మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం ?

మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు మళ్లీ మహారాష్ట్ర అధికార పీఠంపై ఆశలు పుట్టుకొచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఎస్సీపీ అధినేత మరాఠా స్ట్రాంగ్ మేన్ గా పిలిచే శరద్ పవార్ బంధువైన అజిత్, పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న రూమర్స్ ఒక రోజంతా చక్కర్లు కొట్టాయి. నిన్నటి ప్రభుత్వ పక్షం, నేటి విపక్షమైన ఎన్సీపీలో ఒక్కో ఎమ్మెల్యేతో ఆయన విడిగా సమావేశమై సంతకాల సేకరణ ప్రారంభించారని చెప్పుకున్నారు. ఎన్సీపీకి ఉన్న 53 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఆయనకు మద్దతిచ్చినట్లుగా కొందరు ప్రచారం చేశారు. అజిత్ పవార్ తన టూర్ ప్రోగ్రాంను కూడా రద్దు చేసుకుని ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వండి వార్చాయి.

సుప్రీం కోర్టు తీర్పు లోపే…

ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని దించేసి షిండే గద్దెనెక్కిన తర్వాత బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగమైంది. రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని లాగేసుకున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టులో వేసిన కేసు తీర్పు త్వరలో వస్తుందన్న వార్తల నడుమ అజిత్ కదలికలు కరెక్టేనని కొందరు మహారాష్ట్ర నేతలు అభిప్రాయపడ్డారు. షిండేను దించేసి, అజిత్ ను ఎక్కించడానికి ఎక్కువ సమయం అవసరం లేదని… మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ కోసం నిరీక్షిస్తున్నారని కూడా ప్రచారం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడకుండా పోలింగ్ తర్వాత ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతారని ఒక వర్గం ప్రచారం చేసింది. శరద్ పవార్ కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు కూడా అజిత్ తిరుగుబాటుకు సహకరిస్తున్నారని పార్టీలో కొందరు చెప్పుకున్నారు..

ఖండించిన మహా బీజేపీ

అజిత్ పవార్ తిరుగుబాటు ప్రయత్నాలంటూ వచ్చిన వార్తలను మహారాష్ట్ర బీజేపీ తీవ్ర స్వరంతో ఖండించింది. అవన్నీ రూమర్లేనని రాష్ట్ర బీజేపీ శాఖాధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కూలే కుండబద్దలు కొట్టారు. ఎన్సీపీ తమతో ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన ప్రకటించారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా ఈ వార్తలను తోసిపుట్టింది. అజిత్ పవార్ తో తాము మాట్లాడామని అలాంటి ప్రయత్నాలేమీ చేయబోవడం లేదని ఆయన తమకు చెప్పారని సంజయ్ రౌత్ వెల్లడించారు.

వార్తలపై అజిత్ పవార్ ఆగ్రహం

పార్టీలో అంతా సవ్యంగానే ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. రూమర్లను అణిచివేసేందుకు అజిత్ పవార్ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ట్వీట్ చేయడంతో పాటు అందుబాటులో ఉన్న విలేకర్లతో అజిత్ మాట్లాడారు. తాను ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్లు మీడియాలో వస్తోందని .. అలాంటి చర్యలకు ఉపక్రమించే ప్రసక్తే లేదని అజిత్ ప్రకటించారు.

ప్రధాని మోదీ నాయకత్వాన్ని అజిత్ పవార్ ఇటీవల మెచ్చుకున్నారు. దానితో రూమర్లు ప్రచారం చేసే వారు రంగంలోకి దిగి విపక్ష మహా వికాస్ అగాఢీలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు.. గతంలో ఓ సారి అజిత్ బీజేపీతో జతకట్టి అర్థరాత్రి డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అందుకే రూమర్లు ప్రచారం చేయడం కూడా వ్యతిరేక వర్గానికి సులభమైపోయింది.

ప్రభుత్వాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. ఎందుకంటే షిండేతో బీజేపీ కంఫర్టబుల్ గానే ఉంది. పైగా తరచూ ప్రభుత్వాలను మార్చితే చెడ్డ పేరు వస్తుందన్న సంగతి కూడా ఆ పార్టీకి తెలుసు….