కేసీఆర్ మౌనవ్రతం – మాటలు, చేతలు ప్రగతి భవన్ దాటట్లేదేంటి ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, చేతలు అయితే ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ అన్నట్లుగానే ఉన్నాయి. అంతకు మించి బయటకు రావడంలేదు. మోదీపై యుద్ధమే.. కాచుకో బీజేపీ అంటూ డైలాగులు చెప్పి చాలా కాలం అయింది. కానీ ఆయన మాత్రం ఇంకా తెర ముందుకు రావడం లేదు. టీఆర్ఎస్ పేరును మార్చిన బీఆర్ఎస్ గా పిలుస్తూ జాతీయ పార్టీ అని చెప్పుకున్నా… కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటడం లేదు . కొన్నాళ్లుగా ఆయన పూర్తి సైలెంట్ గా మారిపోయారు. బీజేపీని, మోదీని పల్లెత్తు మాట అనడం లేదు.

మోదీని విమర్శించడానికి కేసీఆర్ వెనుకడుగు

కొద్ది రోజుల కిందట మహారాష్ట్ర నుంచి కొంత మంది చోటామోటా నాయకులు తెలంగాణ భవన్ కు వచ్చారు. వారికి కండువాలు కప్పిన కేసీఆర్ మాట్లాడారు. మోదీ టాపిక్ వచ్చే సరికి కెమెరాలు ఆపివేయించేశారు. తర్వాత మోదీని విమర్శింంచారో లేదో ఎవరికీ తెలియదు. ఇటీవల ఏదైనా సందర్భంలో మాట్లాడితే.. కాంగ్రెస్, బీజేపీ కలిసి డెబ్భై ఏళ్లు పరిపాలించాయని వాళ్లకు చేతకాలేదని అంటున్నారు కానీ.. మోదీని ప్రత్యేకంగా విమర్శించడం లేదు. అంబేద్కర్ విగ్రహావిష్కరణలోనూ అదే తంతు. తాము వస్తాం.. దళిత బంధు ఇస్తామన్నారు కానీ.. కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయలేదు.

ప్రగతి భవన్ దాటని కేసీఆర్ ప్రకటించిన వార్ !

కేసీఆర్ మోదీపై ప్రకటించిన యుద్ధం ప్రారంభం కాలేదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప… మరే విధంంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపింంచడం లేదు. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు . ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం గుప్పుమంది. ఓ వైపు తనను బీజేపీ రౌండప్ చేస్తోందని అర్థమవుతూనే ఉంది. అయినప్పటికీ కేసీఆర్ స్ట్రాటజిక్ సైలెన్స్ పాటిస్తూనే ఉన్నారు.

బీజేపీకి ఇబ్బంది అని కర్ణాటక వైపు చూడటం లేదా ?

బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు కర్ణాటకలో నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు అయినా ఇంకా ప్రకటించలేదు. కుమారస్వామి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంపై ఆసక్తి గా లేరేమో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో లోకల్ ఎన్నికల్లో దున్నేస్తామని అక్కడ బహిరంగసభలు పెట్టి చెబుతున్నారు.

మోదీకి వ్యతిరేకంగా విపక్షాలతో కలవడం లేదా ? కలుపుకోవడం లేదా ?

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఇతర పార్టీలు రెడీ అవుతున్నాయి. వారందర్నీ కలిపపడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. త్వరలో కేసీఆర్ నుకలుస్తానని నితీష్ ప్రకటించారు. కలవాలనుకుంటే ఒక్క రోజులో కలవొచ్చు. కానీ కేసీఆర్ ఆసక్తిగా లేరని చెబుతున్నారు. అఖిలేష్ , మమతా బెనర్జీ కూడా కేసీఆర్ ను కలుస్తామన్నారు. అలాంటి పరిణాలేమీ జరుగుతాయన్న సూచనలు కనిపించడం లేదు. దీంతో కేసీఆర్ రాజీ పడిపోయారన్న ప్రచారం జరుగుతోంది