ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యమాయన. పార్టీని ఒంటి చెత్తో నడిపించే సత్తా ఆయనది. నేతలంతా ఒక ఎత్తు. ఆయన మాత్రమే ఒక ఎత్తు. విపక్ష నేతలంతా కలిసికట్టుగా వచ్చినా ఆయనకు సరితూగరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు కనీసం ఆయన దరిదాపులకు కూడా రాలేరు. ఆయనే మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ..
కర్ణాటకలో అలుపెరుగని యోధుడు
అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ విశ్వరూపం కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా మోదీ నామస్మరణే వినిపిస్తోంది. ఆయనో గేమ్ ఛేంజర్ అన్న ఫీలింగ్ మొదటి నుంచి ఉన్నప్పటికీ ఈ సారి కన్నడ రాజ్యలక్ష్మి బీజేపీని వరించబోతుందంటే అదీ మోదీ చలవేనని చెప్పుకోవాల్సి వస్తోంది. ఎన్నికలు ఇంకా వారం కూడా లేవు. మోదీ రాకతో సీన్ మాత్రం మారిపోయింది.
కన్నడ గడ్డపై మోదీ కాలు మోపకముందు అడ్వాంటేజ్ కాంగ్రెస్ అని ప్రచారం జరిగింది. సిద్ధరామయ్య సీఎం అయిపోతున్నారంటూ కాంగ్రెస్ బాకా ఊదుకుంది. మోదీ ఎంటరైన 24 గంటల్లోనే ప్రజల ఆలోచనలు మారాయి. అసలు ఆకాంక్షలు బయటకు వచ్చాయి. తమ జీవితాల్లో నిజమైన వెలుగులు మోదీ నాయకత్వంలోనే సాధ్యమన్న అభిప్రాయం కన్నడీగుల్లో పెరిగింది. అందుకే తాజా సర్వేలన్నీ బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు, ఆరెస్సెస్ శ్రేణులు కర్టాటకలో మోహరించినప్పటికీ రాని మైలేజ్.. మోదీతో తన్నుకొచ్చింది. ఆయన ఫేస్ వాల్యూ అలాంటిది.
రోడ్ షోలే హైలైట్
మోదీ మార్కు రోడ్ షోలు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లోనూ మోదీ రోడ్ షోలకు ఇసుకేస్తే రాలడం లేదు.మోదీ ఒక్క చోట కనిపిస్తే చాలు రాష్ట్రం మొత్తం ప్రభావం ఉంటుందని అంగీకరిస్తూ రాజకీయ ప్రత్యర్థులు వణికిపోతున్నారు.కన్నడ నేలపై మోదీ అడుగు పెట్టిన తర్వాత కొందరు ప్రత్యర్థుల పేర్లు వినిపించడం ఆగిపోయింది. అసలు వాళ్లు పోటీ చేస్తున్నారా.. రాజకీయాల్లో కొనసాగుతున్నారా… అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
టీమ్ మోదీ ఇప్పుడు కర్ణాటకలో అతి పెద్ద రోడ్ షోకు ప్లాన్ చేస్తోంది. శనివారం బెంగళూరు నగరంలోని 17 నియోజకవర్గాల ఓటర్లను ఆకర్షిస్తూ 37 కిలోమీటర్ల రోడ్ షోను ప్రధాని నిర్వహించబోతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నిర్వహించిన 50 కిలోమీటర్ల రోడ్ షా తర్వాత ఇదే అతి పెద్దది కావచ్చు. బెంగళూరు నగరంలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 20 గెలిచి తీరాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందుకు మోదీ ఛరిస్మానే ఏకైక అసెట్..
