ఒక తప్పుతో పాతాళంలోకి కాంగ్రెస్

రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంలో కాంగ్రెస్ నెంబర్ వన్ అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి హస్తం పార్టీ ఆలోచనా విధానమే వక్రంగా ఉంటుంది. పురోగామి రాజకీయాలు మానేసి తిరోగమనం దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. కర్ణాటకలో కూడా అదే జరిగిందనుకోవాలి. ఇప్పుడు పార్టీ మొత్తం తలపట్టుకు కూర్చుంది. బీజేపీ ప్రదర్శిస్తున్న దూకుడుకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడుపు ఆపుకోలేక బక్కచిక్కిపోయింది.

ఎన్నికల రాజకీయాన్నే మార్చేసిన బబరంగ్ దళ్ బ్యాన్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. ఆ మేనిఫెస్టోను విడుదల చేసిందే తడవుగా కన్నడ రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ, ఆ పార్టీ భావసారూప్య సంస్థలే కాకుండా సామాన్య జనం సైతం కాంగ్రెస్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీజేపీ, బజరంగ్ దళ్ శ్రేణులు దహనం చేస్తుంటే సామాన్య జనం ఆ పార్టీని తిట్టిపోస్తున్నారు. ఒక సేవా సంస్థను ఎలా బ్యాన్ చేస్తారని జనం ప్రశ్నిస్తుంటే నీళ్లు నమలడం కాంగ్రెస్ వంతయ్యింది.

అలా అనలేదంటున్న వీరప్ప మొయిలీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చేందుకు నానా తంటాలు పడుతోంది. తమ కార్యకలాపాలను మార్చుకోకపోతే నిషేధం విధించే అంశం పరిశీలిసామని చెప్పామే తప్ప నేరుగా బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని ఎక్కాడ చెప్పలేదని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అంటున్నారు. పద్ధతి మార్పుకోమని చెప్పామని, పద్ధతిగా ఉంటే నిషేధం ప్రస్తావనే రాదని చెబుతూ కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నంలో ఉంది.

గుళ్ల చుట్టూ ప్రదక్షణలు..

చేసిన తప్పును తెలుసుకుని కాంగ్రెస్ నేతలు గుళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. దాసుడి తప్పులు దండంతో సరి అని చెప్పుకున్నా చేసిన పాపం పోదని, జనం ఇప్పటికే డిసైడయ్యారని వారికి అర్థం కావడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచారంలో అన్ని అంశాలు పక్కకెళ్లిపోయి.. హనుమాన్ మాత్రమే ఇప్పుడు అందరి కళ్లకు కనిపిస్తున్నారు. హిందూ సంస్థలన్నీ ఇప్పుడు హనుమాన్ చాలీసా పాడుతూ నిరసన తెలియజేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడుతోంది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. మైసూర్ చాముండేశ్వరీ ఆలయానికి వెళ్లి పూజలు చేయడంతో పాటు రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాలన్నింటికీ మరమ్మత్తులు చేయిస్తామని, కొత్తగా ఆలయాలు కట్టిస్తామని చెబుతున్నారు. ఈ ఒక్కసారికి గెలిపించు దేవుడా అని ప్రార్థిస్తున్నరు..

జై బజరంగ్ బలీ అంటున్న మోదీ..

ప్రజల ఆలోచనా విధానం, కాంగ్రెస్ పార్టీ పట్ల కర్ణాటక జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి ప్రధాని మోదీ కూడా తన ప్రసంగం స్టయిల్ మార్చారు. తుమాకురు బహిరంగ సభలో భారత్ మాతా కీ జై, బజరంగ్ బలీ కీ జై అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ తీరుతో బీజేపీ కార్యకర్తలకు కొత్త ఊపునిచ్చినటయ్యింది. తాజా పరిణామాలతో తటస్థ ఓటర్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు బీజేపీ కేవలం అతి పెద్ద పార్టీగా ఉంటుందనుకుంటే ఇప్పుడు సొంత మెజార్టీపై అధికారానికి వచ్చే స్థాయికి పార్టీకి ప్రజాదరణ పెరిగిందని చెబుతున్నారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 113 చోట్ల గెలిస్తే సింపుల్ మెజార్టీ వస్తుంది. బీజేపీకి 115 స్థానాల వరకు రావచ్చని తాజా సర్వేల సారాంశం. ఎన్నికల నాటికి అది మరికాస్త పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.. అదీ మోదీ నాయకత్వానికి వేసే ఓటుగా కూడా చెబుతున్నారు..