పిండం కాకులకే ఎందుకు పెట్టాలి – కాకి ముట్టుకోపోతే దోషమా!

హిందువులు పాటించే ఆచారవ్యవాహారాల వెనుక ఓ సహేతుకమైన కారణం ఉంటుంది. పాటిస్తున్న ప్రతి సంప్రదాయం వెనుక ఆంతర్యం ఉంటుంది. అందులో ఒకటి కాకులకు పిండం పెట్టడం. ఈ మధ్య ‘బలగం’ సినిమా వచ్చినప్పటి నుంచీ కాకులు-పిండం గురించి చర్చ జరుగుతోంది. బలగం సినిమాలో కాకి పిండం ముట్టుకోలేదంటూ బాధపడతారు.ఈ సినిమా వచ్చనప్పటి నుంచీ పిండం కాకులే వచ్చి తినాలని ఎందుకు అనుకుంటారన్న చర్చ జరుగుతోంది. దీనివెనుక ఓ పురాణ గాథ ఉంది

కాకి రూపంలో పితృదేవతలు
ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మూడో రోజు నుంచి 11 రోజుల వరకూ కాకులకు పిండాలు పెడతారు. ఆ తర్వాత ఏడాది గడిచేవరకూ నెలకోసారి మాసికం, ఆ తర్వాత ఏడాదికోసారి తద్దినం పెడతారు. ఇవేమీ తెలియని వారు పుష్కరాల్లో పిండ ప్రదానం చేస్తారు. ఇలా చేస్తే పెద్దల ఆత్మ శాంతిస్తుందని..ఆత్మ ఇహలోకం నుంచి పరలోకం చేరుతుందని విశ్వసిస్తారు. ఇంతకీ పిండాలను కాకులకే ఎందుకుపెడతారన్నదే ఇప్పుడు చర్చ. కాకి తినకపోతే ఏమవుతుందన్నదే చర్చ. సాధారణంగా కాకులు వాలితే దోషమని, కాకి తంతే అరిష్టం అని భయపడతారు. మరికొందరైతే కాకి ఇంటిముందు అరిస్తే చుట్టాలొస్తారని నమ్ముతారు. ఇవన్నీ మూఢ నమ్మకాలా, నిజాలా అన్నది పక్కనపెడితే చాలామంది విశ్వసిస్తారన్నది మాత్రం నిజం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు ముద్ద ముట్టుకుంటే పెద్దల ఆత్మ సంతృప్తి చెందిందని..లేదంటే వారిలో ఏదో అసంతృప్తి ఉందనే భావనతో ఉంటారు. బలగం సినిమాలో కాకి ముట్టకపోవడం వెనుక ఆంతర్యం కూడా ఇదే… ఇంట్లో తోడబుట్టినవారిమధ్య, ఇంటి అల్లుడి మధ్య సయోధ్య లేదన్నదే పెద్దాయన బాధ. చివరకు అంతా ఒక్కచోట చేరి కలసి కార్యక్రమం నిర్వహించినప్పుడు కాకివచ్చి తింటుంది..

కాకికి మాత్రమే ఎందుకు పెట్టాలి
రావణుడి అరాచకాలకు భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, లేడి లోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యుముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలోంచి బయటు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వళ్లంతా కళ్లున్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు, వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా ఫించం ఇచ్చాడు వరుణుడు, కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అదే సమయంలో యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచీ పిండాలను కాకులకు పెట్టడం అనుసరిస్తున్నారట.

మూగజీవాలకు ఆహారం అందించాలన్న పరమార్థం
పితృకర్మలు, కర్మకాండల సమయంలోనే కాకుండా మిగిలిన సమయంలో కూడా పక్షులకు ఆహారం అందించాలంటారు పెద్దలు. అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా ఎవరి పెరట్లో చూసినా కాకులే ఎక్కువగా ఉండేవి. అందుకే పిండాలు కాకులకు పెట్టేవారు. మరికొందరు నదీ ఒడ్డున కార్యక్రమం చేసి పిండాలను నీటిలో వదులుతుంటారు కదా..నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం.
ఇంకొందరు ఆవులకు తినిపిస్తారు.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం.వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం