అభివృద్ధి అజెండాతో బీజేపీ కొత్త రికార్డు సృష్టిస్తుందా ?

కర్ణాటక ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. ఇప్పుడు వైరి వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తొలుత దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ ఇప్పుడు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ డిఫెన్స్ లో పడిపోయింది. రోజురోజుకు బీజేపీ పైచేయిగా నిలుస్తోంది.పార్టీకి అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి..

జనమే బలం

కన్నడ జనం తమ వైపే ఉన్నారని బీజేపీ అంటోంది. గత 38 ఏళ్లుగా కర్ణాటకలో అధికార పార్టీ గెలిచిందే లేదు. ఈ సారి మాత్రం ఆ ట్రెండ్ మారుతుందని బీజేపీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. బీజేపీ చేసిన అభివృద్ధి జనానికి అర్థమైందని, అందుకే అనవసర సెంటిమెంట్లను వాళ్లు పట్టించుకోరని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శోభా కరంద్లాజే చెబుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని బీజేపీ నేతలు జనానికి వివరిస్తున్నారు. ఆ దిశగా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులే లక్ష్యం…

గత రెండు మూడేళ్ల కాలంలో బీజేపీ చాలా పథకాలను ప్రారంభించింది. అవి ఇప్పుడు సగంలో ఉన్నాయి. వాటిని సత్వరం పూర్తి చేయాలంటే బీజేపీ అధికారానికి రావడం అవసరమని కర్ణాటక ప్రజలు గుర్తించారు. జలజీవన్ మిషన్, మెట్రో రైల్, హైవే పనులు, గృహవసతి పథకాలు అమలు వేగవంతమైన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాటిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. ఆయా పథకాలను పూర్తి చేసి అభివృద్ధి చెందిన కర్ణాటకను ఆవిష్కరించడమే ధ్యేయంగా బీజేపీ జనంలోకి వెళ్లింది. కాంగ్రెస్ హయాంలో నేతల మధ్య కీచులాటల కారణంగా అభివృద్ధి అటకెక్కిందని బీజేపీ అర్థం చేసుకుంది. అందుకే తమ పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేశామని బీజేపీ అంటోంది.

అందరికీ న్యాయమే బీజేపీ నినాదం

కర్ణాటకలో బీజేపీ చాలా తక్కువ కాలం అధికారంలో ఉంది. ఐనా ప్రజా సమస్యలు, సామాజిక వర్గాల వెనుకబాటు తనానికి సంబంధించిన లెక్కలు ఆ పార్టీకి తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియకపోవచ్చు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ, అన్ని సామాజిక వర్గాలకు ఒకటిగా చూడటమే అజెండాగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ లింగాయత్ సామాజిక వర్గాన్ని అవమానించిందని బీజేపీ గుర్తించి తన వైపు నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందుకే లింగాయత్ నాయకులైన యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్, బసవరాజ్ బొమ్మాయ్ లకు ముఖ్యమంత్రి పదవులిచ్చిన బీజేపీ, మంత్రివర్గంలో అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తూ వచ్చింది.ఎన్నికలకు చాలా రోజుల ముందే అన్ని చోట్ల బూత్ కమిటీలు ఏర్పాటు చేసిన బీజేపీ.. అక్కడ ఏ ఏ సామాజిక వర్గాల వారు బాగా వెనుకబడి ఉన్నారో గుర్తించి, స్థూలంగా వారికి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే అభివృద్ధి సాధ్యమో లెక్కలేసుకుంది. ఆ దిశగా ప్రస్తుతానికి ఒక అజెండాను రూపొందించుకుని అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయబోతోంది.