స్టాలిన్ ను ప్రాసిక్యూట్ చేస్తారా..

తమిళనాట అధికార, విపక్షాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ పార్టీ బీజేపీకి, ప్రాంతీయ శక్తి డీఎంకేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.అన్నాడీఎంకే ప్రతిపక్షమైనా ప్రధాన ప్రతిపక్షస్థాయిలో బీజేపీ అన్ని వైపుల నుంచి డీఎంకే ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది. రోజువారి ఉద్యమాలు నిర్వహిస్తో స్టాలిన్ సర్కారును ఇరకాటంలో పెడుతోంది..

సంచలనమైన డీఎంకే ఫైల్స్

బీజేపీ రాష్ట్ర శాఖాధ్యక్షుడైన అన్నామలై రాజకీయాల్లో దూకుడును ప్రదర్శిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వ అవినీతిని ఎండగట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు విడతలుగా డీఎంకే ఫైల్స్ పేరుతో అవినీతి ఆరోపణలు సంధించారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి, అల్లుడు సబరేశన్ అవినీతి చిట్టాను బీజేపీ బట్టబయలు చేసింది. డీఎంకే నేతలంతా కలిసి 50 వేల కోట్ల మేర దోచుకున్నారని అన్నామలై ఆరోపించారు.

ఆర్థిక మంత్రి ఆడియో

స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక మంత్రి పళణివేల్ త్యాగరాజన్ మాట్లాడినట్లుగా ఆడియో ఒకటి ఇప్పుడు తమిళనాట హల్ చల్ చేస్తోంది. ఉదయనిధి, సబరేశన్ కలిసి అవినీతి సొమ్ము కూడబెట్టారని ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఆరోపిస్తున్నట్లుగా ఆడియో అందులో ఉంది. దానితో త్యాగరాజన్ ఖంగు తిన్నారు. అదీ ఫేక్ ఆడియో అంటూ ఆరోపణలు సంధించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అలాంటి ఆడియో ఎవరైనా తయారు చేసే వీలుందని త్యాగరాజన్ అంటున్నారు..ఈ ఆడియోను బీజేపీ నేత అన్నామలై స్వయంగా ట్విటర్ లో అప్ లోడ్ చేశారని ఆయన ప్రస్తావించారు.

అన్నామలై స్ట్రాంగ్ కౌంటర్..

పళణివేల్ త్యాగరాజన్ వాదనను అన్నామలై తోసి పుచ్చారు. తన సచ్చితలను నిరూపించుకునేందుకు త్యాగరాజన్ స్వయంగా మాట్లాడిన ఆలాంటి ఆడియో ఒకటి విడుదల చేయాలన్నారు. అప్పుడు రెండు ఆడియాలను ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ ఆడిట్ కు పంపితే నిజానిజాలు తెలుస్తాయన్నారు. ముందు మాట్లాడేసి, ఆడియో బయట పడటంతో త్యాగరాజన్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై అంటున్నారు. బీజేపీ బృందం త్వరలో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవితో భేటీ కానుంది. ఆడియో వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తాము విడుదల చేసిన డీఎంకే ఫైల్స్ ఒక కాపీని ఆయనకు సమర్పించబోతోంది..

ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరతారా.. ?

1995లో ఒకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పట్లో ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. పురచ్చి తలవై అవినీతి ఇంటింటా చర్చనీయాంశమైంది. అప్పుడు జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామి రంగంలోకి దిగారు. జయ అవినీతి, అరాచకాలకు సంబంధించిన ఫైల్స్ ను గవర్నర్ చెన్నారెడ్డికి సమర్పించారు. అంతకముందే డీఎంకే, కాంగ్రెస్ కూడా అలాంటి ఆరోపణలో చేశాయి. పైగా జయలలిత క్రిమినల్ మిస్ కండెక్ట్ పై పత్రికలు కోడై కూస్తున్నాయి. దానితో సుబ్రమణిస్వామి సమర్పించిన ఫైల్స్ ను పరిశీలించిన చెన్నారెడ్డి ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు 1995 ఏప్రిల్ 30న అనుమతించారు. తర్వాత ఏడాది లోపే జరిగిన ఎన్నికల్లో జయలలిత ఓడిపోయారు. తర్వాతి కాలంలో ఆమె జైలుకు వెళ్లడానికి నాటి చెన్నారెడ్డి నిర్ణయమే కారణమైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే నాడు సుబ్రమణియన్ స్వామి చూపిన దూకుడునే నేడు అన్నామలై ప్రదర్శిస్తున్నారు. అప్పుడు జయలలితను ప్రాసిక్యూట్ చేసేందుకు చెన్నారెడ్డి ఒప్పుకున్నారు.. ప్రస్తుత గవర్నర్ రవి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి..