ఆలు లేదు చూలు లేదు సీఎం పేరు సోమలింగం అన్నట్లుగా ఉందీ కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి. చీలికలు పేలికలుగా విడిపోయిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కంటే సీఎం పదవ కోసం పోటీ పడటంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నేను సీఎం అని ఒకరిద్దరు నేతలు చెప్పుకుంటుండగా… మరికొందరు చాపకింద నీరులా పదవి కోసం పార్టీలో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నిస్తున్నారు..వారి అంతర్గత కీచులాట ప్రత్యర్థి పార్టీలకు వరప్రసాదమవుతోంది..
శివకుమార్ ఆశలు
డీకే శివకుమార్ రేసులో ముందున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు కాకముందు, ఐన తర్వాత కూడా శివకుమార్ పార్టీ కోసం అందరికంటే ఎక్కువ పనిచేశారని చెప్పుకుంటున్నారు. పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చిన నేతగా శివకుమార్ కే అవకాశాలున్నాయని ఆయన అనుచరుల వాదన. అయితే శివకుమార్ పై కేసులు ఉండటంతో సీఎం పదవి ఎలా ఇస్తారని పార్టీలోనే ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు..అయితే సీఎం రేసులో ఎవరూ లేరని ఎన్నికల తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు ఒకరు సీఎంగా ఉంటారని ప్రకటిస్తున్న శివకుమార్, లోపాయకారిగా మాత్రం తన వర్గాన్ని కూడగట్టుకుంటున్నారు…
మరోసారి సిద్దరామయ్య ఎదురుచూపు…
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కర్చిఫ్ వేసినట్లేనని చెప్పుకుంటున్నారు. తాను సీఎంగా ఉన్నా.. శివకుమార్ సీఎంగా ఉన్నా పెద్ద తేడా ఉండదని ఇద్దరం కలిసి పనిచేసుకుంటామని సిద్దరామయ్య సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాకపోతే సీఎంగా ఉన్నప్పుడు సిద్ధరామయ్య తీరు కొన్ని సందర్భాల్లో పార్టీకి ఇబ్బందిగా మారిందని అధిష్టానం భావిస్తోంది. పైగా 2018 తర్వాత జేడీఎస్ తో కలిసి పనిచేసే విషయంలోనూ సిద్దరామయ్య పార్టీకి ఇబ్బందులు సృష్టించినట్లు చెబుతున్నారు. అదే ఇప్పుడు ఆయనకు శాపమవుతుందని భావిస్తున్నప్పటికీ సిద్దా అంత తేలిగ్గా వదిలేసే నాయకుడు కాదు. తనకు అవకాశం రాకపోతే వేరే వాళ్లని చెడగొట్టడంలో ఆయన దిట్ట అని చాలా సందర్భాల్లో నిరూపితమైంది..
నేనున్నానంటున్న లక్ష్మీ హెబ్బాల్కర్
బెళగావి రూరల్ నుంచి బరిలో ఉన్న లక్ష్మీ హెబ్బాల్కర్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మహిళల రాజకీయాల్లో రాణించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు సంధిస్తున్న ఆమె.. ఒక సారి మహిళా సీఎంకు అవకాశం ఇస్తే తప్పేమిటని నేరుగా వాగ్బాణాలు సంధిస్తున్నారు. కర్ణాటకలో ఇంతవరకు ఒక సారి కూడా మహిళకు సీఎంగా అవకాశం రాలేదని ఆమె గుర్తు చేస్తున్నారు. కుదరకపోతే డిప్యూటీ సీఎం పదవి అయినా ఇవ్వొచ్చు కదా అని ప్రతిపాదిస్తూనే సీఎం పదవికి మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. బెళగావి జిల్లాలోని 18 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అదే జరిగితే తనకు సీఎం అయ్యే అవకాశం వస్తుందని లక్ష్మీ హెబ్బాల్కర్ చెప్పుకుంటున్నారు.
ఖర్గే పేరు ఎందుకు వస్తోంది.. ?
డీకే శివకుమార్ కొత్త పాచిక వేశారు. వేరేవ్వరూ సీఎం రేసులో ఉండాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సీఎం అవుతారని ఆయన తాజాగా ఓ ప్రకటన చేశారు. ఖర్గేకు 80 ఏళ్లు దాటిపోయాయని, ఆయన అతి కష్టం మీద నడుస్తున్నారన్న సంగతి శివకుమార్ మరిచిపోయి మాట్లాడుతున్నారని కొందరు సెటైర్లు వేస్తున్న మాట వాస్తవం. కాకపోతే శివకుమార్ ప్రకటనలో అసలు అర్థం మాత్రం చాలా మందికి తెలిసిపోయింది. నేను వద్దులే నువ్వు చూసుకో అని ఖర్గే అంటారన్నది శివకుమార్ ఆలోచనా విధానమట. ఏదైనా సరే కాంగ్రెస్ గెలిస్తేనా కదా సీఎం చర్చ అన్నది బీజేపీ వాదన..