త్రివిక్రమ్ కు ‘పూజ’ చేయాల్సిందేనా

టాలీవుడ్ లో పూజా హెగ్డే గురించి ఏమాత్రం పరిచయం అవసరం లేదు. మూడేళ్ల క్రితం నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకెళ్లింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. అప్పట్లో ఈ అమ్మడి జోరు చూసి మిగతా హీరోయిన్స్ అందరూ భయపడ్డారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డేని చూసే అందరూ హీరోయిన్స్ నవ్వుతున్నారు. ఎందుకంటే… మూడేళ్లుగా పూజా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అలాగని పెద్ద సినిమాలు చేయడం లేదా అంటే… చేసేవన్నీ పెద్ద హీరోల సినిమాలే. కానీ కాలం కలిసిరాక ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది.
నాన్ స్టాప్ ఫ్లాపులు
అల వైకుంఠపురములో తర్వాత పూజా నటించిన రాధేశ్యామ్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ తో సినిమా అంటే మామూలుగా ఉండదుగా మరి. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిపోదామని పూజా ప్లాన్ చేసింది. కట్ చేస్తే… సినిమా డిజాస్టర్. ఆ తర్వాత అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తమిళ సూపర్ స్టార్ విజయ్ తో నటించిన బీస్ట్, రామ్ చరణ్ తో చేసిన ఆచార్య, హిందీలో నటించిన సిర్కస్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయినా కూడా పూజా పెద్దగా బాధ పడేది కాదు. కానీ ఇవన్నీ డిజాస్టర్లు అయ్యాయి. ఇక రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో నటించిన కిసి కా భాయ్-కిసి కి జాన్ సినిమా కూడా డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. దీంతో… వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది పూజా. ఇప్పుడు నిర్మాతలంతా పూజా హెగ్డే అంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే వేరే హీరోయిన్లు నటిస్తే.. సినిమా ఫ్లాప్ అవుతుందేమో కానీ పూజా కన్పిస్తే చాలు డిజాస్టర్ అయిపోతుంది అని వణికిపోతున్నారు.
త్రివిక్రముడే దేవుడు
పూజా హెగ్డేకు ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా సూపర్ స్టార్ మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఉన్న సినిమా. ఈ వరుస ఫ్లాపుల ముందు కూడా పూజా హెగ్డేని స్టార్ హీరోయిన్ చేసింది దర్శక మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. అరవింద సమేత, అల వైకుంఠపురములో రెండు సినిమాలు ఆయనవే. దీంతో.. ముచ్చటగా మూడోసారి పూజాని తీసుకున్నాడు. గతంలో తనకు స్టార్ డమ్ ఇచ్చిన త్రివిక్రముడే ఇప్పుడు తనని దేవుడిలా ఆదుకుంటాడని ఆశ పడుతుంది పూజా. ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది కూడా ఏదైనా తేడా అయితే.. ఇక పూజా బ్యాగు సర్దేసుకుని ఇంటికెళ్లిపోవడమే.