తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాం అని మల్లిఖార్జున ఖర్గే ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నేరుగా ప్రకటించేశారు. కానీ అదే సమయంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ పై పోరాటంలో జీవితాల్ని పణంగా పెడుతున్నామని … గద్దె దించుతామని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టుకున్నారు. కానీ మల్లిఖార్జన ఖర్గే చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి చేసిన ఈ కంటతడి సీన్ తుస్సుమనిపోయిందన్న సెటైర్లు పడుతున్నాయి.
కంటితండితో సెటిమెంట్ పండించిన రేవంత్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నంచి కాంగ్రెస్ కు పాతిక కోట్ల రూపాయలు అందాయని ఈటల రాజేందర్ ప్రకటించారు. దీన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై తాను ఎంత తీవ్రంగా పోరాడుతున్నాననో చెప్పుకున్నారు. తాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో చెప్పారు.కేసీఆర్ ను ఓడించడానికి జీవితాల్నే పణంగా పెట్టామని బలంగా చెప్పారు. ఓ దశలో ఆవేదనతో కంట తడి పెట్టారు. కేసీఆర్‌పై పోరాటంలో రేవంత్ రెడ్డిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. రేవంత్ కు తెలంగాణలో ఎవరు ధీటైన నేత అంటే అత్యధిక మంది రేవంత్ రెడ్డి పేరే చెబుతారు. కానీ బీజేపీకి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఆ పార్టీ కూడా పోటీకి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. అయినా రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో తనను కించపరుస్తున్నా.. పార్టీ గెలుపు కోసం ఆయన శ్రమిస్తున్నట్లుగా ఎవరూ కష్టపడటం లేదు. ఇవన్నీ ప్రజల ముందు ఉంచి.. కంటతడి పెట్టారు రేవంత్ రెడ్డి .
బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒకటేనని జరుగుతున్న ప్రచారంతో రేవంత్‌కు ఇబ్బందులు !
దేశ రాజకీయాల్లో ఇటీవల వస్తున్న మార్పుల ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఐక్యతా సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా .. బీఆర్ెస్ పార్టీతో కలిసి వెళ్లడం గురించి ఆలోచిస్తోందని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది బీఆర్ఎస్ తో పొత్తు అవసరం అని వాదిస్తున్నారు. బీజేపీ గెలుపును అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలవాలని అంటున్నారు. అందుకే ఆ రెండు పార్టీలు కలుస్తాయన్న ప్రచారం ఊపందుకుంటూడటంతో రేవంత్ రెడ్డికి ఉక్కపోత మొదలైంది. అందుకే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్ని అడ్డం పెట్టుకుని ఆయన కేసీఆర్ పై పోరాటంలో తాము ఎంత తెగిస్తున్నామో చెప్పుకునేందుకు ప్రయత్నించారంటున్నారు.
రేవంత్ కింకర్తవ్యం ?
బీఆర్ఎస్తో కలిసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుకూలంగా ఉందని ఖర్గే తేల్చడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటని కాంగ్రెస్‌లోనే విస్తృత చర్చ జరుగుతోంది. కేసీఆర్ తో పొత్తు అనే మాటలను రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. ఆయన పోరాటం కేసీఆర్ తో ముడిపడి ఉంది. ఇటీవల తమ హైకమాండ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతోందని తెలిసి… తాను పీసీసీ చీఫ్ గా ఉండగా పొత్తులు పెట్టుకునే అవకాశమే లేదని ప్రకటించారు. ఓ రకంగాఇది హైకమాండ్ ను బెదిరించడమే అంటున్నారు. అ బెదిరింపుల్ని హైకమాండ్ ఖాతరు చేయడం లేదని మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలతో తేలిపోయింది. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు ?