రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిన ఆయా రామ్.. గయా రామ్.. సంస్కృతీ ఇంకా కొనసాగుతోంది. తాను తీసుకున్న గోతిలో కాంగ్రెస్ తానే పడిపోయినప్పటికీ చాలా మందికి జ్ఞానోదయం కావడం లేదు. ఒక్క చోట అనివార్య కారణాల వల్ల అవకాశం ఇవ్వకపోతే కొందరు నేతలు జంప్ జిలానీల్లా మారుతున్నారు. కేడర్ బలంతో, సైద్ధాంతిక పురోగమనంతో ఒక్కో మెట్టు ఎక్కే బీజేపీని ఎలాంటి ఎదురుదెబ్బలు కృంగదీయలేవని నిత్యం నిరూపితమవుతూనే ఉంది. ఒకరిద్దరు అసంతృప్తిపరుచు తమకు నచ్చిన చేయి పట్టుకున్న కమలం వాడిపోదని చెప్పేందుకు అనేక ఉదంతాలున్నాయి…
కర్ణాటక ఎన్నికల వేళ…
కన్నడ దేశంలో ఇప్పుడు కాషాయ గాలి వీస్తోంది. ప్రజా బలం బీజేపీ వైపు ఉంది. అవసరాన్ని బట్టి, అవకాశాలను బేరీజు వేసి కమలం పార్టీ టికెట్లు బట్వాడా చేస్తే కొందరు బాగా హర్టయ్యారు. ఎన్నికల వేళ అలకలు సాధారణ విషయమే అయినా.. కొందరు నేతలు తిరుగుబాటుదారులుగా మారి.. ఫిరాయించేశారు. ఆ మాత్రానికే బీజేపీ ఓడిపోతుందని, తాము నెగ్గుతామని చెప్పుకుంటూ కాంగ్రెస్ నేతల తెగసంబరపడిపోవడం విడ్డూరంగా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో మాజీ ఉప ముఖ్యమంత్రి చేరిపోవడం… వాళ్లిద్దరూ బలమైన సామాజికవర్గం నేతలు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఉబ్బితబ్బిబవుతోంది. పైగా తొలి ఓటు నమోదు కాకుండానే గెలిచినంత బిల్డప్ ఇచ్చేస్తోంది. ఒకరిద్దరు పోయినంతమాత్రాన బీజేపీకి వచ్చే నష్టమేదీ లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. కర్ణాటకలోనే కాదు… ఐదు నెలల్లో ఎన్నికలు జరిగే తెలంగాణలో సైతం విజయఢంకా మోగిస్తామని వ్యూహాల్లో దిట్ట అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన మాటగా చెప్పడంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి.. పార్టీలు ఏమైనా చెప్పుకోవచ్చు. పార్టీల ఆకాంక్షలు నేతల ప్రకటనలకు.. ఎన్నికల ఫలితాలకు మధ్య ఉన్న తేడానే అసలైన వాస్తవమని మరిచిపోకూడదు.
బీజేపీతోనే రాజకీయ పురోగతి
బీజేపీ అధినాయకత్వ ఆత్మవిశ్వాసానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తిరుగుబాటును ఎలా ఎదుర్కోవాలో, ప్రత్యర్థుల పన్నాగాలను ఎలా తిప్పుకొట్టాలో ఆ పార్టీకి బాగానే తెలుసు. నిజానికి ఏ పార్టీకి తిరుగుబాటు కొత్త కాదు.. బీజేపీ అందుకు మినహాయింపు కూడా కాదు. ఒక్కటి మాత్రం నిజం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్లు రాజకీయంగానూ, పదవుల పరంగానూ లబ్ధి పొందితే… బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వాళ్లు సర్వం కోల్పోయి రాజకీయాల నుంచి కనుమరుగైపోయారు. జన్ సంఘ్ పార్టీ కాలంలో కూడా అదే జరిగింది. పార్టీ వ్యవస్థను, క్రమశిక్షణను దాటుకుని తిరుగుబాటు చేసిన వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టుకుని పోయారు. ఎందుకంటే పార్టీ శ్రేణులు, కార్యకర్తల మద్దతును వాళ్లు పొందలేకపోయారు. నాడు బాలరాజ్ మధోక్, తర్వాతి కాలంలో ఏకే సుబ్బయ్య అలాగే ఫేడవుట్ అయ్యారని చెప్పక తప్పదు.
