Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజు అస్సలు బంగారం కొనకూడదు – ఎందుకంటే!

హిందువుల పండుగలన్నీ ఓ లెక్క..అక్షయ తృతీయ మరోలెక్క. పండుగ అనగానే తోరణాలు, కొత్తబట్టలు, పిండి వంటలు..ఇలా పండుగను బట్టి సందడి మారుతుంది. కానీ అక్షయ తృతీయ మొత్తం బంగారం చుట్టూనే తిరుగుతుంది. ఎవరికి కలిగింత బంగారం వాళ్లు కొనేసుకోవాలని తాపత్రయపడతారు. అక్షయ తృతీయ రోజు బంగారం దుకాణాల ముందు బారులు చూస్తే ఉచిత పంపిణీ జరుగుతోందేమో అనేంత అనుమానం వస్తుంది. అంతలా ఎగబడి కొనేస్తారు.. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందని చాలామంది సెంటిమెంట్.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలా – వద్దా
మగువలకు బంగారానికి విడదీయలేని అనుబంధం ఉంటుంది. బంగారం అన్న మాటవింటే కళ్లు మెరవని మహిళామణి ఉండదంటే అస్సలు అతిశయోక్తి కాదు. పైగా బంగారానికి మించిన పెట్టుబడి ఏముంటుంది. భారీగా కాసులుంటే బిస్కెట్లు కొంటే…నాలుగు కాసులు ఉన్నవాళ్లు కనీసం నాలుగు గ్రాములు కొని దాచుకుంటారు. పసిడి ఇంట్లో ఉంటే అదో భరోసా..అదో హోదా. బంగారం గురించి ఇంతబాగా చెప్పి కొనద్దంటున్నారు ఎందుకు అని అడగొచ్చు..మేం చెబుతున్నది బంగారం కొనొద్దు అని కాదు..అక్షయ తృతీయ సెంటిమెంట్ తో కొనొద్దు అని. ఏటా వైశాఖ మాసంలో వచ్చే మూడో రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల రెట్టింపు పుణ్యం లభిస్తుందంటారు పండితులు. ఈ రోజు చేసే దానధర్మాలు అక్షయం అయినట్టే పాపం చేసినా దానిఫలితం రెట్టింపు అనుభవించాల్సిందే. ముఖ్యంగా ఈరోజు వర్జ్యం, యమగండం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇలా ఏవీ పెద్దగా పట్టించుకోరు..వాటి ప్రబావం కూడా పెద్దగా ఉండదు. ఈ రోజు మొత్తం ఏ పని చేసినా దాని ఫలితం రెట్టింపు ఉంటుంది..అంత శుభకరమైన రోజు అక్షయ తృతీయ. అందుకే ఈ రోజు దానధర్మాలు చేయమని ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉందికానీ బంగారం కొనమని లేదంటారు పండితులు

అక్షయ తృతీయ అనగానే బంగారం అనే మాట ఎందుకొచ్చింది
బంగారానికి – అక్షయ తృతీయకు సంబంధం లేదా..అక్షయ తృతీయ అనగానే బంగారం అనే ప్రస్తావన ఎందుకొచ్చి మరి..అంటే… ఇది కేవలం వ్యాపారం పెంచుకునేందుకు చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నది కొందరి పండితుల అభిప్రాయం. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి… కానీ..దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు దానం చేయాలి. ఎందుకంటే.. బంగారం అహంకారానికి ప్రతీక, కలిపురుషుడు నివసించే ఐదు ముఖ్యమైన ప్రదేశాల్లో బంగారం ఒకటి…అంటే ఏరోకోరి కలిపురుషుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నట్టు…అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేస్తే కలిబాధల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనం. బంగారం దానం చేసే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి.. వేసవి కాలంలో ఉపయోగపడే వస్తువులు దానం చేయమంటారు పండితులు. కొత్తకుండలో నీళ్లుపోసి దానం ఇవ్వొచ్చు, అన్నదానం చేయొచ్చు, చెప్పులు-గొడుగు-విసనికర్ర ..ఇలాంటి వస్తువులు దానం చేసి పుణ్యాన్ని అక్షయం చేసుకోవాలంటారు. అక్షయ తృతీయ రోజు పోటీపడి బంగారం తెచ్చిపెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో కూర్చుంటుందన్నది కేవలం ప్రచారం మాత్రమే అని స్పష్టంగా చెబుతున్నారు పండితులు.

గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి, కొందరు పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం. దీనిని మీరు ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. సెంటిమెంట్ ని తక్కువ చేయడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదని గమనించగలరు.