Spirituality: సప్త చిరంజీవులు అంటే ఎవరు – వీళ్లకి మరణం ఎందుకు ఉండదు!

చిరంజీవులు అంటే మరణం లేనివారని అర్థం. పురాణాల ప్రకారం ఇలాంటి వాళ్లు ఏడుగురున్నారు. వాళ్లెవరు , ఈ ఏడుగురే ఎందుకు చిరంజీవులయ్యారో తెలుసుకుందాం…

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

అశ్వత్థాముడు, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు…ఈ ఏడుగురు సప్తచిరంజీవులుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ శాపము వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహము వల్ల బలిచక్రవర్తి, లోకహితము కోసం వ్యాసుడు, శ్రీరామునిప భక్తితో హనుమంతుడు, రాముడి అనుగ్రహము వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మము కలగడం వలన కృపుడు, ఉత్క్రుష్టమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్తచిరంజీవులు అయ్యారు. ఎందుకంటే…

వ్వాసమహర్షి
సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. ఆయన పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి…తమ తమ గురువులను పూజించి, వారి ఆశీస్సులు తీసుకుంటారు.

హనుమంతుడు
భక్తుడైన హనుమంతుడికి శ్రీ రాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసుతుడు అందుకు అంగీకరించడు. తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు. అందుకు శ్రీ రాముడు కూడా ఒప్పుకుంటాడు. ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు, కీర్తనలతో కొలుస్తున్నారు. చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడని, కొంత మంది చూశారని చెబుతుంటారు. మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజముపై వెలసి పాండవుల విజయంలో భాగం పంచుకున్నాడు.

విభీషణుడు
రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు- తర్వాత అంతే స్థాయిలో చెప్పుకోదగ్గవాడు విభీషణుడు.రాక్షస వంశంలో పుట్టినా ఆయన సర్వజ్ఞుడు. విశ్రావసుడు – కైకసీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని. రావణునికి తమ్మునిగానేగాక, సలహాదారునిగానూ తన తెలివి తేటలు ప్రదర్శించాడు. రాముని అనుగ్రహము వల్ల విభీషణుడు చిరంజీవి అయ్యాడు.

అశ్వత్థాముడు
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు. కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు. భీముడికి, దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది. దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు. ఎలాగైన ప్రభువు రుణం తీర్చుకుంటానన్న అశ్వత్థాముడు .. శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న ఉపపాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకుని వచ్చి, దుర్యోధనుడి దేహం ముందు పడవేసి ప్రభు రుణం తీరిపోయినట్లుగా భావించాడు. దీనిపై ఆగ్రహించిన అర్జునుడు అశ్వత్థాముడిని చంపేందుకు కత్తి దూయగా ద్రౌపది అడ్డుకుంటుంది. నిస్సహాయంగా ఉన్న ఇతడిని చంపడం కన్నా గుండు చేసి వదిలెయమని అంటాడు శ్రీ కృష్ణుడు. నువ్వు చేసిన పనికి ఒళ్లంతా కుళ్లిపోయి, రక్తమాంసాలతో కంపుకొడుతూ చావుకోసం ఎదురు చూస్తూ ఇలాగే జీవిస్తావని శ్రీ కృష్ణుడు శపిస్తారు. అశ్వత్థామ అలా చిరంజీవి అయ్యాడు.

బలిచక్రవర్తి
హారణ్య కశిపుడి కొడుకైన ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. దేవాంబ- విరోచనుల తనయుడు. రాక్షసుడైనప్పటికీ బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలున్నాయి. స్వర్గం మీద దండెత్తి ఇంద్రుని ఓడించి, స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు. ఒకసారి విష్ణుమూర్తిని తూలనాడిన బలిచక్రవర్తిపై ఆగ్రహంతో..ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు. చివరకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి, యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వచ్చి, మూడు అడుగుల నేలను దానం కోరతాడు. ఒక అడుగుతో నేలను, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడవ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరగా, బలిచక్రవర్తి శిరస్సు చూపుతాడు. మూడవ అడుగు అక్కడ మోపి, బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు. అలా బలికి చావులేకుండా వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు.

కృపాచార్యుడు
సప్త చిరంజీవులలో 6వ వాడు కృపుడు. శరద్వంతుడు తపస్సు చేసుకునేవాడు…ఆ తపస్సు భంగం చేయడానిరి ఇంద్రుడు ఒక అప్సరసను పంపుతాడు. శరద్వంతుడికి ఆ అప్సరసకు జన్మించిన కుమారుడే కృపుడు. కృపుడు శరద్వంతుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షం నిలిచి యుద్ధం చేశాడు . కృపుడు ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు.

పరశురాముడు
రేణుకా జమదగ్ని కుమారుడు పరశురాముడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు .శివుని ఆజ్ఞతో తీర్ధయాత్రలు చేసిన పరశురాముడు…శివానుగ్రహంతో భార్ఘవాస్త్రము పొందాడు. విష్ణుమూర్తి దశావతారములలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు. పరుశరాముడు కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు.

ఈ ఏడుగురితో పాటూ, శివానుగ్రహంతో కల్పంజయుడైన మార్కండేయుడిని నిత్యం స్మరించుకుంటే సర్వవ్యాధులనుంచి ఉపశమనం పొందుతారని శాస్త్రవనచనం.