మోదీపైనే ఖానాపూర్ ఆశలు

భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల విచిత్ర సమస్యలు తలెత్తాయి. రాష్ట్రాల సరిహద్దుల్లో కొన్ని గ్రామాలు అటు నుంచి ఇటు వెళ్లాయి. ఒరియా మాట్లాడే వారు ఏపీలో, బెంగాలీ మాట్లాడే వాళ్లు మరో చోట ఉండేవిధంగా విభజన జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కూడా అదే సమస్య కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి అదే అంశం తెరమీదకు వచ్చింది.

మహాజన్ కమిషన్ చెప్పిందేమిటి…

కర్ణాటక బెళగావి జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం 264 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని 1967లో ఏర్పాటైన మహాజన్ కమిషన్ ప్రకటించింది. ఆయా గ్రామాల్లో ఉన్న వారిలో మెజార్టీ వర్గం మహాఠీ మాట్లాడటంతో పాటు వారికి ఒక్క ముక్క కూడా కన్నడ భాష రాదని తేల్చింది. ( అది అప్పటి మాట…ఇప్పుడు భాష నేర్చుకున్నారనుకోండి) అయితే ఈ రిపోర్టును మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే కర్ణాటకలోని ఐదు జిల్లాలో ఉన్న 865 గ్రామాలు తమకు చెందాలని అన్ని కలిపి ఒకేసారి తమకు అప్పగించాలని మహారాష్ట్ర అంటోంది. 1970లోనే మహాజన్ రిపోర్టు పార్లమెంటు ముందుకు వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల చట్టం 1956ను సవాలు చేస్తూ మహారాష్ట్ర సర్కారు 2004లో సుప్రీం కోర్టు వ్యాజ్యం వేయగా అది ఇంతవరకు విచారణకు కూడా రాలేదు..

రూ.450 కోట్లు విడుదల చేసిన బీజేపీ

1960లలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్).. ఖానాపూర్ ప్రాంతంలో యాక్టివ్ గా ఉండేది. మరాఠీ మాట్లాడే వారిని మహారాష్టలో విలీనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసేది. సామాజిక ఉద్యమమని చెప్పుకున్నా ఎంఈఎస్ అభ్యర్థులు ఎన్నిక్లలో పోటీ చేసి గెలిచేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రోడ్లు, వంతెనలు, సాగునీటి కాలువలు, విద్యావకాశాలకు ఖానాపూర్ నోచుకోలేదు. ఖానాపూర్ లో గెలిచే ఎంఈఎస్ భాషాపర ఉద్యమం మినహా ప్రజల స్థితిగతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోలేదు.

బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఖాజాపూర్ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 450 కోట్లు విడుదల చేసి చకచకా పనులు కానిచ్చేసింది. పనులు వేగంగా జరగడంతో అభివృద్ధి కనిపిస్తోందని జనం ఒప్పుకుంటున్నారు..

మూడు పార్టీల మరాఠా అభ్యర్థులు

ఈ సారి ఖానాపూర్ నుంచి బీజేపీ, కాంగ్రెస్, ఎంఈఎస్ మూడు పార్టీలు మరాఠీ అభ్యర్థులనే నిలబెట్టారు. బీజేపీ తరపున విఠల్ రావ్ హగ్లేకర్, కాంగ్రెస్ తరపున అంజలి నింబాల్కర్, ఎంఈఎస్ తరపున మురళీధర్ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా తమకు అభివృద్ధి కావాలని సగటు ఓటర్లు కోరుతున్నారు. మహారాష్ట్రలో ఉండే కంటే కర్ణాటకలోనే ఎక్కువ అభివృద్ధి చూశామని చెబుతున్న జనం…. ఉపాధి హామీ లాంటి పథకాలను సక్రమంగా అమలు చేస్తే చాలంటున్నారు. అందుకు ప్రధాని మోదీ చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతున్నారు. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి…