రైతుల్ని గాలికొదిలేసిన ఏపీ ప్రభుత్వం – చార్ఝిషీట్ వేస్తామన్న బీజేపీ !

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట తడిచిపోయింది. అదే సమయంలో కాపాడుకున్న పంటలను కొనడానికి కూడా ఎవరూ రావడంలేదు. ఓ సారి వడగళ్ల వానలు మరోసారి భారీ వర్షాలు దంచికొట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ సమానంగా రైతులు నష్టపోయారు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాలు ఒకే రకంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాటలతో మభ్య పెడుతోంది. ఏపీ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడం లేదు.

ఏపీలో రైతుల్ని పట్టించుకునేవారే కరవు !

ఏపీలో ప్రకృతి విపత్తులు ఎన్ని వచ్చినా అసలు పట్టించుకునే వారే లేరు. గత నాలుగేళ్లుగా ఎన్ని విపత్తులు వచ్చినా రైతుల్ని ఆదుకున్న వారు లేరు. భరోసా ఇచ్చిన వారు కూడా లేరు. పంటల బీమాను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అన్నమయ్య లాంటి డ్యామ్‌లు కొట్టుకుపోయినా పట్టించుకున్న వారులేరు. అందుకే రైతులు పూర్తిగా రుణఊబిలో చిక్కుకున్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొలాల్లో బురదలోకి దిగి రైతుల్ని పరామర్శించేవారు. ఎకరాలకు యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఐదు వేలు కూడా ఇవ్వడం లేదు. సరి కదా కనీసం పరామర్శించడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు వంద నుంచి వెయ్యి వరకూ సాయం చేస్తున్నారు. అదీ కూడా అందరికీ అందడంలేదు. ఇప్పుడు కూడా అంతే నింపాదిగా వ్యవహరిస్తున్నారు.

రైతే బాగుంటునే రాజ్యం బాగుటుందని గతంలో నినాదాలు !

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని గతంలో జగన్ నినాదాలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రూ. ఏడున్నర వేలు భరోసా పేరుతో నిధులు ఇచ్చి..తాము రైతుల్ని ఉద్దరించామంటున్నారు. భరోసా పేరుతో ఇచ్చే నిధుల్లో ఆరు వేలు కేంద్రం ఇస్తున్నవే. అయినా అవి రాష్ట్రం ఖాతాలోవేసుకుని ప్రచారం చేసుకుంటున్నరు. అవి ఇస్తున్నారని చెప్పి పూర్తిగా రైతుల్ని గాలికి వదిలేశారు. ఎలాంటి ఇతర పథకాలు అమలు చేయడం లేదు. ధాన్యం కొనడం లేదు. మద్దతు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఓ వైపు రైతులు అకాల వర్షాలతో తంటాలు పడూతంటే.. మరో వైపు పంటను కాపాడుకున్న వారు అమ్ముకోలేకపోతున్నారు.

ప్రజల ముందు చార్జిషీట్ల రూపంలో పెడతామన్న విష్ణువర్ధన్ రెడ్డి !

రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెడతామని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ఏపీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను చార్జిషీట్ల రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.అందులో భాగంగా రైతులను ప్రస్తుత ప్రభుత్వం ఎలా మోసం చేసింది.. కేంద్ర నిధుల్ని ఎంతమేర దారి మళ్లించి రైతుల్ని మోసం చేసింది వంటివన్నీ చార్జిషీట్‌లో పెట్టాలని నిర్ణయించుకుంది. రైతుల తరపున పోరాడటానికి ఏపీ బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.