గుణశేఖర్ పై టీడీపీ అభిమానుల అటాక్. అసలేం జరిగిందంటే..?

కాలం కలిసిరాకపోతే.. తాడు కూడా పామై కాటేస్తుంది అనేది సామెత. ఈ సామెత గురించి డైరెక్టర్ గుణశేఖర్ గతంలో వినకపోయినా… ఇప్పుడు మాత్రం స్వయానా అనుభవిస్తున్నాడు. అరె అప్పుడు ఎందుకు ఆవేశపడ్డానా అని ఇప్పుడు తలపట్టుకుని కూర్చున్నాడు. దానికి ఒక కారణం శాకుంతలం సినిమాకు నెగిటివ్ టాక్ రావడం ఒక కారణం అయితే… టీడీపీ అభిమానులు ఎదురుదాడికి దిగడం మరో కారణం.
శాకుంతలం సినిమా అలా రిలీజ్ అయ్యిందో గుణశేఖర్ పై, అలాగే సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా విడుదలైన తర్వాత నెగిటివ్ ట్రోల్స్ కామనే. కానీ ఈసారి గుణశేఖర్ ఎదుర్కొంటున్న ట్రోల్స్ ఎక్కువగా టీడీపీ అభిమానుల నుంచే. అసలు టీడీపీ అభిమానులకు, డైరక్టర్ గుణశేఖర్ కు సంబంధం ఏంటి అంటే ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిందే.
అసలేం జరిగింది?
రామాయణం, మనోహరం, ఒక్కడు లాంటి అత్యద్భుతమైన సినిమాలు తీసిన గుణశేఖర్ కొన్నాళ్లు నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోతున్నాడు. బయట నిర్మాతలు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో.. తానే నిర్మాతగా మారి సినిమాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుణ టీమ్ వర్క్స్ పేరుతో 2015 రుద్రమదేవి సినిమా తీశారు. సినిమాకు బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి పన్ను మినహాయింపు కావాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కోరారు. కానీ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రుద్రమదేవి సినిమాకు ఎలాంటి పన్ను మినహాయింపు ఇవ్వలేదు. కానీ రెండేళ్ల తర్వాత వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణికి ఇచ్చారు. దీంతో.. తనకు కాకుండా బాలయ్య సినిమాకు ఎలా ఇస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టారు గుణశేఖర్. అంతటితో ఆగకుండా… ప్రశ్నించడం తప్పా అనే టైటిల్ తో ఒక లేఖను కూడా రీలీజ్ చేశారు. అలాగే నంది అవార్డుల విషయంలో కూడా తన సినిమాను కాదని గౌతమి పుత్ర శాతకర్ణికి ఇచ్చారని విమర్శించారు. ఇదే టీడీపీ అభిమానుల కోపానికి కారణం అయ్యింది.
పగ తీర్చుకుంటున్నారా?
రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేసిన సినిమా శాకుంతలం. ఎప్పటినుంచో గుణశేఖర్ నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్న టీడీపీ అభిమానులు… సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో.. సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్నించు అని ట్వీట్లు చేస్తున్నారు. ప్రశ్నించడం మీద పెట్టిన శ్రద్ధ సినిమా కంటెంట్ పై పెడితే శాకుంతలం హిట్ అయ్యేదని, తిక్క బాగా కుదిరిందని ట్రోల్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. శాకుంతలం సినిమాను ఆస్కార్ కు పంపాలని, ఆస్కార్ రాకపోయినా కనీసం భాస్కర్ అవార్డు అయినా వస్తుందని కామెడీ చేస్తున్నారు. మొత్తానికి శాకుంతలం సినిమా ఫ్లాప్ అయ్యిందన్న బాధలో ఉన్న గుణశేఖర్ కు, టీడీపీ అభిమానుల ట్వీట్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.