బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రిపబ్లిక్ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు చూసిన ఎవరికైనా స్పష్టత వస్తుంది. గతంలో జనసేన విషయంలో చంద్రబాబు వన్ సైడ్ లవ్ అనేవారు. ఇప్పుడు బీజేపీ విషయంలోనూ అదే వన్ సైడ్ లవ్ చూపిస్తున్నారని అనుకోవచ్చు. టీడీపీతో పొత్తు అవసరం ఇప్పుడు బీజేపీకి ఉందా ? చంద్రబాబు పరోక్షంగా పెట్టిన ప్రతిపాదనలను బీజేపీ పెద్దలు పరిశీలిస్తారా ?
గ్యాప్ ఫిల్ చేసుకునేందుకు సహకరించారని రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు కృతజ్ఞతలు
2014లో బీజేపీతో కలిసి గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. తర్వాత చంద్రబాబు భారతీయ జనతా పార్టీ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. జాతీయ రాజకీయాల జోలికి కూడా వెళ్లలేదు.. ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చర్చా కార్యక్రమానికి పిలిచి మాట్లాడించిన టీవీచానల్ చర్చ తర్వాత ..గ్యాప్ పిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారంటూ ఇంగ్లిష్ చానల్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే విబేధించాం.. ఇక అన్ని విషయాల్లోనూ మోదీ విధానాలను సమర్థిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా ప్రకటించారు. అంతే కాదు ఎన్డీఏలో చేరిక విషయంలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంటే బీజేపీ పిలుపు అందితే అని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.
బీజేపీకి అంత అవసరం ఏముంది ?
ఏపీలో ఇప్పుడు బీజేపీకి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా చివరికి బీజేపీకే మద్దతుగా నిలుస్తుంది. అందుకే ఏపీలో ఉండే పాతిక సీట్లూ బీజేపీవే అనే సెటైర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలని అనుకుంటోంది. అందుకే ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా కార్యచరణ ఖరారు చేసుకుంటున్నారు. ప్రజాపోరు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవాలని ఆ పార్టీ నేతలు అనుకోవడం లేదు. జనసేనతో పొత్తు ఉంది.. ఆ పార్టీ పొత్తు కొనసాగిస్తే సరే లేకపోతే ఒంటరిగా వెళ్తాం అనుకుంటున్నారు. ఎలా చూసినా… పొత్తులు లేకపోడమే బీజేపీకి ప్లస్. పొత్తులుఉంటే ఓ పార్టీ బీజేపీకి అధికారికంగా దూరమవుతుదంి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే.. రెండు పార్టీల సపోర్ట్ బీజేపీకే ఉన్నట్లుగా ఉంది.
జాతీయ స్థాయి రాజకీయాలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటుందా ?
బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తారు. కారణం ఏమైనా కానీ నమ్మకమైన మిత్రపక్షాలు ఎన్డీఏలో తగ్గిపోయారు. సౌత్ నుంచి నమ్మకమైన మిత్రులు ఆ పార్టీకి అవసరం. వైఎస్ఆర్‌సీపీ ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. నేరుగా కలవదు..ఎన్నికలైన తర్వాత మద్దతు కూడా.. ఖచ్చితంగా అవసరం అయితే అ పార్టీ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. అలాంటి వాటిని బీజేపీ ఎంటర్ టెియన్ చేయదు. అదే టీడీపీ అయితే నేరుగా ఎన్డీఏలో చేరిపోతుంది. అందుకే బీజేపీ , టీడీపీ విషయంలో కాస్త సాఫ్ట్ గా ముందుకెళ్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల అండమాన్‌లో మేయర్ పోస్టును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించి బీజేపీ. అక్కడ టీడీపీకి ఉంది రెండే రెండు సీట్లు. అయినా మేయర్ సీటు ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ట్విట్టర్‌లో టీడీపీ, బీజేపీ కూటమికి శుభాకాంక్షలు అని ప్రకటించేశారు. తెలుగు రాష్ట్రాల గురించి వారేమనుకుంటున్నారో మరి !