వైసీపీలో అలజడికి ఐ ప్యాకే కారణమా ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సొంత పార్టీ నేతలు దూరమైపోతున్నారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన వారూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఆ పార్టీలో నేతలు ఓ క్లారిటీకి వస్తున్నారు. సీఎం జగన్ పూర్తి స్తాయిలో ఐ ప్యాక్ ను నమ్ముకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఐ ప్యాక్ తరపున రిషి రాజ్ మొత్తం వ్యవహారం చక్కబెడుతున్నారు. ఆయన పార్టీని గందరోగళంలోకి నెట్టేస్తున్నారని.. చిత్రమైన పనులు చేస్తూ జగన్ సన్నిహితుల్ని కూడా వెళ్లగొడుతున్నారని అంటున్నారు.

వైసీపీలో అంతా రిషిరాజ్ రాజ్యమే !

వైసీపీలో అంతర్గతంగా ఏమి జరగాలన్నా ఐ ప్యాక్ చెప్పాల్సిందే. అత్యంత కీలక నిర్ణయాలూ ఐ ప్యాక్ తీసుకుంటోంది. పార్టీ వ్యవహారాలన్నీ రిషి రాజ్ టేబుల్ వద్దకు చేరుతున్నాయి. చివరికి బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా ఆయనే ఎక్కువ సేపు మాట్లాడారు. ఐ ప్యాక్ టీమ్‌లో ప్రశాంత్ కిషోర్ బదులుగా రిషిరాజ్ బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి ఈ రిషిరాజ్ గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన కీలక వ్యక్తుల్లో ఒకరు. పీకే స్ట్రాటజీలు చెబితే.. పక్కాగా అమలు చేసేవాడు రిషిరాజ్. అందుకే జగన్ కు ఈయనపై చాలా నమ్మకం ఏర్పడింది. అంత నమ్మకం పెట్టుకున్న ఆయన… ఇప్పుడు పార్టీని పూర్తిగా చేతుల్లో పెట్టేశారు. ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

జగన్ విధేయులందరూ రిషిరాజ్ తీరుతోనే దూరమవుతున్నారు !

రిషిరాజ్ ఐ ప్యాక్ సిబ్బందిని విస్తృతంగా నియమించుకున్నారు. అలాగే ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. ఇటీవల స్టిక్కర్ల ఉద్యమం ఆయన ఆలోచనే. చివరికి ఆ స్టిక్కర్లను కూడా తామే ప్రింట్ చేయించి పంపిణీ చేయించారు. స్టిక్కర్లు బ్యాగులు అన్నీ ఢిల్లీలోని తమ అనుబంధ సంస్థ పేరుతో తెప్పించారు. ఇక్కడ అసలు వైసీపీ నేతలకు.. సంబంధమే లేకుండా పోయింది. పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడమే కాదు.. జగన్ తో అత్యంత సన్నిహితులైన వారిపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అందుకే వారంతా దూరమవుతున్నారని అంటున్నారు.

విజయసాయిరెడ్డి, కోటంరెడ్డి..బాలినేని . వీరందరి అసంతృప్తికి కారణం ఐ ప్యాకే !

వైసీపీకి ఇటీవలి కాలంలో చాలా మంది రాజీనామా చేస్తున్నారు. జగన్ కు అత్యంత విధేయుడైన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఆయన లేకుండా పని జరిగేది కాదు.కానీ ఇప్పుడు ఆయన జాడలేదు. దీనికి ఐ ప్యాక్ కారణం అంటున్నారు. కోమటిరెడ్డి వ్యవహారం జరగడానికి నెల్లూరులో పార్టీ చిందరవందర కావడానికి కూడా కారణం ఐ ప్యాకేనంటున్నారు. చివరికి బాలినేని విషయంలోనూ అన్ని వేళ్లూ ఐ ప్యాక్ వైపు చూపిస్తున్నాయి. గతంలో గెలిపించాలో లేదో కానీ.. ఈ సారి మాత్రం జగన్ పరాజయంలో ఐ ప్యాక్ పాత్ర కీలకం అవుతుందన్న వాదన వినిపిస్తోంది.