ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఆపరేషన్ కర్ణాటకపై దృష్టి పెట్టారు. మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు యోగి కూడా తన వంతుగా కర్ణాటక బీజేపీ తరపున ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తేనే యోగి ఛరిస్మా అర్థమవుతుంది..
మాండ్యాలో తొలి సభ..
యోగీకి యూపీలో బుల్డోజర్ సర్కారు అని పేరు ఉంది. కర్ణాటకలో మాత్రం అలాంటి ఆలోచనకు అవకాశం లేకుండా బీజేపీ ప్రచారం సాగిపోతోంది. ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని ఒక్కళిక కుంచుకోటగా భావించే మాండ్యాలో యోగి తొలి సభను బీజేపీ ఏర్పాటు చేసింది. అంటే మాజీ ప్రధాని దేవెగొడ కుటుంబాన్ని యోగి టార్గెట్ చేశారని కూడా చెప్పొచ్చు. తొలుత రోడ్ షో, తర్వాత నిర్వహించిన బహిరంగ సభకు విశేష జనాదరణ లభించిందనే చెప్పాలి. జేడీఎస్ ను దెబ్బకొట్టాలంటే ఒక్కళిక ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ భావిస్తున్న తరుణంలోనే అక్కడ యోగి మీటింగుకు ప్లాన్ చేసిందని చెప్పాలి..
రైతు ఆత్మహత్యలను నిరోధిస్తాం..
మాండ్యా ఒక వ్యవసాయ ప్రధాన ప్రాంతం. అక్కడ పంటలు సరిగ్గా పండక, గిట్టుబాటు ధరలు రాక అన్నదాతలు నానా అగచాట్లు పడుతుంటారు. మాండ్యా జిల్లాలో రైతు ఆత్మహత్యలు కూడా ఎక్కువే. కర్ణాటక రైతు ఆత్మహత్యల్లో మాండ్యా నెంబర్ వన్ ప్లేస్ పొంది ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ప్రతీ ఏటా కనీసం యాభై మంది రైతులు అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీకి మళ్లీ అధికారమిస్తే రైతు సంక్షేమ విధానాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ఆత్మహత్యలు లేకుండా చేస్తామని యోగి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ కాదు.. టీమిండియా..
యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పంచవర్ష ప్రణాళికలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. మోదీ వచ్చిన తర్వాతే అసలు అభివృద్ధి కనిపిస్తోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, మోదీ వచ్చిన తర్వాత శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చక చకా జరిగిపోతున్నాయన్నారు. బీజేపీ పాలనలో టీమిండియా భావన పటిష్టమవుతోందని, అందరూ కలిసి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని యోగి పిలుపునిచ్చారు. కర్ణాటకలో మరోసారి అధికారమిస్తే డబుల్ ఇంజిన్ గ్రోత్ కు అవకాశం ఉంటుందన్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం బీజేపీతోనే సాధ్యమని యోగి చెప్పుకున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఏదేమైనా యోగి ప్రచారం కర్ణాటక బీజేపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి..