స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూలో అసలేమీ లేకుండా క్రెడిట్ కోసం కేసీఆర్ దగ్గర్నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చేసిన విన్యాసాలు ఒక్క రోజుకో బోర్లా పడ్డాయి. వారిని నవ్వుల పాలు చేశాయి. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం వెంటనే పాఠాలు నేర్చుకున్నట్లుగా లేరు. మళ్లీ ఒక్క రోజులోనే.. కేంద్రం మెడలు వంచిన కేసీఆర్ అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. దీనికి కారణం కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం . ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటే ఇది తమ వల్లేనని బీఆర్ఎస్ ప్రకటించుకుంది. దీంతో సోషల్ మడియాలో ఆ పార్టీ నేతల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
కేంద్రం తమ డిమాండ్లకు స్పందిస్తోందని చెప్పుకోవాలని బీఆర్ఎస్ ఆరాటం
కేసీఆర్ దెబ్బ.. కేంద్రం అబ్బ అని..దాదాపుగా ప్రతీ రోజూ ఓ డైలాగ్ చెప్పుకోవడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్కు భయపడే తీసుకున్నారని చెప్పడం ప్రారంభించారు. తాజాగా సాయుధ బలగాల్లో పనిచేయాలనుకునే యువత ఇక నుంచి ప్రాంతీయ భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ కేవలం హిందీ, ఇంగ్లీష్ లోనే నిర్వహించే ఈ పరీక్షలను ఇక నుంచి ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనుంది. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు.. వచ్చేఏడాది జనవరి 1 తేదీ నుంచి ఈ విధానం కానుంది.
కేంద్రం ఇలా ప్రకటన చేయగానే అలా క్రెడిట్ గేమ్
ఇలా కేంద్రం ఈ ప్రకటన చేయాగనే బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఇదే డిమాండ్‌తో కేటీఆర గతంలో అమిత్ షాకు లేఖ రాశారని ఆ లేఖను విడుదల చేసి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని జత చేసి.. చూశారా బీఆర్ఎస్ దెబ్బ అన్నట్లుగా ప్రచారం ప్రారభించారు. నిజానికి ఇది కేటీఆర్ చేసిన డిమాండ్ మాత్రమే కాదు.. చాలా ఏళ్లుగా ఉన్న డిమాండ్. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా పరిశీలనలు జరిపింది. కమిటీలను ఏర్పాటు చేసింది. చివరికి అన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే చాన్స్ అనుకుని బీఆర్ఎస్ క్రెడిట్ గేమ్ ప్రారంభించింది.
ప్రజలకు నిజం తెలియదా .. బీఆర్ఎస్కు ఎందుకీ ఆరాటం !
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పారని బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది. కేసీఆర్ దెబ్బ అని గొప్పలు చెప్పుకుంది. తీరా సాయంత్రానికి కేంద్రం గాలి తీసేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ సైలెంట్ అయింది. అయితే వెంటనే మరో చాన్స్ దొరకింది. బీఆర్ఎస్ నేతలు ఏ మాత్రం ఆలోచించకుండా ఎలివేషన్లు ప్రారంభించుకున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ పార్టీకి క్రెడిట్ దక్కాలనే అత్యుత్సాహంతో బిలో ది లైన్ రాజకీయం చేస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.