టీఆర్ఎస్ ఎక్కడుంది ? బీఆర్ఎస్ ఆవిర్భావం ఖమ్మంలో చేశారుగా ?

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అంటూ గులాబీ నేతలు హడావుడి చేస్తున్నారు. కానీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం అక్టోబర్ ఐదో తేదీన. డిసెంబర్ 8వ తేదీన ఈసీ ఆమోద ముద్ర వేసింది. కేసీఆర్ సంతకం పెట్టి టీఆర్ఎస్‌కు ముగింపు.. బీఆర్ఎస్‌కు ఆవిర్భావం చేశారు. అందుకే ఖమ్మంలో ఆవిర్భావ సభ పెట్టి.. దేశంలో ఉన్న ప్రముఖ నేతలందర్నీ పిలిచారు కేసీఆర్. మరి ఏప్రిల్‌లో మళ్లీ బీఆర్ఎస్ ఆవిర్భావం ఎలా వచ్చింది. టీఆర్ఎస్‌ను మాయం చేసేసి బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కూడా గులాబీ నేతలు ఆ సెంటిమెంట్ ను కాపాడుకోవడానికి ఈ కొత్త తరహా రాజకీయం చేస్తున్నారు.

టీఆర్ఎస్‌ను మూసేసి బీఆర్ఎస్ ప్రారంభించిన కేసీఆర్ !

తెలంగాణ రాష్ట్ర సమితి గత అక్టోబర్‌లో అంతర్థానం అయింది. తమ పార్టీని భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తర్వాత ఈసీ ఆమెదించింది. ప్రక్రియ పూర్తి చేసేశారు. అంటే ఇక టీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్నమాట.

ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని బీఆర్ఎస్ పేరుతో చేసుకుంటున్న గులాబీ నేతలు !

తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ లేదు. అయినప్పటికీ ఆ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది . టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జలదృశ్యంలో ప్రాణం పోసుకున్న పార్టీ… లక్ష్యం సాధిందింది. కేసీఆర్ మరో లక్ష్యం కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. దాంతో ఆ పార్టీ చరిత్రలో కలిసిపోయినట్లయింది. అయినప్పటికీ ఆవిర్భావ సభలు… ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. మరి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం ఎందుకన్న చర్చ కూడా వస్తుంది. టీఆర్ఎస్ అనేది ప్రజల సెంటిమెంట్ మారింది. అదే భావన ప్రజల్లో ఉండాలంటే… టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్ని బీఆర్ఎస్ ద్వారా నిర్వహించాలన్న ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు. నేతల్లో తప్ప… జనంలో బీఆర్ఎస్ పేరు కన్నా టీఆర్ఎస్ అనే చర్చించుకునేలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా ప్రజల్లో ఇది తమ పార్టీ అనే భావన తగ్గకుండా చేయడానికేనన్న వాదన వినిపిస్తోంది.

ప్రజల్ని మోసం చేయగలరా ?

తెలంగాణలా ఇండియాను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ . టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారని చెప్పుకున్నారు. తెలంగాణ పార్టీ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి నేరుగా పార్టీ పేరునే మార్చేందుకు నిర్ణయించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వదిలేసుకుంటే మోసం వస్తుందని కొత్తగా బీఆర్ఎస్‌నే టీఆర్ఎస్‌గా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో సోల్ ఏమీ మారలేదని.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడే ప్రసక్తే ఉండదని.. నమ్మబలుకుతున్నారు. కానీ ప్రజలు అంత అమాయకులా ?