దేశ రాజకీయ చరిత్రనే మార్చేసిన వాఘేలా తిరుగుబాటు
బీజేపీలో శంకర్ సింఘ్ వాఘేలా తిరుగుబాటు దేశంలో సమూల మార్పులకు అవకాశం ఇచ్చింది. ఆయన కారణంగానే ఆరెస్సెస్ ప్రచారక్ గా ఉన్న నరేంద్ర మోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రదానిగా దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చేశారు. దేశానికి ఒక మంచి నాయకుడు దొరికారు. బీజేపీకి మోదీ చేసిందేమిటని ఎవరూ అడగాల్సిన పని లేదు. ఎందుకంటే అది కళ్లముందు కనిపిస్తున్న నిజం. ఒకప్పుడు ఆరెస్సెస్, బీజేపీలో కీలక పాత్ర పోషించిన వాఘేలా.. తర్వాత కాంగ్రెస్ లో కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం పొంది ఉండొచ్చు. ఆయన లాంటి నేతల వల్ల కాంగ్రెస్ భూస్థాపితం అయ్యిందని మాత్రం ఎవరిని అడిగినా చెబుతారు..1990లో కర్ణాటక బీజేపీ నేత బీబీ శివప్ప చేసిన తిరుగుబాటు కూడా అట్టర్ ప్లాపేనని అందరూ గుర్తించారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ గెలుపుకోసం అహరహం కృషి చేస్తున్న బీఎస్ యడ్యూరప్ప కూడా ఒకప్పుడు రెబల్ స్టారే.. పార్టీ నుంచి బయటకు వెళ్లి బీజేపీపై టన్నుల కొద్ది బురదజల్లి, సొంత పార్టీ పెట్టి ఘోర వైఫల్యం చెందిన యడ్యూరప్ప తర్వాత తప్పు తెలుసుకున్నారు. బీజేపీకి దూరం జరిగితే కలిగే నష్టమేంటో అర్థం చేసుకున్నారు. రెండు సంవత్సరాలు పాటు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తన కర్ణాటక జనతా పక్షా(కేజేపీ) పార్టీని బీజేపీలో విలీనం చేశారు. పార్టీ కూడా ఆయన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి పదవినిచ్చింది..
ఉమాభారతి, టైగర్ నరేంద్ర, విజయశాంతి ఏం చేసినట్లు..
కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి పార్టీ నుంచి బయటకు వెళ్లి ఏం సాధించినట్లు. తిరిగి, తిరిగి మళ్లీ బీజేపీలోకే ఆమె రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. టైగర్ నరేంద్రగా పిలిచే ఆలె నరంద్ర , బీజేపీలో ఉన్నప్పుడు చాలా పాపులర్ లీడర్. పార్టీ మీద అలిగి బీజేపీలో చేరిన తర్వాత ఎంపీ కూడా అయ్యారు. అయినా ఏం ప్రయోజనం కమలం పార్టీలో ఉన్నప్పుడు హైదరాబాద్ కేడర్ మొత్తం ఆయన వెంట ఉండేది. టీఆర్ఎస్ లో ఆయన బావుకున్నదీ శూన్యం. చనిపోయే నాటికి ఆయనో అనామక లీడర్. నటి విజయశాంతి కూడా అంతే. పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కిస్తే అగిలి వెళ్లి టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ముందు ఎంపీ పదవి ఇచ్చినా తర్వాత పురుగు కంటే హీనంగా చూశారు. చివరకు ఆమె మరోసారి బీజేపీలో చేరారు. ఇప్పుడు పార్టీ ఆగ్రనాయకత్వం సరసన కూర్చునే అవకాశం పొందిన తర్వాతే జరిగిన తప్పు గుర్తుకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో కూడా రెబెల్స్ రాజకీయంగా అంతర్థానమైపోయారు.
ఏదో సాధిద్దామని తిరుగుబాటు చేసే వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. బీజేపీ కేడర్ బలమున్న పార్టీ. సైద్ధాంతిక ప్రచారంలో కింది స్థాయి కార్యకర్తలదే ప్రధాన పాత్ర. బీజేపీలో ప్రతీ వ్యక్తి జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తారని ప్రధాని మోదీ చెబుతుంటారు. ఆ సంగతి అర్థం చేసుకున్న వారు పార్టీకి, దేశానికి ఉపయోగపడతారు. వారికీ ప్రయోజనం కలుగుతుంది. లేకపోతే వాళ్ల ఖర్మ. పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు..