ప్రస్తుత రోజుల్లో పిల్లలకు వారసత్వంగా ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యం ఇస్తే చాలు. ఎందుకంటే అన్నీ కలుషితం అయిపోయాయి. పచ్చగా కనిపిస్తున్న ఆకుకూరలు కూడా విషపూరితం అయిపోయాయి. ఆరోగ్యాన్నిచ్చే పండ్లపై రసాయనాలు వేయడంతో అవికూడా అనారోగ్యకారకాలవుతున్నాయి. ఆహారధాన్యాలకి కొరతలేదు, దొరకని వస్తువు లేదు కానీ ఆరోగ్యాలు మాత్రం మెరుగుపడడం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఏం పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఇలాంటి టైమ్ లో తల్లిదండ్రులకు ఇచ్చే ఉత్తమ సలహా, పిల్లలకు నిత్యం తినిపించాల్సిన ఉత్తమ ఫుడ్ ఏంటంటే…చద్దన్నం…
పెద్దల మాట చద్దన్నం మూట
పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు..తరాలు గడిచినా ఈ మాట అలా నిలిచిఉండిపోయిందంటే చద్దన్నం పవర్ అలాంటిది మరి. పూర్వకాలంలో బ్రేక్‌ఫాస్ట్ అంటే చద్దన్నమే. ఓ ఉల్లిపాయో, మిరపకాయో నంచుకుని గిన్నెనిండా చద్దన్నం తినేస్తే రోజు మొత్తం ఎర్రటి ఎండలో పొలం పనులు చేసినా అలసట, నీరసం అనది దరిచేసేది కాదు. వడదెబ్బ తగిలే ఛాన్సే లేదు. ఇప్పుడు చద్దన్నం తింటున్నాం అని ఎవరైనా చెబితే అదో అవమానంగా, ఏ మూలనుంచి వచ్చావురా బాబు అన్నట్టు చూస్తారు..కానీ..దాన్ని మించిన ఔషధం లేదని గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా నగరాల్లో జీవనవిధానం మారిపోవడం, వెస్ట్రన్ కల్చర్ పెరగడంతో రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు తినడం అలవాటైంది. స్టైల్ గా తినే ఆ తిండితో అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే కరోనా సమయంలో కూడా చద్దన్నం తినండి .. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి అనే ప్రచారం జరిగింది.
చాలా రోగాలకు చెక్ పెట్టే చద్దన్నం
ఆకలికి ఉండలేరు, కడుపునిండా తింటే అరగదన్న భయం, త్రేణుపులు, కడుపులో అల్సర్లు..వీటన్నింటికీ చద్దన్నం చెక్ పెట్టేస్తుంది. ఎందుకంటే… రాత్రంతా మజ్జిగలో లేదా గంజిలో పులుస్తుంది అన్నం. అందులో పొట్ట ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా తయారవుతుంది. దీన్ని తింటే పేగులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. సమ్మర్ వచ్చిందంటే చాలు ఏం తినమన్నా వేడిచేస్తుందంటారు కదా..అలాంటి వారికి మంచి ఉపశమనం చద్దన్నం. చద్దన్నంలో శరీరానికి అవసరమయ్యే ఐరన్, పొటాషియం, కాల్షియం, లభిస్తాయి. ఐరన్ వల్ల రక్త హీనత సమస్య దరి చేరదు.
ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు చద్దన్నం తింటే బీపీ అదుపులో ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే మానసిక సమస్య అయినా, యాంగ్జయిటీ , చర్మ వ్యాధులు ఇవన్నీ చద్దన్నం తింటే తగ్గిపోతాయంటున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి ఇస్తుంది చద్దన్నం..ఇది తింటే అంత త్వరగా వడదెబ్బ బారిన పడరు. త్వరగా ఆకలి వేయదు.
చద్దన్నం ఎలా
చద్దన్నం కూడా ఎలా చేయాలి అని అడిగేవారున్నారండోయ్..అలాంటి వారికోసం…
రాత్రి వండిన అన్నం మిగిలిపోతుంది కదా…ఆ అన్నాన్ని గిన్నెలో వేసి మజ్జిగ, గంజి వేసి నానబెట్టాలి. ఉదయానికి అది చద్దన్నం అవుతుంది. తినేముందు ఆ అన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది..అమృతంలా ఉంటుంది. ఆవకాయతో తింటే ఆహా అనకుండా ఉండలేరు. ఈ ఎండల్లో ఇంతకు మించిన దివ్య ఔషధం ఏముంటుంది. ఇంకా జొన్న అంబలి, రాగి అంబలి తాగితే ఐరన్, క్యాల్షియం ఎలాంటి సమస్యా ఉండదు. ఆరు నెలలు నిండిన పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవ్వరైనా వీటిని తీసుకోవచ్చు.