ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యం వల్ల అంతర్జాతీయంగా ఏపీ పేరు తప్పుడు విషయాల్లో చర్చకు వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఐసిస్‌కు డ్రగ్స్ సరఫరా ఏపీ నుంచి అవుతున్నట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది. ఇది కూడా ప్రభుత్వ లోపంతోనే కావడం అసలు విషాదం. ఇటీవల సూడాన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. అక్కడ దాడుల్లో అంతర్జాతీయ సంస్థకు ఐసిస్ వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ అంటే.. ఎక్కువ సేపు ఉత్తేజితంగా ఉండటానికి.. నిద్ర రాకుండా ఉండటానికి.. పెయిన్ కిల్లర్లుగా వాడే ఉత్ప్రేరకాలు . వీటిని ట్రమడాల్ పేరుతో టాబ్లెట్లుగా వాడుతున్నారు. ఆ టాబ్లెట్లను అక్కడి అంతర్జాతీయ సంస్థలు పట్టుకుని ఎక్కడివా అని ఆరాతీస్తే ఇండియాలోని ఏపీ నుంచి వచ్చాయని తేలింది. భారత ప్రభుత్వం వెంటనే.. అప్రమత్తమయి.. లెక్క తేల్చింది. శనగల శ్రీధర్ రెడ్డిని అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ముంబై తీసుకెళ్లారు కస్టమ్స్ అధికారులు. దీంతో గుట్టు రట్టయింది.
నరసరావుపేట నుంచి ఐసిస్ కు డ్రగ్స్ సప్లయ్ ?
ట్రమడోల్ అనే టాబ్లెట్లను ఏపీలోని సేఫ్ ఫార్మా తయారు చేస్తుంది. వాటిని పెద్ద ఎత్తున ఐసిస్ టెర్రరిస్టుల దగ్గర పట్టుకున్నారు. గోప్యంగా జరిగిన విచారణ తర్వాత సేఫ్ ఫార్మా డైరక్టర్ శ్రీధర్ రెడ్డిని ముంబై నుంచి వచ్చిన కీలక దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. వీటిని ఎగుమతి చేయడానికి ముఖ్యంగా ఐసిస్ టెర్రరిస్టులకు ఎగుమతి చేయడానికి అనుమతులు లేవు. నిజానికి అంతర్జాతీయంగా దీన్ని మత్తు పదార్థంగా గుర్తించి బ్యాన్ చేశారు. తయారీని నిషేధించారు. అయినా ఏపీలో అధికారులు దీని తయారీకి అనుమతి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారో అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన అనుమతితో అక్రమంగా టన్నుల కొద్దీ ఐసిస్ కు టాబ్లెట్లు చేరిపోయాయి . వారు వాడుతున్నారు. ఇప్పుడు విషయం బయటపడింది. ఎప్పట్నుంచి ఇలా ఎగుమతి చేస్తున్నారు.. ఎలా డబ్బులు తీసుకుంటున్నారు అనేది తేలాల్సి ఉంది. అన్నీ విచారణలో ఉన్నాయి
కోడెల పెట్టిన కంపెనీ సేఫ్ ఫార్మా.. మరణం తర్వాత వేరే వారి చేతుల్లోకి !
ఈ సేఫ్ ఫార్మా కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందినది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు వారిది కాదు. ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత కంపెనీ యజమానులు మారారు. అరెస్ట్ అయిన శ్రీధర్ రెడ్డితో పాటు మరో నలుగురు డైరక్టర్లుగా చేరారు. ఇంత దారుణమైన వ్యవహారాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా.. అసలు కుట్ర మెడిసిన్స్ ను పంపడమేనా అంతకు మించి ఉందా అన్నది తేలుస్తుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కేంద్రం అసలు కుట్రను బయట పెట్టింది. ఇప్పుడు రాష్ట్రం అసలు ఇంత దారుణమైన అంతర్జాతీయ స్కామ్‌కు ఎలా వేదికయిందని తేలాల్సి ఉంది.
పోలీసులు తక్షణం నిగ్గు తేల్చాలన్న విష్ణువర్ధన్ రెడ్డి !
ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థకు ఏపీ నుంచి “డ్రగ్స్” సరఫరా కేంద్రం కావడం ఆశ్చర్యకమని.. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. కేంద్రం నిషేధించిన ట్రమడాల్ను ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అనుమతి ఇచ్చిందనిఆయన ప్రశ్నించారు. ఎగుమతి చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలి.ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఏపీ నుండి సరపరాపై, కేంద్రం గుట్టు రట్టు చేసింది. ఇప్పుడు రాష్ట్రం మేలుకోవాలి. ఈ టెర్రర్ లింక్ గుట్టు రట్టు చేయాలి. భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేస్తామని విష్ణువర్దన్ రెడ్డి హెచ్చరించారు.
ఐసిస్‌కు డ్రగ్స్ సరఫరా చేయడమంటే చిన్నవిషయం కాదు. దేశ భద్రతకు సంబంధించిన విషయం. మరి పోలీసులు ఏం చేస్తారో ?