మనిషికి ఉండకూడని ఏడు వ్యసనాలు – దుర్యోధనుడు, రావణుడు అలాగే నాశనమైపోయారు!

వ్యసనాలు రెండు రకాలు..మంచి వ్యసనం, చెడు వ్యసనం.. మంచి వ్యసనం మనిషిని అందలం ఎక్కిస్తే, దుర్ వ్యసనం అదఃపాతాళానికి తొక్కేస్తుంది. వ్యసనానికి లోనై జీవితంలో బాగుబడినవాళ్లు లేరు. ఇలాంటి వాళ్లు ఈ కాలంలో మాత్రమే కాదు పురాణాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా దుర్య్వసనాలు ఏడు అని చెబుతారు.వీటినే సప్త వ్యసనాలు అంటారు…

పరస్త్రీ వ్యామోహం
సప్తవ్యసనాల్లో మొదటిది పరస్త్రీ వ్యామోహం. ఈ రోజుల్లో ఇది మరీ ఎక్కువైపోయింది..పరస్త్రీ వ్యామోహంలో పడి కుటుంబాలకు అన్యాయం చేస్తూ జీవితాలు కోల్పోతున్నవారెందరో ఉన్నారు. ఇక పురాణాల్లో ఇలాంటి పాత్ర అనగానే గుర్తొచ్చేది రావణుడు. శ్రీరామ పత్ని అయిన సీతాదేవిని అపహరించి కోరి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. అంతేకాదు…తన కుటుంబాన్ని, వంశాన్ని, అయినవారినీ, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. అందుకే మనది కాని వస్తువుపైనా…మనలో సగ భాగం కాని మనిషిపై వ్యామోహం పెంచుకుంటే మిగిలేది నాశనమే..

జూదం
జూదం అనే మాట వినగానే ఇప్పుడున్న జనరేషన్ కి పేకాట కళ్లముందు కనిపిస్తుంది. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. మంచి చెడులు నిర్ణయించే అంత గొప్పవాడే ఆ రోజుల్లో జూదంలో రాజ్యాన్ని కోల్పోయి..భార్యను అవమానిస్తున్నా ఏమీ మాట్లాడలేక .. తాను అవస్తలు పడడంతో పాటూ తమ్ముళ్లు, భార్య కష్టాలకు కూడా కారణమయ్యాడు. ఇప్పటి తరంలో జూదానికి బానిసగా మారి తాము రోడ్డున పడుతున్నారు..కుటుంబాలను రోడ్డెక్కిస్తున్నారు.

మద్యపానం
మద్యపానం ఎంత ప్రమాదకరమో రాక్షసగురువైన శుక్రాచార్యుడే ఉదాహరణ. శుక్రాచార్యుడికి మృత సంజీవినీ విద్య తెలుసు. చనిపోయిన రాక్షసులను ఆ విద్యతో వెంటనే బ్రతికించేవాడు. కానీ మద్యపాన మత్తులో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో తన శిష్యుడైన కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవినీ విద్య నేర్పించి… శిష్యుడిని బతికించి.. ఆ తర్వాత శిష్యుడి ద్వారా మళ్లీ ప్రాణం పోసుకున్నాడు శుక్రాచార్యుడు. సకల విద్యలు తెలిసిన వారినే మద్యపానం సర్వం మరిచిపోయేలా చేసింది..ఇక మీరెంత ఆలోచించండి.

వేట
వేట అనే మాట అప్పట్లో రాజులకు సంబంధించిన విషయం అయినప్పటికీ….ఇప్పటికీ స్థితిపరులకు ఇదో వ్యసనమే. ఈవేటలో పట్టుబడి కేసులు ఎదుర్కొంటున్న వారెందరో ఉన్నారు. ఇప్పుడు కోర్టులు శిక్షలు ఉంటే అప్పట్లో శాపాలుండేవి. దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి జంతువులను చంపేవాడు. ఓసారి నీటి శబ్దం విని బాణ వేసినప్పుడు శ్రవణకుమారుడు బలైపోతాడు. తనకు తెలియకుండా చేసినా పాపం పాపమే కదా. శ్రవణకుమారుడి వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురైన దశరధుడు… వనవాసానికి వెళ్లిన శ్రీరాముడిని కలవరిస్తూ మరణిస్తాడు. మూగజీవాలను వేటాడితే శాపమో-శిక్షో తప్పదు…

కఠినంగా మాట్లాడటం
సప్తవ్యసనాల్లో ఇది ఐదవది. కఠినంగా, పరుషంగా మాట్లాడటం..ఎదుటివారిపై మాట విసరడం ఎంతో ప్రమాదకరం. మాటతీరు సరిగా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విఛ్చిన్నమవుతున్నాయి. మహాభారంతో దుర్యోధనుడు పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే.

కఠినంగా దండించటం
దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి సరైన ఆహారం కూడా అందించకండా ఇబ్బంది పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.

డబ్బు
లక్ష్మీదేవిని నువ్వు గౌరవిస్తే…అమ్మవారు నిన్ను కరుణిస్తుందని అంటారు పెద్దలు. క్రమశిక్షణ లేకుండా ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తాత్కాలిక ఆనందం పొందొచ్చుకానీ….శాశ్వత కష్టాలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం తప్పదు.