ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్ హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. హరి అంటే శ్రీ మహావిష్ణువు ద్వార్ అంటే దారి. అంటే హరిని చేరుకునే మార్గం..దేవతలు ప్రవేశించే ద్వారం అని అంటారు. ఈ ప్రదేశానికి ఉన్న మరో ప్రాముఖ్యత ఏంటంటే గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం చిందిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి. అమృత బిందువులు ఒలికిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి కాగా.. ప్రయాగ, ఉజ్జయినీ, గోదావరి నదీమతల్లి జన్మస్థలం అయిన నాసిక్. అందుకే 3 సంవత్సరాల వ్యవధికో ఒక్కొక్కొ క్షేత్రంలో కుంభమేళా జరపుతుంటారు. హరిద్వార్ పట్టణాన్ని మాయా పురి, కపిల లేదా మోక్షద్వార్, గంగా ద్వార్ అని కూడా పిలుస్తారు. గంగానది పర్వతాల నుంచి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే మొదటి ప్రాంతం హరిద్వార్. ఇక్కడ ప్రధాన ప్రదేశం హర -కి -పురి… దీనిని బ్రహ్మ కుండ్ అని అంటారు. ఇక్కడి స్నాన ఘట్టాల దగ్గర శ్రీ మహావిష్ణువు పాదముద్రలు చూపిస్తారు.
పరమ పవిత్రమైన హరిద్వార్ సందర్శనకు, గంగా నదిలో స్నానమాచరించడానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు భారీగా తరలి వస్తుంటారు. గంగాపుష్కరాలు కావడంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో మరింత వెలిగిపోతోంది. హరిద్వార్ వెళ్లే భక్తులు అక్కడ తప్పనిసరిగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి..అవేంటంటే..
మానసాదేవి ఆలయం
హరిద్వార్ లోని అతి ప్రాచీనమైన దేవాలయంగా మానసాదేవి ఆలయం (Manasa Devi Temple) ప్రసిద్ధి చెందినది. మానసా దేవికి అంకితమిస్తూ హరిద్వార్ లోని కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. మూడు ఆలయాలు శక్తిపీఠాలు కావడం విశేషం. పర్వతంపై వున్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గం లేదా రోప్‌వే వుంది. త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక అయిన శ్రీ మాతా మానసదేవిని మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్పదోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం
హర్ కి పౌరీ
విక్రమాదిత్య రాజు ఏర్పాటు చేసిన ఘాట్ తరువాతి కాలంలో హర్ కి పౌరీగా ప్రసిద్ధి చెందింది. నిత్యం సాయంత్ర సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమం కన్నుల పండువగా ఉంటుంది.
భారత్ మాత మందిర్
ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్ లో ప్రసిద్ధ ఆలయాల్లో భారత్ మాత మందిర్ ప్రముఖమైనది. గంగా నది ఒడ్డున నిర్మించిన 8 అంతస్తుల ఎత్తైన భవనంలో ప్రతి అంతస్తులో వివిధ పురాణ గాధలను తెలియజేసే పాత్రలు, దేవుళ్ల గురించి వివరించి ఉంటుంది. ఒక అంతస్తులో ఏకంగా మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.
చండీదేవి ఆలయం
గంగానదికి అవతలి తీరంలో నీల పర్వత శిఖరంపైన కొలువైన ఈ ఆలయాన్ని కాశ్మీరీ రాజు సుచత్ సింగ్ నిర్మించాడు. చండీ ఘాట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరం పైన ఉంది. రాక్షస రాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ లను ఈ ప్రదేశంలోనే చండీదేవి సంహరించినట్టు పురాణాలు చెప్తున్నాయి.
వైష్ణో దేవి ఆలయం
హరిద్వార్ లో వైష్ణవి దేవి ఆలయం (Vaishnavi Devi Temple) జమ్మూ వైష్ణవి దేవి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వివిధ సొరంగాల (Tunnels) గుండా వెళ్లాల్సి ఉంటుంది. శ్రీరాముడికి గొప్ప భక్తురాలైన వైష్ణవ మాత గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణ కథనం.
పవన్ థామ్
హరిద్వార్ లోని పరమపవిత్రమైన ప్రధాన ఆకర్షణ ప్రదేశంగా పవన్ థామ్ (Pawan Thom) ఉంది. ఇది నగరం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రిషికేష్ (Rishikesh) కు వెళ్లే మార్గంలో ఉంది. ఇక్కడ గాజు ఆలయం పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
భీమ్‌గోడా సరస్సు
పాండవులు హిమాలయాలలో ప్రయాణిస్తూ హరిద్వార్‌కి వచ్చినప్పుడు రాజకుమారుడు భీమసేనుడు దాహం తీర్చుకోవడానికి మోకాలితో రాతిపై కొట్టి, నీటిని రప్పించాడనీ.. తద్వారా ఈ సరస్సు ఏర్పడిందని పురాణ కథనం.
ఇంకా సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండం అయిన “సతీ కుండ్”, కంఖాల్ హరిహర ఆశ్రమంలోని పరాడ్ శివలింగం చూడాల్సిన ప్రదేశాలు.