రంజాన్ వేడుకలు వద్దన్న జమ్మూ ముస్లింలు..

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను కేంద్రం పూర్తి స్థాయిలో కట్టడి చేసి అణిచివేస్తున్నా ఒకటి రెండు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి పాక్ ప్రేరేపిత ముష్కర మూకల దుశ్చర్యలకు దర్పణం పట్టింది. వర్షం కురుస్తున్నప్పుడు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాన్లు సజీవ దహనమయ్యారు.

భద్రతా దళాల అదుపులో 12 మంది…

ఉగ్రదాడి తర్వాత మిలటరీ ఆపరేషన్స్ వేగం పుంజుకున్నాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో హెలికాప్టర్లు, డ్రోన్లు, జాగితాలతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడి జరిపిన ఉగ్రవాద సంస్థను ఖచితంగా గుర్తించేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి..

జమ్మూపై ఉగ్ర కుట్ర

ఇంతవరకు కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువ ఉగ్రదాడులు జరిగేవి. జమ్మూ కొంత మేర సురక్షిత ప్రాంతమన్న విశ్వాసం ఉండేది. ఆ అవకాశం లేకుండా జమ్మూలో ప్రజలను కూడా భయభ్రాంతులను చేయాలని ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడి లష్కరే తయ్యబా పనేనని భావిస్తుండగా, నాలుగైదు ఉగ్ర సంస్థల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పూంచ్, రజౌరీ సెక్టార్ లో చాలా ఉగ్రవాదం సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని భద్రతా దళాలు గుర్తించాయి. జమ్మూకశ్మీర్ ఘజ్నవీ ఫోర్స్ (జేకేజీఎఫ్) అక్కడ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. దాని కమాండర్ రఫీక్ అహ్మద్ అలియాస్ నయీ.. స్థానికుడు కావడంతో ఆ ప్రాంతమంగా అతనికి తెలుసు. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) కూడా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అది జైషే మొహ్మద్ కు అనుబంధ సంస్థగా ఉంది. ఉగ్రవాదుల కదలికలను అర్థం చేసుకునేందుకు భద్రతా దళాలు రెక్కి నిర్వహిస్తున్నాయి..

ఇప్పుడే అటు రావద్దు..

పూంచ్ ప్రాంతంలో ఆర్మీ కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. కొత్త వారు ఎవరూ ఇప్పుడే అటుగా రావద్దని సూచిస్తోంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ట్రక్కులు, లారీలు రాకూడదని చెప్పింది. ఎన్ కౌంటర్లు జరిగిన పక్షంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ప్రకటించింది. రెండు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిషేధాన్ని ఎత్తివేస్తామని ఆర్మీ చెబుతోంది..

పండుగ జరుపుకోవడం లేదన్న గ్రామస్థులు

జమ్మూ కశ్మీర్లో ఆర్మీ సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఉగ్రవాద దాడికి తగులబడి పోయిన ట్రక్కులో పండ్లు, స్వీట్స్, రంజాన్ తోఫాలు ఉన్నాయి. సగియోటే అనే గ్రామంలో సాయంత్రం ప్రార్థనల తర్వాత ఈఫ్తార్ విందు ఇవ్వాలని ఆర్మీ భావించింది. స్థానిక ప్రజలు శాంతి స్థాపనలో ఆర్మీకి సహకరిస్తున్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు చనిపోవడంతో సగియోటే గ్రామ ప్రజల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమకు సాయం చేసేందుకు వస్తున్న ఆర్మీ జవాన్లను చంపేశారని కన్నీరు పెట్టుకున్నారు. అందుకే సంతాప సూచకంగా ఇవాళ రంజాన్ వేడుకలను జరుపుకోవడం లేదని గ్రామ సర్పంచ్ ముక్తియాజ్ ఖాన్ ప్రకటించారు. ఆర్మీ పట్ల తమకు ఎప్పుడూ విశ్వాసమూ, గౌరవమూ ఉంటుందని ముక్తియాజ్ ఖాన్ అంటున్నారు.