వివేకా హత్య కేసులో వరుస అరెస్టులు – టీడీపీకి షాక్ ! ఎందుకో తెలుసా ?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయమే భాస్కర్ రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో వెళ్లిన సీబీఐ అధికారులు .. అరెస్టు చేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చి వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసారు. మరో వైపు అవినాష్ రెడ్డి పులివెందులలో లేరు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. అయనను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఆదివారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్లను అరెస్ట్ చేస్తే టీడీపీకి ఎందుకు షాక్ అంటే.. అసలు ఈ విషయంలో కేంద్రంపై… బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేసింది ఆ పార్టీనే. విచారణాధికారిని మార్చారు ఇక కేసు షెడ్డుకెళ్లిపోతుంది అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. కానీ ఇప్పుడే కేసులో పూర్తి స్థాయిలో స్పీడ్ కనిపిస్తోంది.

దర్యాప్తు అధికారిని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మార్పించుకున్న నిందితులు

పట్టుబట్టి మరీ .. సుప్రీంకోర్టు దాకా వెళ్లి దర్యాప్తు అధికారిని మార్పించుకున్నారు వివేకా హత్య కేసు నిందితులు. కొద్ది రోజులుగా సీబీఐ సైలెంట్ గా ఉండటంతో తమ ప్లాన్ వర్కవుట్ అయిందనుకుని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకుని దిలాసాగా ఉన్న అవినాష్ రెడ్డికి సీబీఐ వరుస షాకులు ఇస్తోంది. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి… రిమాండ్ రిపోర్టులో అసలు ఏం జరిగిందో చెప్పిన సీబీఐ… తర్వాతి రోజే తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. నిందితులు రకరకాల పిటిషన్లు వేసి.. అనేక రకాల ఆరోపణలు చేస్తూ.. చివరికి దర్యాప్తు సంస్థపైనా పిటిషన్లు వేసి ఒత్తిడి తెచ్చి దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేశారు . ఇప్పుడు అాలాంటి ప్రయత్నాలకు క్లైమాక్స్ పడినట్లయింది. ఒకటి, రెండు రోజుల్లో వివేకా హత్య కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సీబీఐ దూకుడు ఇప్పుడు అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తోంది.

వివేకా హత్య కేసులో నిందితుల్ని బీజేపీ రక్షిస్తోందని టీడీపీ ప్రచారం !

వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జరిగినప్పుడు… ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. ఏం మాట్లాడతారో కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి వస్తారు. ఆ తర్వాత ఏపీలో విపక్షం ఓ ప్రచారం ప్రారంభిస్తుంది. ఇదిగో అరెస్ట్ దాకా వచ్చిన వివేకా హత్య కేసు ఆగిపోయింది. ఇదంతా బీజేపీ, వైసీపీ కలసి కట్టుగా ఆడుతున్న నాటకం అంటూ ప్రచారం చేస్తారు. కానీ సీబీఐ దర్యాప్తు అంటే.. . ఎలా ఉంటుందో ఇప్పుడు వారికి ఓ క్లారిటీ వస్తుంది. వారనుకున్నప్పుడు కాదని సీబీఐ అన్నీ పక్కాగా రెడీ చేసుకున్న తర్వాతనే అరెస్టులు చేస్తుందని స్పష్టమయింది. ఈ అరెస్టులతో టీడీపీ.. తాము బీజేపీపై.. నిందలు వేశామని సులువుగానే అర్థం చేసుకుంటారు.. అందుకే షాక్ అనేది.

హత్య కేసు నిందితుల్ని ఎవరైనా రక్షిస్తారా ?

అవినీతి కేసుల విచారణ ఆలస్యం కావొచ్చమో కానీ అత్యంత ఘోరమైన హత్యల నిందితుల్ని ఎవరూ రక్షించరు. ఎప్పటికైనా వారికి శిక్షపడాల్సిందే. అధికారంలో ఉన్నారని కొంత కాలం దర్యాప్తును విచారణను అడ్డుకోగలుగుతారు కానీ.. .. తర్వాత అయినా శిక్షకు గురవ్వాల్సిందే. ఇలాంటి వారిని రక్షిస్తారని… రక్షించగలమని ఎవరూ అనుకోరు. గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రచారాలు చేసిన వారికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నట్లే.