మీరు సంగీత ప్రియులా…అనుక్షణం ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారా? ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ తీయడం లేదా? ఎక్కువ సమయం ఫోన్, ఇయర్ ఫోన్ వదలడం లేదా…అయితే మీరు ఎంత ప్రమాదంలోకి వెళ్లిపోతున్నారో తెలుసా..
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ యువతకు పెద్ద శబ్దంతో సంగీతం వినడం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎప్పుడో హెచ్చరించింది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువత.. సంగీతం వినడానికి ఇయర్ఫోన్లు వాడుతుంటే.. వారిలో దాదాపు 50 శాతం మంది ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వీరికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది.
ఫోన్లు చూస్తూ చూస్తూ కంటి చూపుకి ఎసరు పెట్టుకుంటున్నారు, అదే పనిగా మాట్లాడుతూ- మ్యూజిక్ వింటూ సినిమాలు చూస్తూ వినికిడి శక్తి పాడుచేసుకుంటున్నారు. పోన్ వాడకమే సమస్య అనుకుంటే ఇయర్ ఫోన్స్ వాడకం మరింత ప్రమాదం అని గుర్తించడం లేదు. ఎక్కువ సమయం పాటు ఇయర్ పోన్లు చెవిలో పెట్టుకుని అదే పనిగా వివే వారి వినికిడికి సమస్య తప్పకుండా వస్తుందంటున్నారు నిపుణులు. ఆఫీసు జూమ్ మీటింగులు, ఇష్టమైన పాటలు వినడానికి, గేమ్ ఆడేందుకు, బయటి శబ్దాలు వినపడకుండా ఉండేందుకు ఇలా రకరకాల కారణాలతో ఇయర్ ఫోన్లు జీవితంలో విడదియరాని భాగంగా మారాయి. ఇలా మన ప్రపంచంలో మనం ఉండేందుకు ఎంత సౌకర్యవంతంగా ఉంటాయో అతిగా వినియోగిస్తే అంతే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
ఇయర్ ఫోన్ల నుంచి వచ్చే శబ్దం మీ కర్ణభేరికి దగ్గరగా ఉంటుంది. ఈ శబ్దం తీవ్రమైనపుడు కర్ణభేరికి శాశ్వత నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఇయర్ ఫోన్ ఉపయోగించి మాట్లాడేవారు మామూలుగా మాట్లాడడం మంచిది. ఇయర్ కెనాల్ లో దగ్గరగా వినిపించే శబ్దం ఒత్తిడిని పెంచి తలతిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అన్ స్టాప్ గా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుంటే హెయిర్ సెల్స్ కారణంగా చెవిలోపలి భాగాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి. ఇయర్ ఫోన్ నేరుగా ఇయర్ కెనాల్ లోకి ప్లగ్ చేయడం వల్ల లోపలకు వెళ్లే గాలిని అడ్డుకుని చెవి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఇయర్ ఫోన్లు ఎక్కువగా వినియోగించేవారి చెవిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ఇయర్ ఫోన్లు షేర్ చేసుకునే అలవాటు ఉంటే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరిగ్గా ఫిక్స్ చెయ్యని లేదా లోపాలున్న ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలో నొప్పి తప్పదు. పైగా చెవిలో అలా ఏదో ఒకటి మోగుతుండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ (NIHL) పెద్ద శబ్దాల వల్ల మాత్రమే కాదు ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్లు వాడడం వల్ల కూడా రావచ్చు. పెద్ద పెద్ద శబ్దాలు తరచుగా వినడం వల్ల కాక్లియాలోని సెల్స్ దెబ్బతింటాయి. దీని వల్ల చెవిలో లేదా తలలో రింగుమనే శబ్దం వినిపిస్తుంటుంది. దీనిని టిన్నిటస్ అంటారు..ఇలాంటి వారికి సాధారణ ధ్వనికి కూడా అధికంగా స్పందిస్తారు..దీనిని దీనిని హైపర్కసిస్ అంటారు. అందుకే రోజుకు గంటకు మించి ఇయర్ పోన్లు వాడకూడదు అంటున్నారు నిపుణులు.
హెడ్ ఫోన్స్ బెటర్
సౌండ్‌ను డెసిబెల్స్‌లో కొలుస్తారు. సౌండ్ 60 డెసిబెల్స్ కంటే తక్కవగా ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్‌తో పాటలు విన్నా పెద్ద సమస్య ఉండదు. కానీ 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే.. వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. మన ఫోన్లలో సౌండ్‌ను కొలవడం కష్టం.. చెవులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు వాల్యూమ్‌ను 50% సెట్టింగ్‌లో ఉంచడంతోపాటు, వినే సమయాన్ని తగ్గించడం ఉత్తమ ఆలోచన. మనం సాధారణంగా ఇయర్ ఫోన్స్‌ను.. హెడ్ ఫోన్స్ అని పిలుస్తాం. కానీ అవి రెండూ ఒకటి కాదు. ఇయర్ ఫోన్లు చిన్నాగా చెవిలో సరిపోయేటట్టు ఉంటాయి. హెడ్ ఫోన్లు చెవిమీద పెడతాం. హెడ్ఫోన్లు పెట్టుకుంటే.. శబ్ధానికి, కర్ణభేరి మధ్య గ్యాప్ ఉంటుంది. తద్వారా చెవిపై అంతగా ప్రభావం చూపవు. అవి కూడా అధికంగా వాడడం మంచిది కాదు