ప్రజల్లో ఒకడిగా…
ప్రజల మనిషిగా ప్రజల్లో ఒకడిగా ఉండాలని మోదీ ఎప్పుడూ కోరుకుంటారు. ఆయన నిగర్వి. టీ అమ్మే రోజుల్లో జనంతో కలిసి ప్రజల హృదయాలను అర్థం చేసుకున్నట్లే.. ఇప్పుడు కూడా జనమే తన బలంగా రాజకీయాలు చేయాలనుకుంటారు. బెంగళూరు నగరంతో కనెక్ట్ అయిన మోదీ అక్కడ చేసిన అభివృద్ధి పనులు కూడా జనం గుర్తు చేసుకుంటున్నారు. వందే భారత్, మెట్రో సర్వీస్ ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరి మదిలో మెదిలే అంశాలు. మోదీ స్వయంగా చొరవ చూపి ఆయా ప్రాజెక్టుల సెక్సెస్ కు దోహదం చేయడమే కాకుండా.. వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బెంగళూరు పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించుకున్నారు..
ఘర్ ఘర్ మోదీ…
ప్రచారానికి రావడం మొదలు పెట్టినప్పటి నుంచి కర్ణాటకలో మోదీ ఒక మోస్ట్ పాపులర్ లీడర్ అయ్యారు. అకస్మాత్తు ఒక ఇంటికి వెళ్లి కాస్త చాయ్ ఉంటే ఇస్తారా అని అడిగి వాళ్ల బాగోగులు తెలుసుకున్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని పార్టీ కేడర్ అంటోంది. అందుకే కన్నడ నాట ఇప్పుడు ఘర్ ఘర్ మోదీ నినాదం మారుమోగిపోతోంది.ఆత్మీయులను చూస్తే కష్టాలు మరిచిపోయి ఆనందంగా గడుపుతామన్న సామెత ఉండనే ఉంది. మోదీని చూసినా అంతేనని కన్నడ ప్రజలు చెప్పుకుంటున్నారు.
దిక్కుతోచన విపక్షాలు
మోదీ దెబ్బకు కర్ణాటక ప్రతిపక్షాలకు దిక్కుతోచడం లేదు. మోదీ ఓ విషనాగు అనో, మరేదో అనో బాక్సింగ్ క్రీడ తరహాలో బిలో ది బెల్ట్ కొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వారందరికీ మోదీ చెబుతున్న సమాధానం ఒక్కటే. తనను ప్రతిపక్షాలు 91 సార్లు దుర్భాషలాడాయని చెప్పుకోవడమే కాదు, గతంలో అంబేడ్కర్‌ను కూడా కాంగ్రెస్ ఇదే విధంగా దుర్భాషలాడిందని వివరించారు. అలాగని తాను అంబేడ్కర్ అంతటి స్థాయి వ్యక్తినని ప్రకటించుకోవడం మోదీ ఉద్దేశం కానే కాదు. అంతటి మహనీయుడినే తిట్టిన కాంగ్రెస్ వారికి తానో లెక్కా.. వారి నోటికి అడ్డు ఉండదని చెప్పడమే ప్రధాని అసలు ఆలోచనా విధానమని మరిచిపోకూడదు. ఎవరేమనుకున్నా ప్రజల అండ తనకు ఉందని వారే తమ పార్టీకి శ్రీరామరక్ష అని మోదీ చెబుతుంటారు. పైగా ఇప్పుడు బజరంగ్ దళ్ పై నిషేధం విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరో తప్పు చేసింది. హనుమంతుడి గడ్డపై ఇలాంటి దుశ్చర్యలేమిటని మోదీ ప్రశ్నిస్తే.. విపక్షాలకు వేరు గత్యంతరం లేక మళ్లీ తిట్ల దండకం అందుకున్నాయి.
ఎవరెళ్లిపోయినా…
ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని అలిగి చాలా మంది నేతలు వెళ్లిపోయారు. జగదీష్ షెట్టార్ లాంటి నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. ఐనా మోదీకి కావాల్సిందీ అవకాశవాద నేతలు కాదు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు. అదే వ్యూహాన్ని మోదీ అమలు చేశారు. కర్ణాటక కార్యకర్తలతో నేరుగా మాట్లాడి పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరారు. ఇప్పుడు కార్యకర్తలకు మోదీకి మధ్య ఎలాంటి వారధులు లేరు. డైరెక్ట్ కాంటాక్ట్ మాత్రమే ఉంది. అందుకే కర్ణాటకలో బీజేపీ విజయం ఖాయం. అదీ మోదీ వల్లే సాధ్యమైందని జనం గుర్తించడమూ అంతే ఖాయం..