మే నెలలో మూవీ మస్తీ తక్కువే

ఏప్రిల్ అయిపోయింది. ఒక్క విరూపాక్ష మినహా ఏ సినిమా ఆడియన్స్ ను అలరించలేకపోంది. ఏప్రిల్ లో అతిపెద్ద డిజాస్టర్ శాకుంతలం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మే నెలపైనే ఉంది. అయితే మేలో కూడా స్టార్ హీరోలెవ్వరూ తమ సినిమాల్ని రిలీజ్ చేయడం లేదు. దీంతో మీడియం రేంజ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు వరుసబెట్టి క్యూ కట్టాయి. వీటిల్లో అన్నింటి కంటే ముందు వస్తున్న సినిమా గోపీచంద్ రామబాణం. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ తర్వాత గోపీ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా హిట్ తో తన ప్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాడు గోపీచంద్. ఇక అదే రోజు రిలీజ్ కాబోతుంది అల్లరి నరేశ్ ఉగ్రం. నాంది సినిమాతో తనకు హిట్ ఇచ్చిన విజయ్ తో ఉగ్రం చేశాడు నరేశ్. తొలిసారి కంప్లీట్ యాక్షన్ హీరోగా ఇందులో కన్పిస్తున్నాడు. నరేశ్ కు కూడా ఉగ్రం హిట్టవ్వడం చాలా అవసరం.
అన్నీ మంచి సినిమాలే
ఈ ఏడాదిలో నాగచైతన్య నుంచి వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. కారణం… వెంకట్ ప్రభు దర్శకుడు కావడమే. ఈ సినిమా మే 12 రిలీజ్ కాబోతుంది. కృతి శెట్టి హీరోయిన్. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించాడు నాగ చైతన్య. గతేడాది బంగార్రాజుతో హిట్ కొట్టిన చైతూ.. థాంక్యూతో ఫ్లాప్ ఇచ్చాడు. ఇక లాల్ సింగ్ చద్దా అయితే వచ్చిన సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. దీంతో.. ఇప్పుడు కస్టడీతో హిట్ కొట్టాలని ప్లాన్ చేశాడు. ఇక మనసుకి నచ్చిన కథ దొరికితే తప్ప దర్శకత్వం వైపు కన్నెత్తి కూడా దర్శకురాలు నందినిరెడ్డి నుంచి నుంచి వస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమా మే 18న విడుదల కాబోతుంది. ఇదే రోజు శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన కూడా రిలీజ్ కాబోతుంది.
క్యూ కడుతున్న డబ్బింగ్ బొమ్మలు
స్టార్ హీరోలంతా తమ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. దీంతో.. చిన్న హీరోలు సందడి చేస్తున్నారు. సందట్లో సడేమియాలా డబ్బింగ్ హీరోలు కూడా తెలుగు కలెక్షన్లపై కన్నేశారు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న అరవ హీరో విజయ్ ఆంటోని… ఇప్పుడు బిచ్చగాడు పార్ట్ 2 ని రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఈ సినిమా మే 19న విడుదల కానుంది. ఇక గజనీ మహమ్మద్ కంటే ఎక్కువసార్లు తెలుగు ఇండస్ట్రీపై తన సినిమాలతో దాడులు చేస్తున్న సిద్ధార్థ్ కూడా టక్కర సినిమాతో హిట్ కోసం మరో ప్రయత్నం చేస్తున్నాడు. మరి మే నెలలో తెలుగు హీరోలు సత్తా చాటుతారో లేదా అరవ హీరోలే హిట్ కొడతారో వెయిట్ అండ్ సీ.