“బుజ్జి నాన్న” మంత్రులతో రైతులకేంటి ఉపయోగం !?

మొలకలొస్తే నేనేం చేస్తాను ఎర్రి.. అని ఓ తన గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ రైతును పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావుగారు విసుక్కున్న తీరు చూస్తే ఎవరికైనా ఆయన మీద కోపం రాదు. ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు తమ మీద తమకే కోపం వస్తుంది.పైగా ఎర్రిపప్ప అంటే.. బుజ్జి నాన్న అనే అర్థం అని సదరు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పుకున్న వైనం చూసిన తర్వాత.. ఇక ఏపీ ప్రజలు మా వల్ల కాదు బాబూ అనుకోకుండా ఉంటారా ? ఇక్కడ తప్పు మంత్రిది కాదు ప్రభుత్వానిదే. ప్రభుత్వ వ్యవహారశైలినే ఆయన బయట పెట్టారు.

ప్రభుత్వంలో కొరవడిన అప్రమత్తత !

అకాల వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వం వైపు నుంచి ఒకటే ప్రకటన వస్తోంది. అదేమిటంటే రైతులు ఎవరూ అధైర్యపడవద్దు.. అండగా ఉంటామని. ఎప్పుడు అండగా ఉంటారో.. ఎలా అండగా ఉంటారో మాత్రం కనీస స్పందన ఉండటం లేదు. సీఎం గారు స్వయంగా సమీక్ష చేశారు. అందర్నీ ఆదుకోవాలని ఆదేశించారని మీడియాకు ప్రకటన ఇచ్చారు. ఎలా ఆదుకుంటారు.. ఎకరానికి ఎంత ఇస్తారన్న సమాధానం మాత్రం అందులో లేదు. ఇది ఉత్తుత్తి భరోసా కాదా మారి.

మాటలు మాత్రం కోటలు దాటి పోతున్నాయి !

ఇక తడిచిన ధాన్యం గురించి చెప్పిన మాటలయితే కోటలు దాటిపోయాయి. వాస్తవ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. రైస్ మిల్లర్లు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. ఆరు గాలం శ్రమించి చేతికి వచ్చిన పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందామని అనుకుంటున్న సమయంలో రాత్రికి రాత్రి వచ్చిన పంట వర్షార్పణం అయింది. వర్షం వస్తుందన్న సూచనలు.. జాగ్రత్తలు ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. కనీసం వానల నుంచి రక్షించుకోవడానికి పట్టాలు ఇవ్వడం లాంటి సాయాలు చేయలేదు. చివరికి ధాన్యాన్ని మూటగట్టుకునేందుకు గోతాలు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ధాన్యం తడిచిపోయిందంటూ… పదో పరక్కో వారి కష్టాన్ని దోచుకునేందుకు మిల్లర్ల సాయంతో కుట్రలు చేస్తున్నారు. అన్నదాతను ఇంత దారుణంగా దోచుకోవాలంటే మనసెలా వస్తుందో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది.

సమస్యలు అలవాటయిపోతాయిలే అన్నట్లుగా ప్రభుత్వ విధానం

ముందు మాటలు చెప్పి టైం పాస్ చేస్తే … తర్వాత అందరూ మర్చిపోతారులే అన్నదే ప్రభుత్వ వ్యూహం కానీ.. రైతుల్ని కాపాడుదాం.. వారి బాధల్ని పంచుకుందాం అన్న ఆలోచన లేనే లేదు. ముఖ్యమంత్రి జగన్ గారికి ఎంత బీభత్సం సృష్టించినా కనీసం పరామర్శ చేసే తీరిక ఉండదు. ఎవరైనా రైతులు మంత్రులకి గోడు వెళ్లబోసుకుంటే నారిని నానా రకాల తిట్లు తిడతారు. ఇంత మాత్రం దానికి ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పరిపాలన అని పేరు పెట్టుకోవడం ఎందుకు?

ప్రభుత్వం ప్రచారాన్ని ప్రకటలను పక్కన పెట్టి.. తక్షణం రైతులకు సాయమే ఎజెండా పని ప్రారంభించారు. ప్రతి ఒక్క రైతు దగ్గర్నుంచి తేమ శాతంతో సంబంధం లేకుండా చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి. తక్షణం వారికి చెల్పింపులు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం మేలుకుంటుందా ?