మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తల్లి కాబోతున్న విషయం తెలిసినప్పటి నుంచి అటు మెగా ఫ్యామిలీ ఇటు కామినేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల సందడి ఎక్కువైపోయింది. పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆనందాన్ని ఇరు కుటుంబాలు రెగ్యులర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్నేహితులు బంధువులను ఇంటికి పిలుస్తూ స్పెషల్ పార్టీలు ఇస్తున్నారు. ఇటీవలే ఉపాసనకు ఆమె సోదరీమణులు దుబాయ్ లో సీమంతం చేశారు. రామ్ చరణ్ నానమ్మ చిరంజీవి తల్లి అంజనా దేవి ఉపాసన కోసం స్పెషల్ గా వంట చేయించింది. చెర్రీ అయితే ప్రతి అడుగూ నీ వెంటే అంటూ ఉపాసనను ఒక్కక్షణం కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
ఈ ఏడాది జూలైలో ఉపాసన బేబీకి జన్మనివ్వబోతోంది. ఇందులో భాగంగా ఉపాసనకు సీమంతం జరిపించారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఉపాసనతో కలసి దిగిన సెల్ఫీని షేర్ చేసిన అల్లు అర్జున్ ఓ పోస్ట్ పెట్టాడు. సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉస్పీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన అల్లు అర్జున్ ఉపాసనతో కలసి దిగిన ఫొటో షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా అభిమానులకు క్లారిటీ వచ్చినట్టేనా?
వాస్తవానికి గత కొంత కాలంగా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీటికి బలం చేకూర్చేలా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా కాలంగా కలుసుకోలేదు. గతంలో పార్టీల్లో తరుచు సందడి చేసేవారు కానీ ఈ మధ్య కాలంలో కలిసిన పిక్స్ కూడా బయటకు రాకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని అభిమానులు ఫిక్సైపోయారు. ఇలాంటి టైమ్ లో ఉపాసన సీమంతానికి అల్లు ఫ్యామిలీ మెంబర్స్ హాజరవడం, ఉపాసనతో బన్నీ సెల్ఫీ దిగి మరీ షేర్ చేయడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది. కలవడం కుదరొచ్చు, కుదరకపోవచ్చు కానీ మెగా ఫ్యామిలీ అంతా ఎప్పటికీ ఒక్కటే అని క్లారిటీ ఇచ్చినట్టైంది.
బన్నీ ‘పుష్’ప 2- చెర్రీ ‘గేమ్ ఛేంజర్’
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’లో నటిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు జరిగాయి. సుకుమార్ కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. దీంతో చివరి దశకు చేరిన షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. మరోవైపు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఏదేమైనా కొణిదెల-అల్లు కుటుంబాల మధ్య పెద్దగా పొసగడం లేదనే వార్తలకు బన్నీ ఒక్క పిక్ తో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అర్థం చేసుకోవాల్సింది అభిమానులే…