Summer Drinks: కూల్ డ్రింక్స్ కాదు సమ్మర్లో ఇవి తాగండి – చల్లదనం, ఆరోగ్యం

ఎండలు ఠారెత్తిస్తున్నాయి..చమట రూపంలో ఎనర్జీ అంతా కరిగిపోతుంటుంది..నోరెండిపోతుంది..ఇలాంటి సమయంలో బాటిల్ నీళ్లు మొత్తం తాగేసినా రాని రిలీఫ్ గుక్కెడు చల్లని డ్రింక్ తాగితే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే సమ్మర్ మొదలయ్యిందంటే చాలు కూల్ డ్రింక్స్ కి ఫుల్ డిమాండ్. అయితే చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ తాగితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.. మరి ఏం చేయాలంటారా.. మీకోసమే ఈ కథనం

వేసవి మొదలవగానే ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, ఏసీలు ఆగవు…బయట అడుగుపెడితే కూల్ డ్రింకో, ఐస్ క్రీమో తింటేకానీ చల్లబడినట్టు అనిపించదు. అయితే ఈ ఎండల బాధ భరించలేక చల్లటి డ్రింక్స్ తాగేస్తుంటారు కానీ వాటివల్ల ఆ క్షణం మాత్రమే ఉపశమనం.. ముందు ముందు ఆరోగ్య పరంగా ఎంత నష్టమో ఆలోచించరు. అంటే ఎండలకు కొంత సిక్ అయితే కూల్ డ్రింక్స్ తాగి ఫ్యూచర్లో కూడా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. వాటికి తోడు నూనె పదార్థాలు తీసుకోవడంతో మరింత దారుణంగా తయారవుతుంది ఆరోగ్యం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ క్షణం ఉపశమనం కోసం ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే… శరీరాన్ని చల్లబరుస్తూ ఆరోగ్యాన్నిచ్చే పానీయాలు ఉన్నాయి. శరీరంలో వేడిని సహజంగా తగ్గించడంలో మీ ఆరోగ్యానికి భంగం కలిగించని కొన్ని సూపర్ డ్రింక్స్ ఇవే

సబ్జా
సబ్జా గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ స్పూన్ సబ్జా నీట్లో వేస్తే బాటిల్ వాటర్ కి సరిపోతుంది. పీచు పదార్థం కావడంతో పొట్టలో ఉండే అల్సర్లు మాయమవుతాయి, శరీరానికి మంచి చల్లదానాన్ని ఇస్తాయి..వడదెబ్బ బారినుంచి రక్షణ కలిగిస్తాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే సబ్జాలు డైలీ వినియోగిస్తే అధిక బరువు నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు

కోకుమ్ జ్యూస్
శరీరంలో వేడి, కడుపులో మంట తగ్గించడానికి ఉపయోగపడే మరో పానీయం కోకుమ్ జ్యూస్. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. నిర్జలీకరణాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షణగా నిలుస్తుంది.

బార్లీ
బార్లీ గురించి మీ ఇంట్లో పెద్దవారిని అడిగితే పెద్ద కథే చెబుతారు. శరీరంలో పేరకుపోయిన వ్యర్థ్యాలను బయటకు తొలగించడంలో బార్లీ ఉపయోగపడుతుంది. శరీరంలో అదనంగా ఉన్న నీటిని కూడా తొలగిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో బార్లీ ది బెస్ట్. దీనిని నాన బెట్టుకుని ఉడికించి పంచదార, పాలు వేసుకుని తాగితే అద్బుతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఈటేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. పాయసం కూడా చేసుకోవచ్చు.

నిమ్మ-పుదీనా జ్యూస్
సోడాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ బయట దొరికే సోడాలన్నీ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అవి ఇష్టపడేవారు నిమ్మ-పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారుచేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాసు నిమ్మ-పుదీనా జ్యూస్ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. అంతేకాకుండా దీనిలోని 40 గ్రా. సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్ శరీరానికి మేలు చేస్తాయి.

ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్
ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు తీసుకుంటే వేసవిలో డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్. ఎండలో బాగా కష్టపడేవారికి, ఎక్కువగా అలసటకు గురయ్యేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ స్పోర్ట్స్ డ్రింక్ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. ఇది జీరో కొలస్ట్రాల్ డ్రింక్. నీళ్లను మరిగించి దించేసిన తర్వాత అందులో నారింజ పండు జ్యూస్‌, ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి రిఫ్రిజిరేటర్‌లో పెట్టి బాగా చల్లగా అయిన తరవాత తాగితే టేస్ట్ బావుంటుంది…ఆరోగ్యం.

కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్ల గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏం లేదు. ఓ కొబ్బరికాయ నీళ్లు తాగితే ఓ పూట భోజనం చేసినట్టే. సమ్మర్లో డీ హైడ్రేషన్ నుంచి కాపాడతాయి కొబ్బరినీళ్లు. శరీరానికి చల్లదాం, ఆరోగ్యం.

ఖుస్ షర్బత్
ఖుస్ గడ్డి నుంచి తయారు చేసేది ఖుస్ షర్బత్. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అధిక వేడి వల్ల కళలు ఎర్రగా మంటలు అనిపిస్తాయి. ఖుస్ షర్బత్ తాగాతే కళ్ల మంటల నుంచి ఉపశమనం లభిస్తుంది..శరీరం చల్లబడుతుంది.

పుచ్చకాయ, దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష జ్యూస్ లు కూడా బయట తాగేకన్నా ఇంట్లోనే తయారుచేసుకుని ప్రిజ్ లో పెట్టుకుని తాగడం మంచిది. ఇంకా మజ్జిగ, కొత్తమీర-పుదీనా ఆకులు తినడం, కీరదోస తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది..వడగాడ్పుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.