ఎవర్నీ కలవరు.. ఎవరూ కలవరు ! తేలిపోయిన దేశ్‌ కీ నేత రాజకీయం !

భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఢిల్లీలో తెరుస్తున్నారు కేసీఆర్. అది తన పార్టీకి లభించిన వందల కోట్ల విరాళాలతో కొంత మొత్తం పెట్టి కట్టించారు. తాత్కలిక కార్యాలయాన్నిగత ఏడాది ప్రారంభించారు. అప్పుడు హంగామా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరికి కేసీఆర్ కూడా లైట్ తీసుకుంటున్నారు. స్వంత పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి అతిథిలాగా సమయానికి వెళ్తున్నారు. దీంతో కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి పోయిందన్న వాదన వినిపిస్తోంది.

కేసీఆర్ ను కలవడానికి ఇష్టపడని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు !

అందర్నీ కలుపుకుని బీజేపీని ఓడిస్తానని పార్టీ పెట్టినప్పటి నుండి కేసీఆర్ ప్రకటిస్తూనే ఉన్నారు. కేసీఆర్ తాను ఒక్కడినే బీజేపీని ఓడించలేరని తెలుసు. అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి ఆయన బీజేపీపై పోరాడాలనుకున్నారు. ఈ మేరకు ఆయన పెట్టిన ప్రతిపాదనలకు పెద్దగా సానుకూలత రాలేదు. ఆ తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు. ఆయనతో ఇప్పటి వరకూ కలిసి వస్తామన్న నేతలు కూడా ఎవరూ రావడం లేదు. అంతే కాదు ఆయనను పిలవడం లేదు కూడా. స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలకు అందర్నీ పిలిచారు కానీ కేసీఆర్‌ను పిలువలేదు. బీహార్ సీఎం… బీజేపీపై పోరాటానికి అందర్నీ కలుస్తున్నారు కానీ కేసీఆర్‌ను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. పరిస్థితి చూస్తూంటే.. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ప్రారంభించానా అని కేసీఆర్ బాధపడే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

బయట రాష్ట్రాల గురించి ఆలోచించడం మానేసిన కేసీఆర్ !

ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చక ముందే కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ్ కీ నేత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా పార్టీ ఏర్పాటు తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టాలని అనుకున్నారు. కానీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా సభ పెట్టడం లేదు. తాత్కలిక ఆఫీసు ప్రారంభోత్సవం కోసం కలిసి వచ్చే నేతల్ని పిలిచినా.. ఇప్పుడు మాత్రం పెద్దగా ఎవర్నీ పిలవడం లేదు.
ఇటీవలి కాలంలో అసలు ఒక్క మహారాష్ట్ర చోటామోటా నేతల్ని చేర్చుకోవడం తప్ప.. మరో రాష్ట్రంలో పార్టీ విస్తరణ గురించి కేసీఆర్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూంటే అసలు పట్టించుకోలేదు.

మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టినా ఎదురు దెబ్బ !

కారణం ఏమిటో కానీ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కన్నా మహారాష్ట్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ శివారులో ఉన్న జిల్లాల్లో మూడు సభలు పెట్టారు. పలువురు నేతల్ని చేర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నారు. అక్కడ స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బోకర్ నియోజకవర్గ మార్కెట్ యార్డు ఎన్నికల్లో నూ పోటీ చేశారు. ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరడంతో ఆయన బీఆర్ఎస్ మద్దతుదారులను మార్కెట్ యార్డ్ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. కానీ ఒక్క డైరక్టర్ పోస్టులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవలేదు. దీంతో తొలిసారే ఎదురు దెబ్బ తగిలినట్లయింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇలాంటి పలితాలు వస్తే కేసీఆర్ ఎంతో దృష్టి పెట్టి.. ఆశలు పెట్టుకున్న మహారాష్ట్రలో సైతం బీఆర్ఎస్‌ ఉనికి కష్టమవుతుంది.

అసలే తెలంగాణ లో ఎదురీదుతున్న పరిస్థితుల్లో… జాతీయంగా ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలినా అది చూపించే ప్రభావం తీవ్రంగా ఉంటుంది.అందుకే కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి తగ్గిస్తున్నట్లుగా భావిస్తున్నారు.