ఏ దేశమేగినా ఎందుకాలిడినా భారతీయులు ఆ ప్రాంత అభివృద్ధికి, పురోగతికి కృషి చేస్తారు. అక్కడి ప్రజల్లో కలిసిపోయి జీవిస్తూ సామాజిక అభివృద్ధికి కృషి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం గత్యంతరం లేక నానా తంటాలు పడుతూ అక్కడ నుంచి తరలి రావాల్సిన అనివార్యతలో ఉంటారు. అలాంటి వారిని తరలించే ప్రక్రియలో ఐక్యరాజ్య సమితితో పాటు భారత సైన్యంలోని త్రివిధ దళాలు సహాయం చేస్తుంటాయి.సైనికుల ప్రాణాలు పోయినా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రతీ ఒక్కరినీ సురక్షిత తీరాలకు చేర్చడం మన సైన్యం బాధ్యతగా తీసుకుంటుంది.
72 గంటల్లో 534 మంది రెస్క్యూ
ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ దళాలకు, రెబెల్స్ కు మధ్య ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుగుతున్నాయి. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా యుద్ధం ఆగే అవకాశం కనిపించడం లేదు. దానితో తమ పౌరులంతా జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అక్కడ నుంచి పౌరులను తరలించే బాధ్యతను భారత సైన్యానికి అప్పగించింది. విదేశీ పౌరులను తరలించే దిశగా ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు మూడు రోజుల కాల్పుల విరమణకు వైరి వర్గాలు అంగీకరించడంతో కొంత ఉపశమనం లభించింది. ఐఎన్ఎస్ సుమేథా యుద్ధ నౌకతో పాటు ఒక యుద్ధ విమానంలో 534 మంది భారతీయులను తరలించారు. పోర్టు సుడాన్ నుంచి తొలుత గల్ఫ్ లోని జెడ్డాకు వారిని తరలించి తర్వాత ఇండియా తీసుకువస్తున్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ జెడ్డాలో మకాం వేసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా, జనాన్ని తరలించేందుకు ఎదురవుతున్న అవరోధాలను ఇండియన్ ఆర్మీ అధికమిస్తోంది. ఆపరేషన్ కావేరీ పేరుతో జనాన్ని తరలించే ప్రక్రియను వీలైనంత త్వరలో ముగించి అందరినీ సురక్షితంగా దేశానికి తరలిస్తామని భారత సైన్యం ప్రకటించింది.
రెబ్లస్ దాడుల కారణంగా రోడ్లు, విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. ఎటు నుంచి రెబెల్స్ కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితి ఉంది. కాల్పుల నడుమ భారత సైన్యం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును సంప్రదించడం మన పౌరులకు ఇబ్బందిగా మారింది. వచ్చిన వారికి భోజనమూ, ఔషధాలు, తరలించే లోపు నివాస వసతికి నానా తంటాలు తప్పడం లేదు. అయినా రెబెల్స్ కాల్పులను లెక్కచేయకుండా ప్రాణాలకు భారత సైన్యం ముందుకు సాగుతూ తమ పౌరులకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఉక్రెయిన్ లో ఆపరేషన్ గంగా…
ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత భారత దేశం అప్రమత్తమైంది. అక్కడ ఉద్యోగాల నిమిత్తమూ, వైద్య విద్యను అభ్యశించేందుకు వెళ్లిన పౌరులను కాపాడే బాధ్యత మన విదేశాంగ శాఖ ద్వారా 2022 ఫిబ్రవరిలో సైనికులను అప్పగించింది. జనాన్ని తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగాను అమలు చేసిన భారత సైన్యం ఉక్రెయిన్ మాత్రమే కాకుండా అక్కడ నుంచి వెళ్లి రుమేనియా, హంగేరీ, పోలాండ్, మాల్డోవా, స్లోవేకియాలో తలదాచుకున్న వారిని కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది దాదాపు 20 వేల మందిని అక్కడ నుంచి తీసుకురాగా, అందులో 18 వేల మంది విద్యార్థులే ఉన్నారు. బంకర్లను దాటి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రదేశాల నుంచి సైతం జనాన్ని పొరుగుదేశాలకు రప్పించి వారిని స్వదేశానికి తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగా విజయవంతమైందని విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారంటే మన దళాలు ఎంత రిస్క్ తీసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు..
ఇండియన్ ఆర్మీ వరుస ప్రయత్నాలు
విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ ప్రతీ ఏడాది ఏదోక ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉంది. కొవిడ్ – 19 టైమ్ లో వేర్వేరు దేశాల్లో ఉన్న 60 వేల మందిని తరలించేందుకు వందే భారత్ మిషన్ నిర్వహించింది. దాదాపు అదే టైమ్ లో సముద్ర సేథు పేరుతో మరో నాలుగు వేల మందిని భారత తీరాలకు చేర్చింది. భారతీయ నౌకలు జలాశ్వా, ఐరావత్, శార్దూల్, మగర్ లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి జనాన్ని తీసుకువచ్చాయి. ఈ మధ్యలో సముద్ర తుపానులు, సీ పైరెట్ల దాడులను తట్టుకోవాల్సిన వచ్చింది. బెల్జియంలో ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడున్న ఒక్క భారతీయుడి ప్రాణం పోకుండా 240 మందిని స్వదేశానికి చేర్చారు. గల్ఫ్ దేశం యెమెన్ లో అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న 5,600 మంది భారతీయుల్ని స్వదేశానికి చేర్చేందుకు ఆపరేషన్ రాహత్ నిర్వహించారు. ఈ క్రమంలో హౌతీ రెబెల్స్ జరిపిన దాడులతో కొందరు సైనికులు గాయపడ్డారు. 2015లో నేపాల్ భూకంపం ద్వారా అక్కడి భారతీయులను తరలించేందుకు ప్రభుత్వమూ, ఇండియన్ ఆర్మీ కలిసి ఆపరేషన్ మైత్రీని నిర్వహించాయి. ఐదు వేల మందిని ఇంటికి తీసుకొచ్చాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీకి చెందిన 170 మందిని సైతం ఢిల్లీ తీసుకొచ్చి వారిని స్వదేశాలకు చేర్చారు.
కనీస వసతుల్లేక…
రెస్క్యూ ఆపరేషన్లకు భారత దశాలు వెళ్లినప్పుడు వారికి అక్కడ కనీస వసతులు కూడా ఉండవు. తినడానికి తిండి దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఎటు నుంచి తూటాలు విరుచుకుపడతాయో తెలీదు. కొన్ని సందర్భాల్లో గ్రౌండ్ స్టేషన్ తో కాంటాక్ట్ తెగిపోవచ్చు. యెమెన్ లో జరిగింది కూడా అదే. అయినప్పటికీ వెరవకుండా సైన్యం ముందుకు సాగుతుంది. అదే వారి గొప్పదనం…