యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతిని అమలు జరిపే దిశగా కేంద్రంలోని ఎన్డీయేకు నాయకత్వం వహించే బీజేపీ ముందుకు కదులుతోంది. మరో ఏడాదిలో లోపే లోక్ సభ ఎన్నికలున్న నేపథ్యంలో పౌర స్మృతిపై కేంద్రం దృష్టి సారింది. బీజేపీ విస్తృత అజెండాలో భాగమైన యూసీసీ బిల్లును పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని తీర్మానించారు. జూలైలో జరిగే పార్లమెంటు సమావేశాల నాటికి బిల్లు ముసాయిదాను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో అధికారులను ఆదేశించారు.
తొలి నుంచి బీజేపీ అజెండా..
బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ అజెండాలో ఉన్న పలు కీలకాంశాల్లో యూసీసీ కూడా ఒకటి. కమలనాథుల మూడు ప్రధాన హామీల్లో పౌర స్మృతి కూడా ఒకటి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి మిగతా రెండు అంశాలుగా చెప్పుకోవాలి. ఆ రెండు అంశాలను సమర్థంగా అమలు చేసిన బీజేపీ..ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతిపై దృష్టి పెట్టింది.
యూసీసీని అమలు జరిపేందుకు కేంద్రం సిద్దంగా ఉందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇటీవల సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజుజు కొంత ముందుకెళ్లి.. 22వ లా కమిషన్ దీనిపై దృష్టి సారించిందన్నారు.
భవిష్యత్తు ఎన్నికల్లో లబ్ధికి అవకాశం
ఒక పక్క లోక్ సభ ఎన్నికలు మరోపక్క రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ తన అవకాశాలను మరింత పరిష్టం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది. జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్లో అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కూడా ఉమ్మడి పౌర స్మృతి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు..
ఆర్టికల్ 44 కీలకం…
సువిశాల భారత దేశంలో విభిన్న మతాలు, వేర్వేరు సంస్కృతులు, విభిన్న ఆచారాలు ఉన్న జనం ఐకమత్యంగా జీవిస్తున్నారు. కాకపోతే వారి సామాజిక జీవనానికి సంబంధించిన అంశాల్లో మాత్రం భిన్నత్వం, లోపభూయిష్టమైన ప్రక్రియ కనిపిస్తుంది. పెళ్లి, విడాకులు, వారసత్వ ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. అది జనంలో సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధమని బీజేపీ ఏనాడో గుర్తించింది, స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ వ్యత్యాసాలు గుర్తించిన వాళ్లు ఉమ్మడి పౌర స్మృతి అనివార్యతను వివరిస్తూ వచ్చారు.
మతం, లింగం వంటి వాటితో సంబంధం లేకుండా భారత పౌరులందరికీ యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయాలన్న డిమాండ్ మరోసారి బలపడుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టింది.
కొన్ని మత సంప్రదాయాలు, చట్టాలు అనాగరికంగా ఉన్నాయని బీజేపీతో పాటు దేశ ప్రజలు కూడా అంగీకరిస్తారు. వాటిలో మగ్గిపోతున్న జనం మార్పు కోసం కమలం పార్టీ వైపే చూస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 కూడా పౌర స్మృతిలో సమానత్వ ప్రతిపాదన ఉంది. త్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసే చట్టాన్ని 2019లో బీజేపీ అమలు చేసినప్పుడు ముస్లింలు కూడా హర్షం ప్రకటించారు. ముస్లిం మహిళలు బీజేపీ నేతలకు హారతులిచ్చారు.
యూనిఫాం సివిల్ కోడ్ వచ్చే వరకు లింగ సమానత్వం సాధ్యం కాదని బీజేపీ మేనిఫెస్టో కూడా చెబుతోంది. యూసీసీ వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని కొందరు మతవాదులు ప్రచారం చేస్తుండగా, అలాంటిదేమీ ఉండదని స్వయంగా సుప్రీం కోర్టు ప్రకటించింది. అందుకే పార్టమెంటు వర్షాకాల సమావేశాల్లోనే యూనిఫాం సివిల్ కోడ్ ను చట్టంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది.