పూంచ్ ఉగ్రవాద దాడి పాకిస్తాన్ దుర్నీతికి, పేరాశకు సాక్ష్యంగా నిలిచింది. తనది కాని కశ్మీరాన్ని దొడ్డిదారిన స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నమూ మరోసారి బయట పడింది. ఎన్ని పర్యాయాలు పొరుగున ఉన్న అరాచక రాజ్యానికి బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదు.
ఐదుగురు జవాన్ల సజీవ దహనం
పూల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడికి దేశ రక్షణలో ఉన్న ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భీమ్బర్ గలీలో వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తర్వాత గ్రనైడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుని అగ్నికి ఆహుతైంది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాల్గొనాల్సిన ఆర్మీ అధికారులు చనిపోయారని రక్షణ శాఖ ప్రకటించింది. వర్షం కురుస్తున్న సమయంలో ఉగ్రవాదులు మాటు వేసి దొంగ దెబ్బ తీశారు. వాహనంలో ఉన్న జవాన్లు తేరుకునే లోపే దాడి చేసి పారిపోయారు. దానితో తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
లష్కరే తయ్యబా పనే…
తాజా ఉగ్రవాద దాడి లష్కరే తయ్యబా పనేనని ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా పూంచ్ సరిహద్దుల్లోని అడవుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాటు వేసి ఉన్నారు. ఇటీవల ఒక పోలీసు అధికారిపై కూడా కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆర్మీ వాహనంపై దాడి చేసి వెళ్లిపోయారు.
ఉన్నత స్థాయి సమావేశం
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే స్వయంగా వెళ్లి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సంఘటన వివరాలు అందించారు. అన్ని పార్టీల నేతలు ఉగ్రవాద దాడిని ఖండించారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా నేతృత్వంలో తక్షణమే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా సమావేశానికి వచ్చారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను, ఐఎస్ఐను ఎలా కట్టడి చేయాలో కూడా సమావేశంలో చర్చింది.
సర్జికల్ స్ట్రైక్స్ ఖాయమా..
ఉరి ఉగ్రదాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే మరో భారీ ఆపరేషన్ నిర్వహించాల్సిన తరుణం వచ్చిందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి 2016 సెప్టెంబరు 18న ఉరి పట్టణానికి సమీపంలో సైనిక స్థావరంపై నలుగురు సాయుధ మిలిటెంట్లు దాడి చేశారు. 19 మంది సైనికులను అత్యంత నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అంతకముందు గురుదాస్ పూర్, పఠాన్‌కోట్‌లో కూడా అలాంటి దాడులే జరిగాయి. దానితో ఇక ఉపేక్షించేది లేదని భావించిన ప్రధాని మోదీ.. సర్జికల్ దాడులకు ఆదేశించారు. 2016 సెప్టెంబరు 29న భారత సైనికులు ఆక్రమిత కశ్మీర్లో ప్రవేశించి ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై దాడులు చేశారు. 35 నుంచి 70 మంది వరకు ఉగ్రవాదులు, పాక్ సైనికులు చనిపోయారు.ఇప్పుడు కూడా అదే తరహాలో దాడులు చేస్తేనే పాకిస్థాన్ దారికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు..
చర్చలు అంటూనే దాడులు
ఇటీవలి కాలంలో పాకిస్థాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వచ్చే నెల గోవాలో జరిగే షాఫై కో-ఆపరేషన్ సమావేశానికి వస్తారని ఇటీవలే ప్రకటించారు. మే నెలలోనే జీ-20 వర్కింగ్ గ్రూపు సమావేశానికి కూడా పాక్ ప్రతినిధులు తరలి వస్తారని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించారు. భారత్ – పాక్ చర్చలు ఇష్టం లేని ఐఎస్ఐ పెద్దలే ఉగ్రవాద దాడులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఐఎస్ఐకు, దాని ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పడమే సరైన మార్గమనుకోవాలి…