొత్తం కృషి చేస్తోంది. ఏపీలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇంత మైక్రో లెవల్‌కు వెళ్లి ప్రభుత్వ అరాచకాలను వెలికి తీయలేదని.. తమ ప్రయత్నంలో ప్రజలు కలసి రావాలని కోరుతోంది.