బిహార్ పరిణమాల్లో బీజేపీపై అలిగిన అక్కడి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పుడు మోదీని దించెయ్యాలన్న సింగిల్ అజెండాతోనే పనిచేస్తున్నారు. విపక్షాలన్నింటినీ కలుపుకుపోతూ అధికారాన్ని మార్చాలనుకుంటున్నారు. పార్టీలు మాత్రం సరేలే అంటూనే ఆయనకు దూరంగా ఉంటున్నాయి.
ఆప్ ఒంటరిగా పోటీ
నితీశ్ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అందరం కలిసి ఒక తాటి మీదకు వద్దామని ఆయనకు సూచించారు. అప్పుడు తలూపిన కేజ్రీవాల్.. ఇప్పుడు మాత్రం నా దారి రహదారి అంటున్నారు. దేశవ్యాప్తంగా తాము ఒంటరిగా పోటీ చేస్తామని అప్పుడే రాజకీయ మార్పు సాధ్యమని ఆప్ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ప్రధాని అభ్యర్థి విషయంలోనూ పట్టువిడుపులకు ఆప్ సిద్ధంగా లేరు. సరైన సమయంలో జనమే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారని ఆప్ నేతలు ప్రకటించారు. కేజ్రీవాల్ కు ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఉన్నట్లుగా పరోక్షంగా ఆప్ ప్రకటించినట్లయ్యింది.
నితీశ్ వరుస భేటీలు
నితీశ్ కుమార్ పాలనను గాలికి వదిలేసి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇవాళ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోనూ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ విడివిడిగా భేటీ అవుతారు. విపక్షాల ఐక్యత అనివార్యమని వివరిస్తారు బహుశా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ కూడా నితీశ్ వెంట వెళ్లే అవకాశం ఉంది.సాధ్యమైనంత వరకు వేరు వ్యక్తుల ప్రమేయం లేకుండా ముఖాముఖి భేటీకి నితీశ్ ప్రాధాన్యత ఇస్తున్నారు.దీని వల్ల గోప్యతను పాటించే అవకాశం ఉందని భావిస్తున్నారు..
కాంగ్రెస్ నేతలతో భేటీ అసంపూర్ణం
బిహార్ సీఎం ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో విడివిడిగా సమావేశమయ్యారు.సార్వత్రిక ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని నితీశ్ చెప్పుకున్నారు. పైగా తేజస్వీని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే తొందరేమిటన్నట్లుగా కాంగ్రెస్ నేతల రెస్పాన్స్ ఉందని చెబుతున్నారు. అందరూ కలిసొచ్చినప్పుడే మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒక తాటిపై నిలబెట్టడం అంత సులభం కాదని నితీశ్ కు నిదానంగా అర్థమవుతోందనుకోవాలా…
బలం లేకపోయినా అందరికీ ఒకే అజెండా..
కాంగ్రెస్ మినహా నితీశ్ మాట్లాడుతున్న వారంతా ప్రాంతీయ నేతలు. కనీసం 30 లోక్ సభా స్థానాలు గెలవలేని నాయకులు. అయినా ప్రతీ ఒక్కరికీ ప్రధాని కావాలన్న కోరిక ఉంది. వాళ్లకి జాతీయ అజెండా లేదు, సంక్షేమంపై దృష్టి లేదు. ఒకటి రెండు జనాకర్షణ పథకాలతో పబ్బం గడుపుకుని పెద్ద పోస్టుకే గాలం వేయాలన్న కోరిక వాళ్లది. అందుకే నితీశ్ తన ప్రయత్నాలు కొనసాగుతుండగానే మమతా బెనర్జీ కూడా టూర్లు మొదలు పెట్టారు. గత వారం ఆమె అఖిలేష్ తోనూ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోనూ సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యతపై చర్చించారు. మమత ప్రతిపాదనను పట్నాయక్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయనదీ సొంత అజెండా. నేకు నా రాష్ట్రం చాలు, దేశ రాజకీయాలతో నాకేంటి సంబంధం అన్నట్లుగా ఉంటుందీ ఆయన తీరు. పైగా కేంద్రంలోని బీజేపీతో ఆయనకు పెద్దగా పేచీలేమీ లేవు.