కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఏడాది ముందు నుంచి ఏర్పాట్లలో ఉన్న బీజేపీ అన్ని వర్గాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తునే ఉంది. ఏడాదిపైగా కన్నడ రాజ్యంపై దృష్టి పెట్టిన చాణుక్యుడు అమిత్ షా ప్రతీ అడుగు ఆచి తూచి వేశారు..
మిషన్ 150 దిశగా..
గతేడాది మార్చి, ఏప్రిల్ లోనే బీజేపీ కర్ణాటకలో మిషన్ 150పై దృష్టి పెట్టింది. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కనీసం 150 స్థానాలు గెలవాలన్నది ఆ పార్టీ ధ్యేయం. ఇప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావడం, సీట్లు దక్కలేదని అలిగి కొందరు నేతలు పార్టీని వదిలి వెళ్లడం లాంటి కారణాలు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అయినా సరే విజయానికి ఎలాంటి ఢోకా లేదని అమిత్ షా చెబుతున్నారు. ప్రచారం ముగుస్తున్న సందర్బంగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన హోం మంత్రి, కర్ణాటకలో మేజిక్ ఫిగర్ అయిన 113 కంటే కనీసం 15 సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పుకున్నారు. అంటే మిషన్ 150 కుదరని పరిస్థితే ఉంటే, 130 మాత్రం ఖాయమని ఆయన చెప్పుకొచ్చారు.
సర్వేలు కాదు.. జనంలో ఉన్నాం….
కొన్ని రాజకీయ ముఠాలు పనిగట్టుకుని సర్వేలు చేయించుకుంటున్నాయని వాళ్లు గెలవరని అమిత్ షా జోస్యం చేప్పేశారు. తమకు 130 స్థానాలు వస్తాయని ఏ పార్టీ ఆయినా చెప్పుకుంటే అది తప్పుడు సర్వే మాత్రమే అవుతుందని, అనుకూలంగా చేయించుకున్న సర్వే మాత్రమే అవుతుందని షా తేల్చేశాారు. క్షేత్రస్థాయిలో పనిచేసినదీ బీజేపీ మాత్రమే అయినందున జనం తమ వైపున ఉన్నారని అందుకే బీజేపీకి సునాయాసంగా 130 స్థానాలు వస్తాయని చెప్పానని అమిత్ షా తన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
మహిళా ఓట్లే శ్రీరామరక్ష…
మహిళా ఓటర్లే తమకు శ్రీరామరక్ష అని అమిత్ షా అంటున్నారు. జల జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 43 లక్షల కుటుంబాలకు ప్లోరైడ్ రహిత రక్షిత మంచినీరు అందించామని ఆయన వెల్లడించారు. నెత్తిన కుండపెట్టుకుని తిరుగుతూ మహిళలు మంచి నీటి కోసం వెదుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. 48 లక్షల గృహాల్లో టాయ్ లెట్ల నిర్మాణం జరిగిందని దీనితో మహిళల గౌరవంగా జీవిస్తున్నారని చెప్పారు. నాలుగు కోట్ల మందికి ఉచిత రేషన్, కోటి మందికి ఆరోగ్య బీమా, 37 లక్షల మందికి ఉజ్వల యోజన గ్యాస్ సిలెండర్లు అందించిన ఘనత బీజేపీదేనని అమిత్ షా అన్నారు..
మౌలిక సదుపాయాల రంగంలో కూడా కర్ణాటక వేగంగా అభివృద్ధి చెందిందని అమిత్ షా చెప్పారు. రూ. 3,800 కోట్లతో ఏర్పాటు చేసిన న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ, పది లేన్ల బెంగళూరు – మైసూర్ హైవే, బెంగళూరు – చెన్నై ఎక్స్ ప్రెస్ వే , దక్షిణాదిలో తొలి వందే భారత్ రైలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని అమిత్ షా విశ్లేషించారు. వాటికి తోడు మోదీ నాయకత్వమే తమను గెలిపిస్తుందని, అందుకే కనిష్టంగా 130 స్థానాలు వస్తాయని ఆయన చెప్పుకున్నారు..