Ganga Pushkaram 2023: పుష్కర శోభతో కళకళలాడుతున్న గంగమ్మ, ఇంతకీ పుష్కరాలు ఎందుకు జరుగుతాయి!

గంగానది పుష్కరాలు 2023 ఏప్రిల్ 22న ప్రారంభమై మే 3న ముగుస్తాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగమ్మకు పుష్కర శోభ వచ్చింది.

పుష్కరం అంటే 12 సంవత్సరాలు..పన్నెండేళ్లకోసారి నదలకు వచ్చే పెద్ద పండుగ పుష్కరాలు. ఈ ఏడాది పుష్కరశోభ గంగానదికి వచ్చింది . పన్నెండు రోజుల పాటూ గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలు పుష్కరశోభతో కళకళలాడతాయి.

పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి
పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పడు పుష్కరుడు స్పందించి తన స్వార్థం కోసం ఏమీ కోరుకోకుండా…జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి నదులు పునీతమైతే దేశం సుభిక్షంగా ఉంటుంది అందుకే..నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు అని ప్రార్థించాడు. అప్పుడు సంతోషించిన శివుడు నువ్వు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్య తీర్థమవుతుంది…ఆ సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరించినవారు పాపవిముక్తులవుతారని వరమిచ్చాడు..ఇది తెలుసుకున్న దేవగురువు బృహస్పతి ..ఆ అదృష్టాన్ని తనకు కూడా కల్పించమని బ్రహ్మను అడిగాడు. కానీ పుష్కరుడు అంగీకరించకపోవడంతో తనను ఒప్పించిన బ్రహ్మ.. ఇద్దరికీ(పుష్కరుడు-బృహస్పతి)కి సమాన ప్రాతినిథ్యం కల్పించాడు. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.

బృహస్పతి మేషరాశి ప్రవేశంతో గంగా పుష్కరాలు
బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగానదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ 12 రోజులు దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి.

‘గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు’

నిత్యం స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకాన్ని చాలామంది పఠిస్తారు. ఆయా నదుల్లో స్నానమాచరించిన ఫలితాన్ని ప్రసాదించమని దీని అర్థం. ఈ ఒక్క శ్లోకంతో అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం. ఈ శ్లోకంలో ముందుగా స్మరించేది గంగమ్మనే. గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్నవారు…సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు తాము గంగానదికి ఏ దిక్కున నివసిస్తున్నామో పరమాత్మకు చెప్పుకోవాలి..లేదంటే ఆ మొర దేవుడికి చేరని నమ్ముతారు.

సకలపాపాలు హరించే గంగమ్మ
వాస్తవానికి భారతీయుల జీవితం గంగతోనే ముడిపడిఉన్నాయి. తొమ్మి నెలల తర్వాత అమ్మ కడుపులోంచి బిడ్డ భూమ్మీద పడగానే ఓ చుక్క గంగాతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ ఆచారం. బిడ్డకు చేయించే తొలిస్నానం కూడా గంగా జలంతో చేయించాలనే సెంటిమెంట్ ఉంది. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న విశ్వాసం. జీవిత చరమాంకంలో, మృత్యుఘడియ దగ్గరపడుతున్నప్పుడు.. ఆరోగ్యం సహకరించకపోయినా ఓసారి కాశీ వెళ్లి గంగలో మునగాలని, తొమ్మిది రోజులు అక్కడే ఉండాలని ఆశపడతారు. ఆ భాగ్యం కల్పించాలని కాశీవిశ్వనాథుడిని వేడుకుంటారు.

ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యం కూడా
గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన వెుక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానది నీటికి ఔషధ గుణాలున్నాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. అందుకే గంగాతీర్థం ఒక్క చుక్క గొంతులో పడినా అస్వస్థత నుంచి ఉపశమనం లభిస్తుందంటారు. అంత మహత్తు గంగానదికి ఉంది.