ఓన్లీ మహారాష్ట్ర – కర్ణాటక వైపు కేసీఆర్ ఎందుకు చూడటం లేదు ?

మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి మూడో బహిరంగసభను కేసీఆర్ పెడుతున్నారు. కానీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక వైపు మాత్రం చూడటం లేదు. బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ గతంలో ప్రకటించారు. బీఆర్ఎస్‌తో కలిసి పని చేయడానికి జేడీఎస్ సిద్ధమయింది. కానీ హఠాత్తుగా రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు అసలు కర్ణాటక వైపు చూడటం లేదు. కనీసం ప్రచారం ఆలోచన కూడా చేయడం లేదు. ఎందుకు కేసీఆర్ ఇలా ఒక్క సారిగా వెనుకడుగు వేశారన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.

కుమారస్వామిని కేసీఆర్ మోసం చేశారా ?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జేడీఎస్ అగ్రనేత కుమార స్వామి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అంటున్నారు. కొన్ని నెలల క్రితం వరకు కేసీఆర్ – కుమార స్వామి మధ్య మంచి స్నేహం నడిచింది. బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తామని కేసీఆర్ కూడా ప్రకటించారు. అయితే దీని వెనక మరో కారణం తెరపైకి వచ్చింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కుమార స్వామి వచ్చారు. కేసీఆర్-కుమార మధ్య కర్ణాటక ఎన్నికల చర్చ జరిగిన తర్వాతే అసలు గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలా ఆర్థిక సాయం చేస్తాము కానీ అభ్యర్థుల్ని తాము నిలబెట్టమన్న వారిని పెట్టాలని కేసీఆర్ అన్నట్లుగా చెబుతున్నారు. దీనికి అంగీకరించని కుమారస్వామి.. సైలెంట్ అయిపోయారని అంటున్నారు.

బీఆర్ఎస్‌ను మోయడం దండగని కుమారస్వామి భావన !

భారత రాష్ట్ర సమితి పరిస్థితి తెలంగాణలోనే అంతంతమాత్రంగా ఉందని ఇప్పుడు కర్ణాటకలో నెత్తిమీద పెట్టుకుని ఆ పార్టీ విస్తరణకు సహకరించాల్సిన అవసంర ఏముందని కుమారస్వామి కూడా భావించినట్లుగా చెబుతున్నారు. అలా చేయడం అసలుకే ఎసరు తెస్తుందని అంచనా వేశారట. ప్రస్తుతానికైతే జేడీఎస్ వల్లే బీఆర్ఎస్ కు గుర్తింపు వస్తుంది తప్ప.. కొత్తగా తమకు ఏం ఒరగదని కుమార స్వామి భావించారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నా.. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడిగి.. జేడీఎస్‌ను దెబ్బతీస్తారని కుమారస్వామి ఆందోళన చెందారని.. కేసీఆర్ రాజకీయాలపై పూర్తిగా అవగాహన వచ్చాక.. వెనక్కి తగ్గారని కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది.

ప్రకాష్ రాజ్ కూడా పట్టించుకోలేదా ?

కేసీఆర్ .. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చాలనుకున్నప్పుడు ప్రతి సమావేశంలోనూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించేవారు. ఓ సారి ప్రశాంత్ కిషోర్ తోనూ సమావేశం అయ్యారు. ప్రకాష్ రాజ్ కన్నడిగుడు కావడం అక్కడ ఆయనకు .. రాజకీయంగానూ కొంత ఇమేజ్ ఉండటంతో బీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ అక్కడ పార్టీని లీడ్ చేస్తారేమో అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్ సైలెంట్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ ను ప్రగతి భవన్ కు కూడా మరోసారి ఆహ్వానించలేదు. ఎప్పుడూ కేసీఆర్ వెట కనిపిచలేదు. ఆయన వెంట ఉంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అని అనుకున్నారేమో కానీ కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో కర్ణాటకలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థమయింది. అందుకే ఇప్పుడు మహారాష్ట్రలో చోటామోటా నేతల్ని చేర్చుకుని బహిరంగసభలు పెట్టుకుంటున్నారు కానీ…కర్ణాటక వైపు చూడటం లేదని అంటున్నారు.