ప్రజల ఆశల్ని నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని దోపీడి చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ చార్జిషీట్ల ఉద్యమాన్ని ప్రారంభించింది. వైసీపీ పార్టీ చేసిన వైఫల్యాలు, అవినీతిని చార్జిషీట్ల ద్వారా బయటపెట్టే ఉద్యమాన్ని బీజేపీ ప్రారంభించింది. ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలపై పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేయనున్నారు. ఇందు కోసం బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
వైసీపీ పాలనంతా వైఫల్యాల మయమే !
జగన్ పాలన మొత్తం వైఫల్యాలు కనిపిస్తున్నాయి. మద్యం విక్రయాలు, ఇసుక దందా, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ఆర్డీఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం ప్రాజెక్టు, సెంటు భూమి పథకంలో అక్రమాలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విశాఖలో భూ కబ్జాలు, రిషికొండ తవ్వకాలు, జాబ్ క్యాలెండర్ వంటి అనేక అంశాలున్నాయి. వీటన్నింటిపై బీజేపీ వరుసగా చార్జిషీట్లు దాఖలు చేయబోతుంది. ఈ చార్జిషీట్ల ద్వారా వైసీపీపై నేరుగా యుద్ధం ప్రకటించింది బీజేపీ. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లను ఈ కమిటీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వైసీపీ హయాంలో భూ కబ్జాలు, ఇసుక దందా, విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులలో జరిగిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు.
పర్యవేక్షించనున్న సీనియర్ నేతలు
చార్జిషీట్లు విడుదల చేసేందుకు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, సీనియర్ నేత పురందేశ్వరి, సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కూడిన కమిటీ ఏర్పాటైంది. అలాగే రాష్ట్రస్థాయి, జిల్లా, జోన్, మండల, గ్రామ స్థాయిల్లో కూడా కమిటీలు ఏర్పాటయ్యాయి. అన్నిస్థాయిల్లో బీజేపీ నేతలు చార్జిషీట్లను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా, ఏపీ బీజేపీ కోర్ కమిటీతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీతో ప్రధాని భేటీ కావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి, మోదీ కోర్ కమిటీలో వాకబు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ , ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ప్రధానికి వివరించారు. ఏయే రంగాల్లో అవినీతి జరుగుతుందన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సావధానంగా విన్న మోదీ.. ఆయా అంశాలపై చార్జిషీట్ తయారుచేసి, ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు.
ప్రధాని విలువైన సూచనలతో చార్జిషీట్ల ఉద్యమం !
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు, అవినీతి అంశాలపై చార్జిషీట్ రూపొందించాలని సూచించారు. అదే సమయంలో సమస్యలపై స్థానికుల నుంచి సంతకాలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఏపీ బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అంశాలను గుర్తించి, వాటిపై చర్చించారు. జిల్లా , మండల స్థాయి ఎన్నికలపై చర్చించేందుకు ఇప్పటికే సమావేశఆలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేకపాలన, అవినీతి, అనైతిక చర్యలపై ప్రజలకు వాస్తవాలు వెలువరించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడాలని నేతలు నిర్ణయించుకున్నారు. వైసీపీకి బీజేపీ దగ్గర అనే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టేలా ఈ చార్జిషీట్ల ఉద్యమం చేయనున్నారు.