24న గుంటూరులో ఏపీ బీజేపీ కార్యకవర్గ సమావేశం – కీలక నిర్ణయాలు ?

వచ్చే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ బీజేపీ సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల24న గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం హాజరుకాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ కోర్ కమిటి సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశానికి గుంటూరును వేదికగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ అంశాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ, జిల్లాల వారీగా కమిటిల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బీజేపీలో చేరనున్న కీలక పారిశ్రామిక వేత్త

భారతీయ జనతా పార్టీలోకి కీలక నేతలు, పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని ప్రచారం నడుస్తోంది. తాజాగా గుంటూరుకు చెందిన తులసి సీడ్స్ అధినేత, పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ వి మురళీధరన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. గుంటూరుకు చెందిన తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం పోటీ చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో పార్టీ విధానంపై క్లారిటీ

ఈ సమావేశానికి జాతీయ నాయకత్వం నుంచి నేతలు కూడా హజరయ్యే అవకాశం ఉంది. గుంటూరు కేంద్రంగా రాజకీయ వ్యూహాలు, పార్టీ విస్తరణ, జిల్లాలో నూతన నాయకులను పార్టీలోకి చేర్చుకునే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేయాలన్నదానపై పక్కా వ్యూహాన్ని ఖరారు చేస్తారని చెబుతున్నారు. గతంలో విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు మంచి విజయం సాధించారు. అలాంటి మీటింగ్‌లు మరోసారి నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. వాటిని ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

సొంతంగా బలోపేతం అయ్యే అవకాశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఏపీ బీజేపీ

జనసేనతో పొత్తులో ఉన్నా.. పార్టీ బలోపేతం విషయంలో పూర్తి స్థాయిలో కలసి కట్టుగా పని చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. రెండు ప్రాంతీయ పార్టీల రాజకీయాలతో రాష్ట్రం నలిగిపోతుందని.. కేంద్రం అందిస్తున్న పథకాలు.. ఆర్థికసాయం.. కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీకి ఆదరణ పెంచుకోవాలని అనుకుంటున్నారు.