ప్రభుత్వం ఏం చేయాలి.. ప్రజల రోజువారీ అవసరాలు.. నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. వారి జీవితం భారం కాకుండా కాపాడాలి. కానీ నిత్యావసర వస్తువులపై భారం పెంచేసి.. మద్యం ధరలను తగ్గిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ వింత తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
మందు బాబులపై ప్రేమ కాదు.. వారినీ దోపిడీ చేయడానికే !
తెలంగాణలో రాత్రికి రాత్రి మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫుల్ బాటిల్ పై రూ. నలభై వరకూ తగ్గించారు. బీర్ ధరలను తగ్గించలేదు. హఠాత్తుగా ఇలా మధ్యం ధరలను తగ్గించడానికి కారణం ఏమిటంటే..అమ్మకాలు పడిపోవడమే. అమ్మకాలు పడిపోవడంతో..ఆదాయం తగ్గిపోయింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు పాటించే ధరల తగ్గింపు- అమ్మకాల పెంపు సూత్రాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయానికి లోటు లేదు. హైదరాబాద్ సిటీ మహారాజ పోషకురాలిగా ఉంది. అన్ని రకాల పన్నుల ఆదాయం పెరుగుతోంది. కానీ ఆదాయానికి మించి ఖర్చు పెట్టేసే చర్యలు తీసుకోవడం.. నిర్ణయాలు ఎక్కువగా దుబారా కావడంతో పరిస్థితి జఠిలంగా మారుతోంది.
దుబారా ఖర్చులకే పోతున్న తెలంగాణ ఆదాయం !
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.దీంతో మద్యం ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో మద్యం హవా ఎలా ఉండబోతోందో మునుగోడు ఎన్నికలతో క్లారిటీ వచ్చింది. ఒక్క నియోజకవర్గంలోనే రూ. మూడు వందల కోట్ల మధ్యం అధికారికంగా అమ్ముడయింది. అనధికారికంగా ఇంకా ఎంత పారిందో చెప్పడం కష్టం. అందుకే ధరలు తగ్గిస్తే అమ్మకాలు జూమ్ అవుతాయన్న గట్టి నమ్మకంతో నిర్ణయం తీసుకున్నారు. అంటే మందు బాబుల్ని మరింత దోపిడీ చేయాలనుకుంటున్నారన్నమాట.
పెట్రోల్, డీజిల్ ధరల్ని ఎందుకు తగ్గించరు ?
దేశంలనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇటీవలి కాలంలో కేంద్రం ఒక్కో లీటర్ పై రూ. ఇరవై వరకూ తగ్గిస్తే.. తాము ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదని తెలంగాణ సర్కార్ భీష్మించుకుని కూర్చుకుంది. కర్ణాటకతో పోలిస్తే.. తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. పది ఎక్కువ. ప్రజల్ని ఇలా దోపిడీ చేయడం ఎందుకు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. వారిపై ఎదురుదాడి చేయడం కామన్ అయిపోయింది.
తెలంగాణలో మధ్యం ధరలు తగ్గింపుపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి సెటైర్ వేశారు. రాత్రికి రాత్రి టీవీల్లో పెద్ద పెద్ద బ్రేకింగ్‌లు వేస్తే.. ప్రజలపై దయతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించరమో అనుకున్నానని..తీరా చూస్తే మద్యం ధరలు తగ్గించారని సెటైర్ వేశారు.