ఒక్క పది సెకన్ల వీడియో.. మొత్తం ఇమేజ్ డ్యామేజ్ చేసేసింది. వందలకోట్లు ఖర్చు పెట్టి కొంత కాలంగా నిర్మించుకుంటున్న ఇమేజ్.. ఒక్క సారిగా రివర్స్ అయిపోయింది. ఇది భారత రాష్ట్ర సమితి… ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ గురించే. నిజామాబాద్ ఆస్పత్రిలో ఓ రోగిని తల్లిదండ్రులు లిఫ్ట్ లోకి ఎక్కించడానికి స్ట్రెచర్ లేక.. వీల్ చైర్ దొరక… ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించాయి. దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇంత దారుణమైన దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత కాలం… తెలంగాణ అంటే ఓ అద్భుతమైన అభివృద్ధి మోడల్ అని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకంటున్నారు. గుజరాత్ మోడల్ కన్నా తెలంగాణ మోడల్ గొప్ప అని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం అది. ఇప్పుడు పూర్తిగా వికటించంది.
గుజరాత్ మోడల్ కు ధీటుగా తెలంగాణ మోడల్ అని కేసీఆర్ విస్తృత ప్రచారం
గుజరాత్ మోడల్ అభివృద్ధితో దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ పేరు తెచ్చుకున్నారని.. ఇప్పుడు అదే మోడల్ ప్రకారం.. తాను ఎదగాలని కేసీఆర్ ప్లాన్ వేసుకున్నారు. అందుకే తెలంగాణ మోడల్ ను తెరపైకి తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో అన్ని మీడియా సంస్థలకూ పెద్ద పెద్ ప్యాకేజీలు ఇచ్చి మరీ ప్రచారం చేయించుకున్నారు. హిందీ, ఇంగ్లిష్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని న్యూస్ చానల్స్ లో కూడాతెలంగాణ మోడల్ అభివృద్ధి అని ప్రచారం చేసుకున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి … తెలంగాణ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అన్నట్లుగా చర్చ జరిగేలా చూడాలని అనుకున్నారు. అప్పుడే తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతుందని .. అలా జరిగినప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర బలంగా వేస్తారని నమ్ముతున్నారు. ఎలా చూసినా..కేసీఆర్ జాతీయ పార్టీతో నేషనల్ మీడియా సంస్థలన్నింటికీ కలిపి రెండు, మూడు వందల కోట్ల వరకూ పెట్టారని చెబుతారు.
పది సెకన్ల వీడియోతో రివర్స్ అయిన ప్రచారం
అయితే ఇప్పుడు ఒక్క సారిగా సీన్ రివర్స్ అయిపోయింది. నిజామాబాద్ జిల్లాలో స్ట్రెచర్ దొరకని రోగిని ఈడ్చుకు వెళ్తున్న దృశ్యాలు జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ వీడియో తెలంగాణలో కన్నా ఇతర రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే తెలంగాణలో వైద్య పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేందగా వైరల్ అయింది. దాదాపుగా ప్రతీ వాట్సాప్ ఖాతాకూ చేరింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ భార్య భర్త తన కుమారుడ్ని ఈడ్చుకుంటూ పోతున్నారు. ఎక్కడో అయితే సరే అనుకోవచ్చు.. కానీ అది ప్రభుత్వ ఆస్పత్రిలో. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం తన బిడ్డను తీసుకు వచ్చిన తల్లిదండ్రులు.. రెండో అంతస్తుకు తీసుకెళ్లడానికి స్ట్రెచ్చర్ దొరకలేదు. లిఫ్ట్ వరకూ అలా లాక్కుంటూ తీసుకెళ్లిపోయారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కి పడింది.
వందల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనా ?
అది ఉద్దేశపూర్వకంగా తీసిన వీడియో అని.. పూర్తిస్థాయిలో ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇలా చేశారని చెప్పుకుంది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత కవరింగ్ అనే అనుకుంటారు.ఇక్కడాఅదే జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ వాదన ఎవరికీ పట్టడం లేదు. ఆ వీడియో మాత్రమే వైరల్ అవుతోంది. సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం తంటాలు పడుతోంది. రూ. వందల కోట్లు ఖర్చు పెట్టుకుని తెచ్చుకున్న ఇమేజ్ కాస్తా ఇలా పది సెకన్ల వీడియోతో నేల నవ్వుల పాలయిందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.