నిత్య యవ్వనం…
ఈ మాటలోనే ఏదో కిక్కు ఉంది కదా. నిత్యం యవ్వనంగా ఉండాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి..ఒకవేళ లేదని బయటకు చెప్పినా కానీ లోలోపల మాత్రం నిజంగా సాధ్యమైతే బావుండును కదా అనుకుంటారు. ఇంకా అర్థమవ్వాలంటే రమ్యకృష్ణ నటించిన నీలాంబరి సినిమాలా అన్నమాట.. ఏళ్లు గడిచినా యవ్వనం పోదు..అందం చెక్కుచెదరదు. దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి కానీ మొన్నటి వరకూ కిటుకేంటో చేతికి అందలేదు. అయితే తాజాగా జరిగిన పరిశోధనల్లో జీనోమ్ రెగ్యులేటరీ సర్క్యూట్లను గుర్తించామంటున్నారు కాలిఫోర్నియా శాన్ డియాగో యూనివర్సిటి పరిశోధకులు.
క్షీణించే కణాలను రీప్రోగ్రాం చేస్తే సాధ్యమే!
కణజాలల్లో సహజంగా కొన్ని కణాలు క్షీణించి కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది క్షీణించే పరిమాణం పెరిగుతుంది కానీ కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య పెరగదు. అయితే ఈ మొత్తం ప్రోగ్రాంను రీ ప్రోగ్రాం చెయ్యడం ద్వారా పెరిగే వయసును ఆపొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఈస్ట్ కణాల మీద జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా మానవ కణజాలాల క్షీణతను రీప్రోగ్రాం చెయ్యడం ఎలాగో తెలుసుకోవడానికి మార్గం తెలిసిందని చెబుతున్నారు అధ్యయనకారులు. కణజాలాల ఏజింగ్ ప్రాసెస్ ను రీప్రోగ్రాం చెయ్యడానికి సింథటిక్ బయాలజీ అప్లైచెయ్యడం ద్వారా సాధ్యపడుతుందన్నారు. జీరియాట్రిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో నిపుణులు శాశ్వత జీవితం గురించి పరిశోధనల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
కణాల క్షీణత మందగించే ప్రోగ్రామ్ సక్సెస్
సైన్స్ జర్నల్లో ప్రచురించిన తాజా అధ్యయనంలో సెల్యులార్ స్థాయిలో వృద్ధాప్యాన్ని దరిచేరకుండా ఆపడం ఎలాగో చర్చించింది. ఈ పరిశోధనలో కణాల వయసుకు కారణమయ్యే జీన్ రెగ్యులేటరీ సర్క్యూట్స్ అనే మెకానిజమ్స్ ను గుర్తించారు. ఇప్పుడు ఉపయోగించే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్, ఆటోమోబైల్స్ ను కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ సర్క్యూట్ల మాదిరిగానే ఈ జీన్ సర్క్యూట్స్ కూడా పనిచేస్తాయి. ఈస్ట్ కణాల్లోని సర్క్యూట్స్ ను రెండు రకాల స్థితుల మధ్య మార్పు తీసుకొచ్చే విధంగా రీప్రోగ్రాం చెయ్యగలిగారు. ఫలితంగా ఈస్ట్ కణాల క్షీణత మందగించడాన్ని గమనించారు. ఇది కణాల జీవిత కాలం పెరగడానికి దోహదం చేసింది. ఇలా రివైర్ చేసిన కణాల జీవిత కాలం రీవైర్ చెయ్యని కణాలతో పోల్చినపుడు దాదాపు 82 శాతం పెంచడం సాధ్యపడింది. దీర్ఘాయుష్షుకు సంబంధించిన ప్రయోగాల్లో గైడెడ్ సింథటిక్ బయాలజి, ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు వచ్చిన ప్రయోగ ఫలితాల ఆధారంగా మానవ కణజాలాలకు ఎలా అన్వయించవచ్చో తదుపరి ప్రయోగాల్లో అధ్యయనం చేస్తామన్నారు అధ్యయనకారులు.