బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీ గెలవలేదా ?

టీడీపీతో కలవకుండా జనసేనను బెదిరిస్తున్నారంటూ.. బీజేపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వైసీపీ, బీజేపీ ఒక్కటేననే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అసలు బీజేపీ ఈ పొత్తు రాజకీయాలను ఎప్పుడో దూరం పెట్టింది. జనసేన కలసి వచ్చినా రాకున్నా సొంతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఏపీలో అధికారంలోకి రావాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి అనుకుంటున్న టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు అవి ఫలించడం లేదని నిస్పృహ కనిపిస్తుందేమో కానీ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.

పొత్తుల కోసం టీడీపీ ఆరాటం ఎందుకు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత కాలంగా పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. కానీ తెలుగుదేశంపార్టీకి దగ్గరవుతున్నారు. అయితే బీజేపీని మాత్రం వదలుకోలేకపోతున్నారు. పవన్ చంద్రబాబుతో నేరుగానే చర్చలు జరిపారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్ల దాడిని పవన్ వెంటనే ఖండించారు. అందుకే టీడీపీతో కలవాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ ను బీజేపీ అడ్డుకుంటోందని పితాని సత్యానారాయణ ఆరోపించారు. అదే సమయంలో అచ్చెన్నాయుడు వైసీపీ బీజేపీకి దగ్గర అని ప్రజల అభిప్రాయమని ఆరోపించారు.

కేంద్ర , రాష్ట్ర సంబంధాల ప్రకారమే సహకారం.. అది రాష్ట్ర బీజేపీ చేతుల్లో లేని అంశం.

బీజేపీ .. వైసీపీతో కలిసి ఉందని ప్రజలు నమ్ముతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్నారు. వైసీపీతో కలిసి లేమని ప్రజలు నమ్మేలా ఎలా చేయాలో కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. అడ్డగోలు అప్పులకు అనుమతిని నిరాకరించాలని ఆయన అంటున్నారు. అయితే అది రాష్ట్ర నాయకుల చేతుల్లో లేని అంశం. కేంద్ర , రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. అది రాజ్యాంగ పరమైనది. అంతే కానీ.. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి.. వైసీపీ ప్రభుత్వానికి సహకారాన్ని నిలిపివేస్తే నష్టపోయేది రాష్ట్రమే. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉంది. అప్పులు నిలిపివేస్తే ఆర్థికంగా దివాలా తీస్తుంది. దీని వల్ల నష్టపోయేది రాష్ట్రమే.

వైఎస్ఆర్‌సీపీకి సహకారం ఆపేయాలనేదే టీడీపీ పెడుతున్న డిమాండ్ ?

రాష్ట్రంలో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా అప్పుల విషయంలో కేంద్రం జగన్ కు సహకరిస్తోందని విమర్శించారు. బీజేపీ, జగన్ మధ్య సంబంధాలు లేవని నేతలు చెప్పటం కాదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్ఆర్‌సీపీకి సహకరించడం ఆపేయాలన్న డిమాండ్ కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. ప్రభుత్వానికి అనధికారికంగా అప్పులు ఇవ్వడాన్ని నిలిపివేయడంతో పాటు జగన్ కేసుల విషయంలో వేగం ఉండాలని కోరుకుంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.

టీడీపీ ఎన్ని మైండ్ గేమ్ లు ఆడినా జనసేనతో కలిసి మాత్రమే పోటీకి బీజేపీ మొగ్గు

టీడీపీ నేతలు మైండ్ గేమ్ప్ ప్రారంభించారని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికే పొత్తుల వల్ల నష్టపోయామని వీలైనంతఎక్కువగా బలం పెంచుకోవడానికి ప్రయత్నంచాలని భావిస్తున్నారు,.జనసేన పార్టీ తో మాత్రమే కలిసి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే టీడీపీ నేతల మైండ్ గేమ్‌ను బీజేపీ నేతలు లైట్ తీసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.