ఎడారి రాష్ట్రంలో కాంగ్రెస్ కథ మొదటికొచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రోజుకో వివాదం రేగుతోంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ తాడో పేడో తేల్చుకునేందుకు జూనియర్ పైలట్ సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు తనకు కావాల్సిన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడిస్తారని నర్మగర్భంగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాజకీయ కురువృద్ధుడు గెహ్లాట్ రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా స్ట్రాంగ్ అనే చెప్పాలి. అందుకే ఆయన్ను దించడం అంత శ్రేయస్కరం కాదని కూడా అధిష్టానం భావించింది. యువ నాయకుడైన సచిన్ పైలట్ పట్ల సోనియా, రాహుల్ సహా పలువురికి సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ ఆయన్ను ప్రోత్సహించలేని పరిస్థితుల్లో ఉన్నారు…
నిరాహార దీక్ష చేసిన పైలట్
సచిన్ పైలట్ అనే నాయకుడొక్కడున్నాడని గుర్తించేందుకు గెహ్లాట్ వర్గం సుముఖంగా లేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని పైలట్ కు వదులుకోవాల్సి వస్తుందన్న అనుమానంతోనే ఏఐసీసీ అధ్యక్ష పదవికి గెహ్లాట్ పోటీ చేయలేదు. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా వార్తల్లో ఉంటూ ముఖ్యమంత్రి పదవికి పైలట్ గాలం వేస్తూనే ఉన్నారు. గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పైలట్ ఇటీవల ఒక నిరాహార దీక్ష చేశారు. వసుంధరా రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని దానిపై విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పుడు దీక్ష చేశారు. అదేమంటే కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే తానీ డిమాండ్ చేశానని గెహ్లాట్ ప్రభుత్వం పట్టించుకోలేదని పైలట్ అంటున్నారు. సొంత పార్టీ నేత దీక్షకు దిగడంతో కాంగ్రెస్ పోయింది..
రంగంలోకి కమల్ నాథ్
ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చి సమస్యను పరిష్కరించడంలో ఏఐసీసీ రాజస్థాన్ ఇంఛార్జ్ రణధావా ఫెయిలయ్యారని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. పైగా ఆయన గెహ్టాల్ వర్గానికి కొమ్ము కాస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. దానితో రాహుల్ గాంధీ జోక్యం మేరకు రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను మల్లిఖార్జున్ ఖర్గే ఇటీవల కమల్ నాథ్ మీద ఉంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి ఆయన పైలట్ ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పీసీసీ చీఫ్ కావాలట..
అధిష్టానం ప్రతినిధుల వద్ద పైలట్ తన మనసులో మాటను బయట పెట్టారు. గతంలో తాను నిర్వహించిన పీసీసీ చీఫ్ పదవిని తిరిగి కట్టబెట్టాలని పైలట్ కోరారు. ఎన్నికల వేళ టికెట్ల బట్వాడా, ప్రచారం, ఎన్నికల తర్వాత గెలిస్తే పదవుల పంపకంలో పీసీసీ చీఫ్ కీలక పాత్ర పోషిస్తారని సచిన్ భావిస్తున్నారు. దానితో ఇప్పుడు బంతి అధిష్టానం కోర్టులో పడినట్లయ్యింది. పైలట్ డిమాండ్ కు గెహ్లాట్ వర్గం ఒప్పుకుంటుందన్న నమ్మకం వారికి కలగడం లేదు. దానితో ఇప్పుడు ఇరు వర్గాలను ఒక తాటిపైకి తెచ్చే చర్చలు నత్తనడకన నడుస్తున్నాయి..
పైలట్ పై అమిత్ షా సెటైర్లు
పైలట్ గారు… మీ నెంబర్ ఎప్పటికీ రాదు.. అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేసిన సెటైర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా.. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించారు. అవినీతి సొమ్మును తీసుకెళ్లి గెహ్లాట్ … కాంగ్రెస్ ఖజానా నింపుతున్నందునే అధిష్టానం ఆయన్ను తొలగించడం లేదని షా అన్నారు. పైలట్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ సీఎంతో పోల్చితే అవినీతిలో పైలట్ వాటా తక్కువగా ఉందని ఆయన విశ్లేషించారు. అవినీతి, ఆరాచకం, దళితులపై దాడుల్లో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం నెంబర్ వన్ గా ఉందని అంటూ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మట్టి కరవడం ఖాయమని అమిత్ షా జోస్యం చెప్పారు.. సచిన్ పైలట్ ఎప్పటికీ సీఎం కాలేడని ఆయన అన్నారు..